Nancharaiah merugumala senior journalist:
తెలుగు జర్నలిస్టూ యూనివర్సిటీ ప్రొఫెసర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కావచ్చని నిరూపించిన ఘంటా చక్రపాణి గారి పదవీ విరమణ నిజంగా వార్తే..!
పూర్వపు విశాల ఆంధ్ర ప్రదేశ్ విభజన వల్ల తెలంగాణ ప్రజలకు మెరుగైన సేవలందించే అవకాశం కరీంనగర్ జిల్లాకు చెందిన అల్లం నారాయణ, డాక్టర్ ఘంటా చక్రపాణికి వచ్చింది. తెలంగాణ అవతరణ ఫలితంగా వరంగల్ జిల్లాలో కుటుంబ మూలాలున్న కామ్రేడ్ దేవులపల్లి అమర్ గారైతే అవశేషాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రజలను తనదైన ప్రత్యేక శైలిలో ఆదుకునే వీలు కల్పించుకున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి, ప్రజాయుద్ధ పంథాకు తన వంతు చేయూత అందించిన కరీంనగర్ జిల్లా బిడ్డ, మరో తరహా పోరాటాలకు పుట్టినిల్లయిన కడప జిల్లాకు అల్లుడు కూడా అయిన ఘంటా చక్రపాణి గారు హైదరాబాద్ కొత్త విశ్వవిద్యాలయంలో పదవీ విరమణ చేశారంటే… ఆయన మరో క్రియాశీల ఇన్నింగ్స్ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం దారి చూపిందనిపిస్తోంది. నేను చదువుకునే రోజుల్లో మా కృష్ణా జిల్లా నుంచి ఘంటా కృష్ణ మూర్తి అనే కాపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉండేవారు. అలాగే, మాకు సమీపంలోని పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి అసెంబ్లీ స్థానం నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఘంటా మురళీ రామకృష్ణ అనే కమ్మ నాయకుడు ఎన్నికయ్యారు. ఇలా అన్ని ప్రాంతాల్లో, అన్ని కులాల్లో ఉండే ఘంటా అనే ఇంటిపేరు ఆంధ్రా ప్రాంతంలో లేని అనుసూచిత కులంలో పుట్టిన ప్రొ.చక్రపాణి గారి పేరు ముందు ఉండడం నాకు ఆసక్తిరమైన అంశం.