Ganeshthanda(గణేష్ తండ): (తంగలాన్ రివ్యూ):
చాలా రోజుల తర్వాత థియేటర్ కి వెళ్లి మూవీ చూశాను. అది కూడా పా.రంజిత్ కోసం. తంగలాన్. చాాలా సినిమాలు కూర్చోబెట్టి, ఆలోచనలే లేకుండా చేస్తాయి. కానీ, పా. రంజిత్ లాంటి డైరెక్టర్లు తీసే సినిమాలు ప్రతి ఒకరిని ఆలోచించేలా చేస్తాయి.
తంగలాన్ తన పిల్లలకు ఒక కథ చెప్తుంటాడు. అదే కథను వాళ్ల నాన్న తనకు చెప్పాడు. వాళ్ల తాత అతని నాన్నకు చెప్పాడు. వాళ్ల తాతల తాతలు కూడా అదే కథ చెప్పారు. అది కథ కాదు, వాస్తవం. క్రీస్తూ పూర్వం 5వ శతాబ్దం నుంచి రూపాలు మార్చుకుంటూ, ఒకే రూట్ లో వస్తున్నఈ దేశ మూలవాసుల కథ. మన కథ. కళ్యాణ్ రావు “అంటరాని వసంతం”లో రూతు చెప్పిన కథ. రాహుల్ సాంకృత్యాయన్ “వోల్గా టు గంగా “లో ప్రవాహాన్ చెప్పిన కథ. కేశవరెడ్డి “చివరి గుడిసె”లో బైరాగి చెప్పిన కథ. ఆ కథనే ఇప్పుడు పా.రంజిత్ తంగలాన్ తో చెప్పించాడు!
ఈ దేశ మూలవాసుల చరిత్ర తెలియకపోతే, తంగలాన్ చెప్పే కథ అర్థం కాదు. తెలియనివాళ్లకు తెలియజెప్పేందుకే, మరోసారి పా. రంజిత్ మన ముందుకు తంగలాన్ ని తీసుకొచ్చాడు.డైరెక్ట్ గా చెప్తే మనోభావాల అస్త్రాన్నిఅందుకుంటారు కాబట్టి, కల్పిత పాత్రలతో, చరిత్రను కలిపి చెప్పే ప్రయాత్నం చేశాడు పా. రంజిత్ . వేల ఏళ్లుగా తన మట్టి చేతులతో పంట పండిస్తున్నా… మూలవాసికి భూమి దక్కలేదు. తంగలాన్ కు నాలుగు గుంటల భూమి ఉంటే కళ్లు మండాయి. తంగలాన్ మంచి బట్టలు వేసుకుంటే కళ్లు మండాయి. తంగాలన్ ఆయుధం పట్టినా మండాయి. తంగలాన్ వీరుడని తెల్లోడు పొగిడితే కళ్లు మండాయి. ఈ కళ్ల మంట ఈనాటిది కాదు. బుద్ధుడికి పూర్వం పుట్టిన మంట, అందరూ సమానమే అని చెప్పినందుకు బుద్ధుడినే లేకుండా చేసిన మంట!
బౌద్ధాన్ని పునరుద్ధరించడానికి అశోకుడు చేసిన ప్రయత్నాన్ని… తంగలాన్ కొడుకు ‘అశోక’ ఈ సినిమాలో సింబాలిక్ గా చూపించాడు. బుద్ధుడికి జ్ణానోదయం అయిన రావి చెట్టుతో, రావి ఆకు పచ్చబొట్టు వేసుకున్న తంగలాన్ భార్యతో కూడా కథ చెప్తాడు. కోరికలే దు:ఖాన్ని కారణమని, అవి మనల్ని ఎలా నాశనం చేస్తాయో కూడా కొన్ని పాత్రలతో చూపిస్తాడు. బౌద్ధాన్ని అగ్రవర్ణాలు నాశనం చేసిన విధానాన్ని, ఆర్యులు, దొరలు, జమీందారులు వెట్టి చేయించుకుని, మన భూములను లాక్కొని మనలను ఎలా బానిసలుగా మార్చిన విధానాన్ని చూపిస్తాడు. అగ్రవర్ణాల వారు ఇంగ్లీష్ భాష నేర్చుకుని, బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి హింసించిన తీరును చూపిస్తాడు. కులాన్ని సంపదలా చూసేవాళ్లు, కులాన్ని హోదాలా చూసేవాళ్లు దాన్ని వదులుకోకుండా కింది కులాలను పెట్టే ఇబ్బందులను చూపిస్తాడు. కింది కులాల్లో అనైక్యత కోసం కనిపెట్టిన వర్ణవ్యవస్థను చూపిస్తాడు.
స్క్రీన్ ప్లే కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నా… మొత్తంగా మన దేశ శతాబ్దాల చరిత్రను, మూలవాసుల వ్యథను తంగలాన్ “ఎక్స్ రే” తీశాడు. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న తరతరాల రోగమేంటో, ఆ రోగానికి బుద్ధుడు, అంబేడ్కర్ కనిపెట్టిన మందేంటో కూడా పా. రంజిత్ ఈ సినిమాలో చూపించాడు.