Telangana:
తెలంగాణలో వేసవి వేడితో పాటు రాజకీయాలు కూడా వేడెక్కబోతున్నాయి. 15 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ టైం ముగిసింది. ఈ కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుకు పరీక్షగా టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో అంతర్గతంగా ఉన్న సవాళ్లపై మరింత స్పష్టత కూడా రానుంది.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆరేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి భారీ విజయం సాధించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది. ఈసారి జీవన్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి దూరంగా ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఇక్కడ గెలుపు అత్యవసరంగా మారింది. ఏమైనా తేడా వస్తే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోనే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ కూడా ఉండటంతో ఆయనతో పాటు కాంగ్రెస్కు ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. అయితే, ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికకు సరిగ్గా సన్నద్ధం కాకుండానే కాంగ్రెస్ బరిలోకి దిగింది.
ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 42 అసెంబ్లీ సెగ్మంట్లు ఉండగా, వాటిలో కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలుపొందింది. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల నాటికి బలహీనపడిన కాంగ్రెస్ కరీంగనర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పార్లమెంట్ నియోకవర్గాల్లో ఓడిపోయి, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో గెలిచింది. ఆరు నెలల పరిధిలోనే ఎందుకు ఈ ప్రాంతాల్లో పార్టీ బలహీనపడిరదనే విషయాన్ని సమీక్షించుకోవడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైంది. ఈ గ్రాడ్యూయేట్స్ నియోజకవర్గంలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రులే లేరు. మరోవైపు ఎన్నో ఆశలతో కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టినా ఆశించిన ఏ మార్పు రాలేదనే భావనలో నిరుద్యోగులు ఉన్నారు. ఈ ప్రభావాలన్నీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనపడబోతోంది.
అధికారంలో ఉండి అన్ని వనరులు ఉన్నా చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ ప్రణాళిక రాహిత్యానికి నిదర్శనం. ఎన్నికలున్నాయని తెలిసి కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సహా ముఖ్యమైన నాయకులు విదేశీ పర్యటనల్లో గడిపారు. నామినేషన్కి వెళ్లడం తప్ప ముఖ్య నాయకులు సీరియస్గా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు లాంటి వ్యూహకర్తలు, ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉండి కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను ముందస్తుగా అంచనా వేసుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చేత సమావేశాలు ఏర్పాటు చేయడం పార్టీకి నష్టం చేకూర్చవచ్చు.
గతంలో కంటే భిన్నంగా ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి చేత సమావేశాలు నిర్వహించినా కాంగ్రెస్కు అది సెల్ఫ్ గోల్ అయ్యే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా పోయేదేమీ లేదని స్వయానా సీఎం సభా వేదికగా వ్యాఖ్యానించడం ఎన్నికల ముందే అధికార పార్టీ చేతులెత్తేసినట్లు అయ్యింది. అంతేకాక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా, ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలవడం వ్యూహాత్మక తప్పిదమే. ఈ నేపథ్యంలో ఒక వేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే పార్టీలో అసమ్మతి గొంతులు పెరుగుతాయి. అవి తాత్కాలికంగా పాల పొంగులాగా కరిగిపోవచ్చేమో కానీ, దీర్ఘకాలంలో పార్టీకి నష్టం చేకూర్చడం ఖాయం. కాంగ్రెస్ కూడా గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ లాగే ‘‘పట్ట భద్రులు మా ఓటర్లు కాదు’’ అనుకుంటే మరింత నష్టపోవాల్సి వస్తుంది.
పట్టభద్రుల ఎన్నికల్లో యువత కీలక ఓటర్లని తెలిసినా, కాంగ్రెస్ అనుబంధ సంస్థలైన ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ శ్రేణులు సమన్వయ లోపంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం పార్టీకి కోలుకోలేని దెబ్బే. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన వేళ పార్టీలో కొందరు కీలక నేతలే కోవర్టులు పనిచేశారనే గుసగుసలు కాంగ్రెస్లో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలొస్తే, ఆందుకు బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్నలొస్తున్నాయి. ఇందుకు సీఎం లేదా టీపీసీసీ అధ్యక్షులు లేదా ఇన్చార్జీ మంత్రులు బాధ్యత వహిస్తారా వేచి చూడాలి.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం కనిపించింది. ప్రజల్లో, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం వ్యూహాత్మక తప్పిదమే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. కరీంనగర్ గడ్డ మీదే బీఆర్ఎస్ పురుడు పోసుకుని, అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ అరెస్టయింది కూడా ఆ గడ్డ మీదే! ఇలాంటి చరిత్రాత్మక ప్రాంతంలో పోటీకి దూరంగా ఉండటం బీఆర్ఎస్ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ ఇటీవల చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చి 25 సంవత్సరాల వేడుకలు గురించి మాట్లాడినా, ఎమ్మెల్సీ ఎన్నికల గురించే ప్రస్తావించలేదు. బీఆర్ఎస్ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలని పార్టీ అధినేత దశ దిశ చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే, ఆ పార్టీ బలపడిరదనే ప్రచారం జరిగితే బీఆర్ఎస్కు నష్టమే.
మరోవైపు బీఆర్ఎస్లో అంతర్గత సంక్షోభాలు కూడా ఈ ఎన్నికల తర్వాత మరింత బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాస్ లీడర్గా గుర్తింపు పొందిన హరీశ్రావుకు పార్టీలో సరైన ప్రాధాన్యత, గౌరవం ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఖాళీని బీజేపీ ఆక్రమించే అవకాశాలుంటాయి. 2018లో గెలిచిన తర్వాత హరీశ్ రావ్కు మంత్రి పదవి ఇవ్వలేదు. తర్వాత ఇచ్చినా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ ప్రభావం 2023 ఎన్నికల మీద పడిరది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయనకు సరైన ప్రాధాన్యత, గౌరవం ఇవ్వకపోతే బీఆర్ఎస్ శాశ్వతంగా నష్టపోయే అవకాశాలున్నాయని ఆ పార్టీ కార్యకర్తలే అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు.
కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్లో సొంత దుకాణం తెరిచినట్టు కనిపిస్తుంది. పార్టీ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించడం, అనేక అంశాలపై ఒక ప్రణాళిక లేకుండా మాట్లాడటం, ఆమెను, ఆమె కార్యక్రమాలను కేసీఆర్ కూడా నియంత్రించకపోవడం, కేటీఆర్కి ఆమెకు మధ్య సఖ్యత లేకపోవడం పార్టీలో అనేక సందేహాలకు తావిస్తున్నాయి. కేటీఆర్ మాట్లాడే మాటల్లో సబ్జెక్టు ఉంటున్నా ఆయన మాటల్లో ధ్వనిస్తున్న అహంకారం వల్ల ఇప్పటికీ ఆయనపై ప్రజల్లో ఉన్న అసహనం తగ్గలేదు. ఆయన అందరినీ కలుపుకుపోవడం లేదనే భావన పెరగడం బీఆర్ఎస్ గ్రాఫ్ని మరింత దెబ్బ తీస్తోంది. పార్టీలో ఉన్న మూడు ముక్కలాటలతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో బీజేపీ 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. అనంతరం లోక్సభ ఎన్నికల్లో తమ ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. కానీ బీజేపీ మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యూహాత్మక తప్పిదాలు కొనసాగిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించి, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత బండి సంజయ్ను తొలగించారు. గతంలో సంజయ్ని పాదయాత్ర ఎందుకు ప్రారంభించమన్నారు? ఎందుకు అర్థంతరంగా ముగించమన్నారో ఆ పార్టీలో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయకుండా సానుకూల వాతావరణం ఉన్న క్రమంలో మునుగోడు ఉపఎన్నికను కొని తెచ్చుకుని బీజేపీ తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కొని కోలుకోలేని విధంగా దెబ్బతింది.
ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే దానిపైనే బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రామచంద్రారావు పోటీలో ఉన్నప్పటికీ, పార్టీలో అంతర్గతంగా బండి సంజయ్కే ఎక్కువ ఆమోదం ఉంది. ఆర్ఎస్ఎస్ వర్గాలతో పాటు, పార్టీని అభిమానించేవారు కూడా బండి సంజయ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయనలో అనేక లోపాలుండవచ్చు కానీ, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను ఎవరూ కాదనలేరు. రేవంత్ రెడ్డిలో ఎన్ని లోపాలున్నా కాంగ్రెస్ని ఆయనే రక్షించగలడని ఎలాగైతే అనుకున్నారో అలాగే బండి సంజయ్తోనే బీజేపీ విజయం సాధ్యం అవుతుందని ఎక్కువమంది కార్యకర్తలు నమ్ముతున్నారు.
పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న ఈటల రాజేందర్కు హుజురాబాదులో గెలిచినప్పుడు ఉన్నంత గ్లామర్ ఇప్పుడు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హుజురాబాద్కే పరిమితం కాకుండా అత్యాశతో గజ్వేల్లో కూడా పోటీ చేయడంతో రెండు చోట్లా ఓడిపోయారు. అనంతరం మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినా మునుపటి క్రేజ్ మాత్రం లేదు. ఆయన రాజకీయ ప్రవేశ నేపథ్యం కూడా ఆర్ఎస్ఎస్కు ఆమోదయోగ్యం కాదు. వ్యూహాత్మకంగా రాజేందర్ని కేంద్ర మంత్రిగా తీసుకుని, సంజయ్ని మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలనే అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. కుల సమీకరణాల దృష్ట్యా రఘునందన్ రావు కేసీఆర్ సామాజికవవర్గానికి చెందిన వారు కాబట్టి ఆయన్ను పరిగణలోకి తీసుకునే అవకాశాలు తక్కువ. మరోనేత మురళీధర్రావుదీ ఇదే పరిస్థితి. అంతేకాక ఈయన మొదటి నుంచి పార్టీవాది అయినప్పటికీ జనానికి పెద్దగా తెలిసిన మనిషి కాదు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మరో నేత రాంచందర్రావుకు మాస్ లీడర్గా గుర్తింపు లేదు.
రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీకి అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీ మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో గట్టిపోటీ ఇస్తున్నా, పార్టీలో మొదటి నుండి కష్టపడి టికెట్ దక్కని వారు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ తరఫున బరిలోకి దిగిన అంజిరెడ్డి క్షేత్రస్థాయిలో కార్యకర్తల కంటే బడా నేతలను కలుసుకోవడానికే ప్రాధాన్యతిస్తుండడంతో నెగటివ్గా మారుతోంది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీకి బీజేపీ నుండి పోటీ చేస్తున్న మల్క కొమరయ్య గట్టి పోటీ ఇస్తూ బీజేపీలో ఆశలో నింపుతున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ పడుతున్న బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి పోటీ నామమాత్రంగానే కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో బీజేపీ విజయానికి సంఘ్ పరివార్ కృషి చేస్తున్నా పార్టీ తప్పుడు వ్యూహాలతో ఆశించిన ఫలితాలు రావడం కష్టమే అని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
అధికారంలో ఉన్నా కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపించలేకపోతుండటం, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వ్యూహపరమైన పొరపాట్లు చేస్తుండటం, బీజేపీ దేశ వ్యాప్తంగా బలపడుతున్నా, తెలంగాణలో అంతర్గత కలహాలు ఇంకా కొనసాగుతుండటం.. ఇలా మూడు పార్టీలూ ప్రస్తుతానికి సంక్షోభ సంక్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆ పార్టీలకు, వాటి లక్ష్యాలకు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ వైకుంఠపాళిలో ఎవరి స్థానం ఎలా మారుతుందో తెలుస్తుంది.
-జి.మురళీ కృష్ణ,
సీనియర్ రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.