ప్రీ_ పోల్ సర్వేలతో డైలమాలో తెలంగాణ ఓటర్లు..!

బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్ట్): 

గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రీ- పోల్‌ సర్వేలు రాజకీయ పార్టీలను, ఓటర్లను ఆయోమయానికి గురి చేస్తున్నాయి. జాతీయ సర్వే.. మీడియా..  పోల్‌ మెనేజ్‌మెంట్‌  సంస్థలు ప్రీ పోల్‌ సర్వేలను విడుదల చేశాయి. సర్వేల్లో మెజార్టీ కాంగ్రెస్‌ గెలుస్తుందిని.. కొన్ని సంస్థలు బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, బీజేపీ, బీఎస్‌పీ పార్టీలు ప్రధాన పార్టీల కొంప ముంచనున్నాయని ఇలా ఎవ్వరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు సర్వేలు బహిరంగం వెల్లడించాయి.  ఈ సర్వే నివేదికలు  సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతు  తికమక పెడుతున్నాయి. వీటికి తోడు యూబ్‌ చానళ్లలో వివిధ రాజకీయ విశ్లేకులతోను, పలు రాజకీయ నాయకులతో చర్చలు పెట్టి తెలంగాణలో గెలుపు ఎవరిదో  నిర్ణయించుకోలేని స్థితికి ప్రజలను  తీసుకెళ్లాయి. కొత్త తరహాలో పలు రకాల టీవీ చానళ్లు బిగ్‌ షాట్స్‌ను స్టూడియోలకు పిలిచి ప్రశ్నల వర్షం కురిపించిన వారు కొందరైతే.. తెర వెనుక ఉండే ఎడిటర్లను బయటకు తీసుకొచ్చి.. రాజకీయ పార్టీల బడా నాయకుల మదిలో ఉన్న విషయాలను కక్కిస్తున్నారు. పోలింగ్‌ రోజున విడుదల చేసే ఎగ్జిట్‌ పోల్స్‌లో పార్టీలకు వచ్చె సీట్ల అంచనాలు వెల్లడించే  స్థితి ఉండేది. కాని ఈ సారి ఫ్రీ పోల్‌ సర్వేలు మాత్రం పార్టీల ను, ఓటర్లను గందరగోళంలో పడేశాయి.

వినూత్న పంథాలో ప్రచారాలు ..
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వాహణకు కమిషన్‌ నిర్ణయం తీసుకుంది.  నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలను పూర్తి చేసింది. చివరగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఈ నెల 30న ముగించనుంది. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న చేపట్టనుంది. ఎన్నికల కమిషన్‌ తీరు  ఫర్వాలేదనింపింది. కాని గత ఎన్నికలకు భిన్నంగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలను వినూత్న రీతికి శ్రీకారం చుట్టాయని చెప్పొచ్చు. ఎన్నికల    ప్రచారంలో  మా పార్టీని గెలిపిస్తే.,. ఇదీ చేస్తాం.. అది చేస్తాం అనే మాటలు ప్రచారంలో ఎక్కడా కనపడటం లేదు. పదేళ్ల  మా పాలన చూసి ఓటు వేయాలని, అభ్యర్థితోపాటు రాజకీయ పార్టీని చూసి ప్రజలు ఓట్లు వేయాలని కేసీఆర్‌ తన బహిరంగ సభల్లో ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేసుకుంటు వచ్చారు. రోడ్డు షోలతో హరీష్‌రావు, కేటీఆర్‌లు నియోజక వర్గాల్లో తమదైన శైళిలో ప్రచారాల్ని నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడు లేని రీతిలో బీఆర్‌ఎస్‌ అధినేత కుమారుడు  హైదరాబాద్‌లో నాటు కోడి వంటకం షో.. ప్రయాణీకులతో  మెట్రోలో ప్రయాణం.. కొత్త ఓటర్లను పలకరింపు..మహిళ సాధికారతపై మహిళ ఇంకుఫెటర్లతో మాట్లాడడం.. న్యాయవాధులు, నిరుద్యోగులు ఇలా ఎవ్వరు ఎదురుపడిన వారిని పలకరించి కొత్త ప్రచారానికి తెర లేపారు. ఇచ్చిన హమీలను పక్కన పెట్టి కేసీఆర్‌ను బొంద పెట్టడమే లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన ప్రచారంతో ఓటర్లను ఆలోచనల్లో పడేశారు. ఎన్నడు  లేని  రీతీలో గల్లీకో జాతీయ స్థాయి మంత్రి, పట్టణాల్లో జరిగే రోడ్డు షోలకు జాతీయ పార్టీ అధ్యక్షుడు, నాయకులు, బహిరంగ సభ ల్లో స్వయంగా ప్రధాన మంత్రి ఓటర్లను ప్రభావితం చేయడం ప్రచారంలో భాగంగా చూస్తున్నాం. ఇదంత తెలంగాణలో రెండుమార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించలేదు. కాని ఈ సారి జరగనున్న ఎన్నికల్లో కొత్త ఒరవడి కనిపిస్తోంది.
జాతీయ పార్టీలు వర్సెస్‌ ప్రాంతీయ పార్టీ..
మూడో సారి తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలు వర్సెస్‌ ప్రాంతీయ పార్టీ మధ్య పోటీ జరుగుతుంది. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. మరో కోణంలో చూస్తే.. జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, బీఎస్‌పీ పార్టీలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయని భావించవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు గురి పెట్టడానికి కారణాలేంటీ అంటే.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమితో.. జాతీయ కాంగ్రెస్ లో  కొత్త ఉత్సహాన్ని తెచ్చిపెట్టింది. ఇదే ఊపులో ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నిక ల్లో  జెండా ఎగరేయాలని పట్టుదల ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.  కేంద్రంలో  వచ్చే   సంవత్సరం మార్చి  లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటములు ఏర్పాటు చేసుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే పార్టీకి పట్టు పెరుగుతుందని బీజేపీ భావిస్తోంది. దీంతో తాము తెలంగాణలో గెలవకున్న కాంగ్రెస్‌ను అడ్డుకోవాలన్నది  బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రణాళిక లో భాగంగానే ఆ  పార్టీ జాతీయ నాయకత్వం.. తెలంగాణ ఎన్నికల్లో భారీ  ప్రచార సన్నాహాలకు దిగిందనే వాదనలు ఉన్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో.. ప్రాంతీయ పార్టీలు ( జాతీయ పార్టీలుగా ఎదిగిన) రెండు జాతీయ పార్టీలకు కొరుకరాని కోయ్యగా మారుతాయనే ప్రచారం ఆ పార్టీల్లో ఉంది. దీంతో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించాలని రెండు  పార్టీలు భావిస్తున్నాయి.ఇప్పటికే జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ మహారాష్ట్రలో అడుగు పెట్టి అక్కడి పార్టీలకు నిద్రలేకుండా చేస్తుందనే భావన జాతీయ పార్టీల్లో ఉంది. తెలంగాణలో అధికార  బీఆర్‌ఎస్‌ రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపిస్తుందా..? మరో జాతీయ పార్టీగా ఉన్న బీఎస్‌పీ ఏ రాజకీయ పార్టీ అభ్యర్థుల గెలుపును అడ్డుకుంటుంది? అన్నది డిసెంబర్ 3 న తేలనుంది.  మరి పార్టీల గెలుపోటముల సంగతి  ఎలా ఉన్నా? ఈ ఎన్నికల్లో కీ రోల్ పోషించే ఓటర్లు.. ఓటు ఎవరికి వేయాలనే నిర్ణయానికి రాలేక తర్జనభజన పడుతున్నారనే   వాదన రాష్ట్రంలో గట్టిగా వినిపిస్తోంది.
Optimized by Optimole