Nancharaiah merugumala senior journalist:
” శక్తిమంతులు, సెలబ్రిటీలకు ఆడపిల్లలను ‘సమకూర్చే’ సంస్కృతి అమెరికాలోనే కాదు.. మన హైదరాబాద్, బెజవాడల నుంచి న్యూఢిల్లీ వరకూ విస్తరించి ఉంది!..1980లు, 90ల్లో కాంగ్రెస్ హైకమాండ్ అబ్జర్వర్లకు మరవలేని, మరపురాని ‘ఆతిథ్యిం’ “
వయసులో ఉన్న ఆడపిల్లలను డబ్బు ఎరవేసో, బెదిరించో లేదా మాయ మాటలతోనో లొంగదీసుకుని అధికారంలో ఉన్న నాయకులకు, సెలిబ్రిటీల దగ్గరకు పంపించే వ్యాపార–రాజకీయ సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడకో లేదా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కో పరిమితమై లేదు. జాతీయ రాజధాని న్యూఢిల్లీ నుంచి గ్లోబల్ రాజకీయ, ఫైనాన్స్ కాపిటల్ న్యూయార్క్ వరకూ విస్తరించి ఉంది. ఈ వాస్తవాన్ని ఇప్పుడు అమెరికాను, ఇంగ్లండ్ సహా ఐరోపా దేశాలను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం నిరూపిస్తోంది. అమెరికా మహానగరం, అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం న్యూయార్క్‌కు చెందిన ఫైనాన్సియర్ కం సెక్స్ ట్రాఫికర్ (తార్పుడుగాడు) జెఫ్రీ ఎప్‌స్టీన్ గతంలో ఫైనాన్సియల్ కన్సల్టింగ్ వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో దేశ మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ఇంకా బ్రిటిష్ రాజు చాల్జ్ కొడుకు ప్రిన్స్ ఆండ్రూ, పాప్ స్టార్ మేకేల్ జాక్సన్ వంటి నాయకులు, వీఐపీలు, సెలబ్రిటీల గదులకు న్యూయార్క్ సహా అమెరికా ప్రధాన నగరాల్లోని తన భవంతులు, ‘విశ్రాంతి కేంద్రాల్లో’ ముక్కుపచ్చలారని ఆడపిల్లలను ‘మసాజ్’ పేరుతో ఎప్‌స్టీన్ పంపడం, ఈ మైనారిటీ తీరని యువతులను లైంగికంగా వాడుకోవడం వంటి దుర్మార్గాలు ఇప్పుడు న్యాయస్థానాలకు సమర్పించిన పత్రాల ద్వారా ప్రపంచానికి వెల్లడయ్యాయి.
ఎప్‌స్టీన్ రప్పించిన జోహానా అనే యువతి రొమ్ముపై చెయ్యివేసిన ప్రిన్స్ ఆండ్రూ
2001లో తాను న్యూయార్క్ వెళ్లినప్పుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ సొంత ఇంట్లో తాను గ్రూప్ ఫోటో కోసం నిలబడినప్పుడు బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ తన రొమ్ముపై చెయ్యి వేశాడని జోహానా సోబెర్గ్ అనే మహిళ తన కోర్టు వాంగ్మూలంలో వెల్లడించింది. ఇలాంటి ఎన్నో సంచలన విషయాలు గురువారం న్యూయార్క్ నగరంలోని కోర్టు దస్తావేజుల ద్వారా బయటికొచ్చాయి. 200 మందికి పైగా సంపన్నులు, అధికారం అనుభవించిన ప్రముఖులు ఎప్‌స్టీన్ క్లయింట్లుగా టీనేజీ ఆడపిల్లలను శారీరకంగా వాడుకున్నారని కోర్టు పత్రాలు వివరించాయి. తన వంటి అనేకమంది ఆడపిల్లలను కొద్దిపాటు సొమ్మిచ్చి లైంగిక దోపిడీతో అన్యాయం చేస్తున్నాడంటూ జెఫ్రీ ఎప్‌స్టీన్, ఆయన పార్టనర్ గిస్టెయిన్ మాక్స్‌వెల్‌పై 2015లో వర్జీనియా గియూఫర్ అనే మహిళ వేసిన సివిల్ దావా ఫలితంగా కోర్టు డాక్యుమెంట్ల ద్వారా పై విషయాలు వెలుగుచూశాయి. తార్పుడు వృత్తిలో రాటుదేలిన ఈ ఫైనాన్సియర్ ఎప్‌స్టీన్ వలలో చిక్కి సెక్స్ దోపిడీకి గురైన యువతుల్లో వర్జీనియా గియూఫర్ కూడా ఉన్నారు. ఈ కేసులో అరెస్టయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ న్యూయార్క్ జైలులో 2019 ఆగస్టు 10న అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరేసుకుని మరణించాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా వారిని లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వాడుకున్న నేరస్తుడు జెఫ్ ఎప్‌స్టీన్ జీవిత భాగస్వామి గిస్టెయిన్ మాక్స్‌వెల్ ఇప్పుడు జైలు జీవితం గడుపుతోంది.
హైదరాబాద్ సర్కారీ గెస్టుహౌసుల్లో కాంగ్రెస్ కేంద్ర అబ్జర్వర్లకు ‘సర్వసుఖాలు’
ఇక తెలుగునాట పైన చెప్పినట్టే ఆడపిల్లలను కొత్త పద్ధతిలో కాంగ్రెస్ అంతర్గత సంక్షోభాల పరిష్కారానికి ‘వినియోగించడం’ అప్పట్లో మీడియాలో వార్తల రూపంలో రాలేదుగాని జర్నలిస్టులకు, రాజకీయ నాయకులకు తెలిసిన విషయమే. 1978 ఫిబ్రవరి– 1983 జనవరి మధ్య కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని 1980 అక్టోబర్ లో గద్దె దించాక, 1982లో వరుసగా టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామరెడ్డి అనే సీఎంలను కూడా తొలగించింది. ఈ ముఖ్యమంత్రులను సాగనంపిన తర్వాత, వారి వారసులను ఎంపిక చేసే ప్రక్రియను నాటి కాంగ్రెస్ హైకమాండ్లు (ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు) ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కొందరికి ‘అప్పగించి’ ఏఐసీసీ అబ్జర్వర్లు అనే పేరుతో వారిని హైదరాబాద్ పంపించేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో నిజాం జమానాలో నిర్మిచిన దిల్కుషా గెస్ట్ హౌస్ వంటి సర్కారీ అతి«థిగృహాల్లో ఈ కాంగ్రెస్ అధిష్ఠానం కేంద్ర పరిశీలకులకు దాదాపు వారం రోజులు బస ఏర్పాట్లు చేసేవారు. సీఎం పదవికి రేసులో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు లేదా సీనియర్ నాయకులు ఈ అబ్జర్వర్ల అవసరాలు పగలూ, రాత్రీ అని చూడకుండా తీర్చే ఏర్పాట్లు చేసేవారు. 1978–83 మధ్య కాంగ్రెస్ సీఎంలను ఏపీలో మూడుసార్లు, 1989–94 మధ్య రెండుసార్లు (ఈ రెండు సందర్భాల్లో మొదట మర్రి చెన్నారెడ్డి గారే సీఎం. ఆయనను సాగనంపాక కొత్త సీఎంల ఎంపికకు ఈ కసరత్తులు) దిల్లీలో కొలువుండే కాంగ్రెస్ హైకమాండ్ మార్చిపారేసింది. ఈ సీఎంలతో రాజీనామా చేయించాక –ప్రధానంగా రాజస్తాన్, యూపీ, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన జిత్తులమారి, డైనమిక్ కాంగ్రెస్ నేతలను తన పరిశీలకులుగా నవాబీ భోగాలకు దారులు తెరిచే ఏపీ రాజధానికి పంపించేది కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కార్యక్రమం పూర్తవగానే న్యూఢిల్లీకి పయనమైన ఈ కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలకులను బేగంపేట్ విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు ఒక సందర్భంలో కలసినప్పుడు వారిలో ఒకరు, ‘‘ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప రాష్ట్రం. అతిధులను చాలా బాగా చూసుకునే మంచి సంస్కృతి ఉన్న రాష్ట్రం. మేం గెస్టుహౌసుల్లో విశ్రాంతి తీసుకునే సమయంతో మాకు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు సర్వ సౌకర్యాలు సమకూర్చారు. మాకు సర్వసుఖాలూ అందేలా ఏర్పాట్లు చేశారు. ఇంతటి గొప్ప ఆతిథ్యాన్ని మేం ఎప్పటికీ మరవలేము. అతిథులను సుఖపెట్టే గొప్ప ఆనవాయితీ తెలుగు కాంగ్రెస్ నేతలకు ఉందని మేం ఒప్పుకోక తప్పదు,’ అని చెప్పారు. ఈ విషయాన్ని ‘ఈనాడు’ సహా తెలుగు దినపత్రికలు కొన్ని అప్పట్లో వార్తగా ప్రచురించాయి. అలాగే, 1990ల్లో కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రి పండిత్ సుఖరాం శర్మ (హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత) అధికార కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ వచ్చినప్పుడు ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో ఆయన అవసరాలు తీర్చే బాధ్యతను స్థానిక కాంగ్రెస్ నాయకులు, టెలికం పరికరాలు తయారు చేసే ఒక కంపెనీ అధిపతి (బెజవాడ గుణదలకు చెందిన ఈ పారిశ్రామికవేత్త తెలుగువాడే) తలకెత్తుకుని, విజయవంతంగా పూర్తిచేసేవారు. ఎమర్జెన్సీ కాలంలో 1975 జూన్–77 ఫివ్రవరి మధ్యకాలంలో కోస్తాంధ్ర, హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కొడుకు, ‘యువజన కాంగ్రెస్’ నేత సంజయ్ గాంధీ కోరుకున్న వస్తువులను, మనుషులను 1976లో గుంటూరులో నాటి కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య గారు, హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు చాలా శ్రద్ధగా సమకూర్చారని మీడియా స్వేచ్ఛలేని ఆ రోజుల్లో పుకార్లు షికార్లు చేశాయి. గొప్ప ప్రజాస్వామ్య విలువలు, ప్రజాతంత్ర సాంప్రదాయాలతోపాటు అధికారంలో ఉన్న శక్తిమంతుల కోర్కెలు తీర్చే పద్ధతులను (పైన వివరించిన అమెరికా శైలిలో) భారతీయులు పాశ్చాత్య దేశాల నుంచే నేర్చుకున్నారు.
(ఫోటో: అన్ని పాపాల్లో తన భాగస్వామి గిస్టెయిన్ మాక్స్‌వెల్ తో జెఫ్రీ ఎప్స్టీన్)