MLCElection’s2024:
ఉత్తర తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎన్నికలకు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. టికెట్ కోసం ఆశావాహులు సైతం ప్రయత్నాలు మొదలెట్టారు.అయితే అధికార కాంగ్రెస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి జోరుమీదున్న బీజేపీ, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బలమైన అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు సైతం తగ్గేదెలా తరహాలో పోటీకి సిద్ధమంటున్నారు.
జీవన్ రెడ్డి పోటీ చేస్తారా..?
ఇక త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ( పట్టభద్రుల) ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఆశావాహులు ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కించుకునేందుకు లాబీయింగ్ మొదలెట్టారు. కొద్ది నెలల్లోనే కరీంనగర్, ఆదిలాబాద్ ,నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనుంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ గా ఉన్న జీవన్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఓ వైపు ఆయన పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు గ్రాడ్యుయేట్ (పట్టభద్రుల) సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికంగా ఉండడంతో పోటీ చేస్తే తమకి కలిసొస్తుందని ఆశావాహులు భావిస్తున్నారు. దీంతో అధికార పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.
బీజేపీ టికెట్ దక్కేదేవరికో..?
ఎమ్మెల్సీ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ బలం (నాలుగు ఎంపీ సీట్లు గెలవడం) గతంలో కంటే భారీగా పెరగడంతో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని ఆ పార్టీ భావిస్తోంది. లోక్ సభ జోరును కొనసాగించి గ్రాడ్యుయేట్ స్థానాలను దక్కించుకునేందుకు యాక్షన్ ప్లాన్ సైతం సిద్ధం చేసినట్లు వార్తలువినిపిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి ప్రధానంగా రాణి రుద్రమ, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ బొగ శ్రావణి పేర్లు వినిపిస్తున్నాయి.వీరితో పాటు మరి కొంతమంది ఆశావాహులు కమలం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు.దీంతో పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందా అన్న చర్చ కాషాయం పార్టీలో నడుస్తోంది.
బిఆర్ఎస్ పుంజుకుంటుందా..?
తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. ఆ పార్టీకి పట్టున్న నియోజక వర్గాల్లో సైతం మూడో స్థానానికి పరిమితమైంది. దీంతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తాచాటి బౌన్స్ బ్యాక్ కావాలని ఆ పార్టీ భావిస్తోంది. బిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించే వారు అధికంగా కనిపిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోటీలో ఉన్నానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అదే విధంగా ప్రముఖ డాక్టర్ బీఎన్ రావు పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు మరి కొంతమంది బిఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
విద్యావేత్త అరంగ్రేటం. .!
ప్రముఖ విద్యావేత్త ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయల్లోకి అరంగ్రేటం చేయనున్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశీస్సులు సైతం తీసుకున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ పరిధిలో ఆయన విద్యాసంస్థల పట్టభద్రులు,పూర్వ విద్యార్థులు వేలల్లో ఉండడం , శ్రేయోభిలాషులు, అభిమానులు అధికంగా ఉండడంతో ఆయన పోటీపై ప్రధాన పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉండడంతో.. జాతీయ పార్టీలు ఆయన తమ పార్టీనుంచి పోటీ చేయించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. పార్టీ బలంకి తోడు అభ్యర్థి బలం తోడైతే గెలుపు సునాయాసం అవుతుందని రెండు పార్టీల ముఖ్య నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
మొత్తంగా సాధారణ ఎన్నికల వలే ఎమ్మెల్సీ ( పట్టభద్రుల) ఎన్నికలు రణక్షేత్రాన్ని తలపిస్తాయనడంలో సందేహం లేదు. ఏ పార్టీ పట్టభద్రుల అభిమానాన్ని చురగొని విజయ డంకా మోగిస్తుందో వేచి చూద్దాం..!