తెలంగాణలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశించిన కేసీఆర్ ఆశలను వమ్ముచేస్తూ తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో మార్పుకు ఓటు వేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కలిసి రావడంతో బొటాబొటి ఆధిక్యతతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే 2018తో పోలిస్తే 2023లో బీజేపీ ఓట్ల శాతాన్ని రెట్టింపు చేసుకోవడంతో ఆ పార్టీ రాష్ట్రంలో క్రియాశీలకంగా మరబోతోందని చెప్పవచ్చు.
వాస్తవానికి తెలంగాణలో మొదటి నుండి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను పెద్దఎత్తున ఎండగడుతూ బీజేపీయే ప్రజలకు చేరవయ్యింది. ఆ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్‌లోని పలువురు నేతలు అధికార పార్టీతో కుమ్మక్కు కావడంతోపాటు పార్టీలో పదవుల కోసం కొట్లాడుతూ ప్రజా సమస్యల గురించి పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో పొంతనలేని మాటలతో కాంగ్రెస్ మభ్య పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తుండడంతో రాబోయే లోక్‌సభ ఎన్నికలు ఓటర్ల విజ్ఞతకు మరోసారి పరీక్షగా మారనున్నాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మునిగిపోయిన నావ కాగా, కాంగ్రెస్ మునిగిపోతున్న నావాగా ఉంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు పూర్తి సానుకూలంగా మారుతున్నారని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ ద్వారా వెల్లడవుతోంది. 2018లో కేవలం 6.8 శాతం ఓట్లతో ఒక్క సీటు మాత్రమే గెల్చుకున్న బీజేపీ, ఈ సారి ఓట్లను వంద శాతానికిపైగా పెంచుకొని 14 శాతం ఓట్లతో 8 సీట్లను సాధించింది. రాష్ట్రంలో అందరినీ ఆకర్షించిన కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన నేతలు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరినీ ఓడిరచి బీజేపీ సంచలనం సృష్టించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లను గెలవడంతోపాటు 19 స్థానాలలో రెండో స్థానంలో నిలబడిరది. మరో 24 స్థానాల్లో 50 వేల నుండి 1 లక్ష వరకు ఓట్లు తెచ్చుకుంది. 75 స్థానాలలో 20 వేలకు మించి ఓట్లు పొందింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందని 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీకి స్థానిక పరిస్థితుల దృష్ట్యా తాము ఓటు వేస్తున్నా, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జాతీయ అంశాల దృష్ట్యా బీజేపీకే ఓటు వేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ప్రజలు బహిరంగంగానే చెప్పడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఆత్రుతతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడి అలవిగాని హామీలతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేశాయి. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అంటూ కాంగ్రెస్ గ్రామస్థాయి వరకు దుష్ప్రచారం చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అనుకూలంగా మల్చుకోగలిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో పెత్తనం చేలాయించిన పలువురు ఉన్నతాధికారుల వ్యవహారాలను విమర్శించిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక వారికి కీలక పోస్టింగులు ఇస్తుండటాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన లక్షల కోట్ల రూపాయల అవినీతిని బట్టబయలు చేయకుండా, ఈ అంశాన్ని నిర్వీర్యపరిచే ప్రయత్నాన్ని స్వయంగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రే చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మేడిగడ్డ కుంగిపోయిన ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక సిట్టింగ్ జడ్జీతో విచారణ అంటూ కాలయాపనకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తలకు మించిన కేసులతో సతమతమవుతున్న మన న్యాయస్థానాలు సిట్టింగ్ జడ్జీలను విచారణ కోసం వినియోగించే పరిష్టితుల్లో ఉన్నాయా?
ఇటీవల మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం ఎంతసేపు ప్రాజక్టు కాంట్రాక్టర్లపై విమర్శలు గుప్పించడమే గాని గత ప్రభుత్వం చేసిన అవినీతిపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డ్డి నోరు మెదపకపోవడం గమనార్హం. గత ప్రభుత్వ అవినీతిని సహ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తావించే ప్రయత్నం చేస్తే ఆయనను ఇరిగేషన్ మంత్రి నివారించడాన్ని ప్రజలంతా గమనించారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కన్నా అధికారమే పరమావధిగా సాగుతున్నాయి. అంతేకాక దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ మాత్రమే కావడంతో జాతీయ స్థాయిలో లోక్‌సభ ఎన్నికలకు పార్టీకి నిధులను సమకూర్చాల్సిన భారం ఈ రెండు ప్రభుత్వాలపై పడుతోంది. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని అవినీతిపరులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపించడం లేదు.
మరోవైపు గత పదేళ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందేలా చర్యలు తీసుకుంటోంది. నేడు భారత్‌ను ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తిగా బీజేపీ ప్రభుత్వం నిలబెట్టింది. మోదీ ప్రభుత్వం తెలంగాణలో 9 లక్షల కోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రహదారులు, రైల్వే పథకాలు, సాగునీటి పథకాలకు వనరులను సమకూరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసింది. తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి తనవంతు తోడ్పాటు, సహకారం అందిస్తుందని, ఇది మోదీ గ్యారంటీ అంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు భోరోసా ఇచ్చారు.
ప్రస్తుతం తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ ఫథకాలను కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా అమలు చేయలేని పరిస్థితులున్నాయి. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డు వంటి పలు నూతన కార్యక్రమాలను చేపట్టింది. సంపన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌కు దక్కింది. కేసీఆర్ తెలంగాణను అప్పులమయంగా మార్చారని ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధుల సాయాన్ని కోరారు. అయితే ఏయే పథకాలకు, ఏమేరకు నిధులు అవసరమో నిర్దుష్టమైన ప్రతిపాదనలను మాత్రం ఆయన కేంద్రం ముందుంచలేకపోతున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఆరు గ్యారంటీల అమలుకు ఏవిధంగా నిధులు సమకూర్చుకుంటారో చెప్పలేని పరిస్థితులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది.
పుష్కలమైన వనరులు, నైపుణ్యతను కలిగున్న తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి చేయాలంటే కేంద్రంలోని బీజేపీ మద్దతు తప్పనిసరి. దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడినా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని పదవికి సంబంధించి మోదీకి ఇతర పార్టీల నేతలెవరూ పోటీ ఇవ్వలేకపోతున్నారు. తెలంగాణలో నిర్వహించిన పలు సర్వేలలో కూడా మోదీయే ప్రజాదరణ నేతగా కనిపిస్తున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా దేశంతోపాటు తెలంగాణలో కూడా వేగవంతమైన అభివృద్ధి, పురోగతి కోసం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మూకుమ్మడిగా బీజేపీకి ఓటు వేయవలసిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేల ధృడమైన సంకల్పాన్ని దేశ ప్రజల ముందు ప్రధాని మోదీ ఉంచారు. ఆమేరకు దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే విధంగా మోదీ ప్రణాళికలు చేపట్టారు. ఈ లక్ష సాధనలో తెలంగాణ కూడా భాగస్వామిగా ఉండేందుకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా గెలిపించేందుకు తెలంగాణలో బీజేపీని 35 శాతం ఓట్లతో కనీసం పది స్థానాల్లో గెలిపించి స్పష్టమైన తీర్పును ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చారు. మోదీ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలు చూపుతున్న ఆసక్తి ఆయనలో విశ్వాసం కలిగిస్తున్నట్లు చెప్పవచ్చు.
దేశంలో అవినీతిరహిత పాలన, సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం, వేగవంతమైన అభివృద్ధి, దేశ రక్షణ, దేశ సమైక్యత, దేశ సమగ్రత నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యమని దేశ ప్రజలు బీజేపీపై ఎంతో భరోసాతో ఉన్నారు. గతంలో అతుకులబొంతల సంకీర్ణ ప్రభుత్వాలతో దేశం అభివృద్ధిలో వెనకబడి ఎంతో నష్ట పోయింది. దీంతో ప్రజలు సంకీర్ణ ప్రభుత్వాలంటే విసుగెత్తిపోయారు.
మోదీ చరిష్మాను అడ్డుకునేందుకు మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలో పలు పార్టీలు ‘ఇండియా’ కూటమి పేరుతో లోక్‌సభ ఎన్నికలకు సిద్దమవుతున్నారు. అధికారమే లక్ష్యంగా ముందుకొస్తున్న ఈ కూటమి నేతలకు స్వప్రయోజనాలు మినహా దేశ అభివృద్ధి పట్ల, ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని ఇటీవల ఆ కూటమిలో ఏర్పడుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజలు మరోసారి నరేంద్ర మోదీ నాయకత్వానికి అండగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో తెలంగాణకు తగురీతిలో భాగస్వామ్యం ఉండే విధంగా అత్యధిక ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది.
===================
బండిసంజయ్ (కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు )
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి