Human trafficking: క్షమించండి.. హాయిగా జీవించండి..!

విశీ (సాయి వంశీ) :

ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని ఒక గదిలో బంధించారా? మిమ్మల్ని కొట్టి మీ చేత మీకు నచ్చని పని చేయించారా? మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని శారీరక అవసరాల కోసం వాడుకున్నారా? ఇవన్నీ మీకు జరిగితే మీరు Human Traffickingకి గురైనట్టు అర్థం. మనలోని చాలా మందికి అటువంటి అనుభవం లేదు. నాకూ ఆ అనుభవం లేదు, 19 ఏళ్లు వచ్చేదాకా! అప్పటిదాకా నేనో మామూలు అమ్మాయిని. సిగ్గు, పిరికితనం, అమాయకత్వం. ఇది నా నైజం. మాది కెనడాలోని Hamilton.

2011లో నన్ను నా సహోద్యోగి ఒక పార్టీకి పిలిచింది. సంతోషంగా వెళ్లాను. రాత్రంతా ఆడిపాడాను. ఉదయం నా సహోద్యోగి నన్ను కారు ఎక్కించుకుని తీసుకువెళ్తుంటే, మా ఇంటికి అనుకున్నాను. కారు ఒక క్లబ్ ముందు ఆగింది. ఆమె నా వైపు చూసి “నువ్వు నాకు 600 డాలర్లు బాకీ ఉన్నావు. ఇచ్చేయ్” అంది. ఆమెకు నేనెప్పుడు బాకీ పడ్డానో అర్థం కాలేదు. ఇవ్వాలన్నా నా దగ్గర అంత డబ్బు లేదు. ఆమె నన్ను బెదిరించి క్లబ్ లోపలికి తీసుకెళ్లింది. అక్కడ నాకోసం ఇద్దరు మగవాళ్లు ఎదురుచూస్తున్నారు. వాళ్ల ముందు ఆడి, పాడి డబ్బు తెచ్చి తనకు ఇమ్మని నా సహోద్యోగి ఆదేశించింది. లేకపోతే మా అమ్మానాన్నల్ని చంపేస్తానని బెదిరించింది.

నేను ఆలోచించాను. కాసేపు వీళ్ల ముందు ఆడి, పాడి ఆ డబ్బేదో ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా అనిపించింది. సరేనని ఆమె చెప్పినట్టే చేసి ఆ డబ్బు తీసుకుని ఆమెకు ఇచ్చాను. అక్కడితో నేను వెళ్లిపోవచ్చు అనుకున్నాను. ఆ తర్వాత ఆమె నన్ను తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మరికొంతమంది మగవాళ్లు ఉన్నారు. వాళ్ల చేతుల్లో గన్స్, డ్రగ్స్ ఉన్నాయి. నాకు విషయం మెల్లగా అర్థమైంది. తప్పించుకొనే మార్గం లేదు. వాళ్లు నాకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు. నేను మత్తులో ఉండగా ముగ్గురు నన్ను రేప్ చేశారు. మత్తు దిగాక నా సహోద్యోగి నన్ను మళ్లీ క్లబ్‌కి తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్నవాళ్ల ముందు మళ్లీ ఆడి, పాడాను.

రోజు తర్వాత రోజు ఇలాగే కొనసాగింది. అలా దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయాయి. రోజూ నన్ను హింసించేవారు. శారీరకంగా వాడుకునేవారు. నేను పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. భయం, పశ్చాత్తాపం, తప్పు చేశానన్న భారంతో నా మెదడు మొద్దుబారిపోయింది‌. విపరీతంగా డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. రెండు సార్లు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాను. ఒక కస్టమర్ నన్ను తీసుకుని వెళ్లి నెల రోజుల పాటు హోటల్లో ఉంచి నాతో సెక్స్ చేసి తిరిగి తీసుకొచ్చాడు. మరో కస్టమర్ నన్ను రక్షిస్తున్నట్టు నటించి బయటికి తెచ్చి నా చేత వ్యభిచారం చేయించాడు.

ఒకసారి పోలీసులు క్లబ్ మీద దాడి చేసి మమ్మల్ని Rescue Homeకి తరలించారు. నాకు స్వేచ్ఛ వచ్చినట్టు అనిపించింది. అక్కడ అందరూ చాలా బాగున్నారు. ఒక వాలంటీర్ నా మీద చాలా శ్రద్ధ చూపించాడు. నన్ను పక్కకు పిలిచి నాకు డబ్బులిచ్చి తనతో సెక్స్ చేయమన్నాడు. ఇన్నాళ్లూ నేను చేసింది అదే! ఇప్పుడు చేస్తే తప్పేంటి అనిపించింది. ఒప్పుకున్నాను. తను చెప్పిన పని చేశాను. Human Trafficking దాటి నన్ను నేను Sex Workerగా మార్చుకున్నాను. ఆ తర్వాత అదే‌ కొన్నాళ్లపాటు కొనసాగించాను. విపరీతమైన డ్రగ్స్, వ్యభిచారం.. ఇదే‌ నా పని.

ఆపైన ఒకానొక సాయంత్రం చచ్చిపోదామని నిశ్చయించుకొని నా ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉన్నాను. మాటల సందర్భంలో అతను నాకో సవాల్ విసిరాడు. “ఇప్పటిదాకా నీకు చెడు చేసిన వారందరినీ క్షమించగలవా?” అని అడిగాడు. బహుశా అది నా చిట్టచివరి సమాధానం. ఏం చెప్పాలా అని ఆలోచించాను. అప్పటికే చాలా మార్గాలు చూశాను. డాక్టర్లు, పుస్తకాలు.. ఏవీ పనిచేయలేదు. చివరిగా ఇది ప్రయత్నిద్దాం అనుకున్నాను. అప్పటివరకు నాకు చెడు చేసిన అందరినీ క్షమించాను. విచిత్రం! నా మనసు, శరీరమూ చాలా తేలికగా మారాయి. చావాలన్న ఆలోచన పోయింది. బతుకు మీద ఆశ కలిగింది. కొత్త జీవితం ప్రారంభించాలని అనిపించింది.

రౌడీలు, వ్యభిచారులు, హంతకులు, దొంగలు.. ఎవరైనా సరే చేయాల్సింది ఇదే! మీకు తెలిసో, తెలియకపో ఈ దారిలోకి వచ్చారు. అలా రావడానికి కారణమైన అందర్నీ మీరు క్షమించండి. వాళ్ల విషయంలో ధారాళంగా వ్యవహరించండి. అప్పుడే ఈ చైన్ తెగిపోతుంది. మిమ్మల్ని ఎవరో ఈ దారిలోకి తెచ్చారని మీరు ఆ కోపంతో మరొకర్ని ఈ దారిలోకి తేకండి. చెడు మార్గాలను మూసేయాలంటే క్షమించడం ఒకటే మార్గం.

13 నుంచి 19 ఏళ్ల మధ్యనున్న ఆడపిల్లలు చాలా సులభంగా మోసపోగలరు. ఈ నిజాన్ని అందరూ గ్రహించండి. వారిని కాపలా కాయడం మానేసి, వారి మీద వారికి నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపండి. Human Trafficking ఎక్కడైనా ఎవరికైనా జరగొచ్చు. అంతమాత్రాన ఆ ఆడపిల్లల జీవితం అయిపోలేదు. భయపెట్టి, బెదిరించి వ్యభిచారం చేయించగానే ముగిసిపోయేంత చిన్నవికావు వారి జీవితాలు. జీవితం ఎప్పుడూ మిగిలే ఉంటుంది. ప్రపంచంలో చాలా మంది మంచివారూ ఉంటారు. ఆ నమ్మకాన్ని ఎన్నడూ కోల్పోవద్దు.

ఆరోజు సాయంత్రం నాకు సవాల్ చేసిన నా స్నేహితుడు కొన్నాళ్లకు నన్ను పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడు నేను Anti-Human Trafficking Program Consultantని. మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు చట్టం ప్రకారం చేయాల్సిన అంశాలపై జనానికి అవగాహన కల్పిస్తున్నాను.

(కెనడావాసి Markie Dell వివిధ సందర్భాల్లో పంచుకున్న తన అనుభవాల ఆధారంగా..)