Telangana:
తెలంగాణలో మున్సిపాలిటీలు-మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల పురపోరు ప్రధాన పార్టీలన్నింటికీ సవాలే! వచ్చే అసెంబ్లీ (2028) ఫైనల్ పోరాటానికి ముందు ఇదో క్వార్టర్ ఫైనల్ వంటిది ఒకరకంగా చెప్పాలంటే! ఈ ఎన్నికల తర్వాత వచ్చే ఎమ్పీటీసీ-జడ్పీటీసీల ఎన్నికల్ని సెమీఫైనల్ పోరుగా పరిగణించవచ్చు. అవీ, ఇవీ కలిస్తే రాష్ట్రంలోని నగర-పట్టణ-గ్రామీణ, అంటే యోగ్యులైన అందరు రాష్ట్ర ఓటర్ల మనోగతం, స్థూలంగా తెలంగాణ జనాభిప్రాయం సేకరించినట్టే లెక్క! నిన్నటి గ్రామ పంచాయతీ (సర్పంచ్-వార్డు సభ్యుల) ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినవి కావు. కానీ, వచ్చే రెండు ఎన్నికలూ పార్టీ గుర్తులతో, పార్టీల నాయకత్వం ‘బీ’ ఫారాలిస్తూ అభ్యర్థుల్ని బరిలోకి దింపి జరిపే ఎన్నికలే! కనుక, ఇందులో వెల్లడయే ప్రజాతీర్పును రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనకు రెంఫరెండంగానూ పరిగణింవచ్చు. అందువల్ల ప్రధానపక్షాలన్నింటిలోనూ పాలక కాంగ్రెస్ పక్షానికి ఈ ఎన్నిక మరింత పెద్ద సవాల్! మరి ఇంతటి సవాల్‌ను ఏ పార్టీ ఎలా తీసుకుంటోంది? ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల ముందున్న అవకాశాలు-సవాళ్లు ఎలాంటివి? అన్నది ఇపుడు చర్చనీయాంశం.
నగరాలు, పట్టణాల్లోని తెలంగాణ ప్రజానీకం రాజకీయ పార్టీలపై ఏ అభిప్రాయంతో ఉంది? ఎన్నికల్లో ఓటరు నిర్ణయంగా ప్రజాభిప్రాయానికి అద్దం పట్టే పురపోరుకు రంగం సిద్దమైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే క్రమంలో రాష్ట్రమంతటా ఓటర్ తుది జాబితాలు విడుదలై శనివారంతో రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంతో కొంత మేర, దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలున్నట్టే! మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తీర్పు ఇచ్చే ఎన్నికలివి. ఫిబ్రవరిలో రంజాన్ మాసం, మార్చిలో పదోతరగతి పరీక్షలు… శివరాత్రిలోపు ఎన్నికల ప్రక్రియ ముగించే తలంపుతో ప్రభుత్వముంది. గణతంత్య్రదినోత్సవానికి అటు, ఇటుగా షెడ్యూల్ విడుదల కావచ్చంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే మున్సిపల్స్‌లోనూ ప్రజాతీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఆయన విశ్వాసం ప్రకటించారు. ముందూహించినట్టుగానే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు కావడంతో వారు 80 శాతం వరకు ఫలితాలు సాధించామని చెబుతున్నప్పటికీ 60 శాతానికి తగ్గకుండా ఆ పార్టీ సర్పంచులు గెలిచారనేది నిర్వివాదాంశం. ఇక ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పురపోరుకు ఇంకా గోచీ సర్దుకున్నట్టు లేదు. దేశంలో కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా పాత స్థావరాలను తిరిగి కైవసం చేసుకుంటున్న భారతీయ జనతాపార్టీ తెలంగాణలో బలంగా పాదం మోపే ఒక అవకాశం కోసం ఇంకా నిరీక్షిస్తోంది. ఈ ఎన్నికలూ వారికి ఎంత సవాలో అంత అవకాశం! అక్కడక్కడ మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎమ్‌ఐఎమ్) ముద్రలే తప్ప ఏ ఇతర పార్టీకీ ఈ ఎన్నికల్లో అంతగా అవకాశాల్లేవు. ఇక కమ్యూనిస్టులు ఆటలో అరటిపండే!
కాంగ్రెస్ వెలిగేది గెలిస్తేనే!
స్థానిక ఎన్నికలేవైనా పాలకపక్షానికి కొంత అనుకూలమనేది రాజకీయాల్లో స్థిరపడ్డ అభిప్రాయం. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అందుకు భిన్నంగా ఏం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన ఆరుమాసాల్లోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాలు కైవసం చేసుకుంది. తర్వాతి రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ లోనూ గెలుపొంది సదరు స్థానాలను ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నుంచి కైవసం చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వానికి ఎదురు లేదు. కుటుంబ సభ్యులు మినహాయిస్తే, కాంగ్రెస్ లో ఇక ఉన్నదంతా 1+1 ఎమ్మెల్యేల బలం కూడా లేని నాయకులే కావడంతో రేవంత్ నాయకత్వాన్ని దిక్కరించే సాహసం ఎవరూ చేయరు. కేంద్రంలో ప్రస్తుతం బలహీనంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సుల్లోనూ ఆయనకు తిరుగులేదు. జూబ్లీహిల్స్ గెలుపు తర్వాత ఆ బంధం మరింత బలపడింది. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను స్పష్టమైన ఆధిక్యతతో గెలిపిస్తే ఆయన నాయకత్వానికి తిరుగుండదు. రాగల పరిణామాలతో నిమిత్తం లేకుండానే 2028 ఎన్నికల భారాన్ని పార్టీ అధినాయకత్వం ఆయనపైనే మోపొచ్చు. ఈ ఎన్నికలు గెలిస్తే, అదిచ్చే కిక్కుతో ప్రస్తుతం వివాదాస్పదమౌతున్న ఖైరతాబాద్ (దానం నాగేందర్), స్టేషన్‌ఘన్‌పూర్ (కడియం శ్రీహరి) నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో తిరిగి గెలుద్దామనే సాహసానికీ తలపడవచ్చు. వారిద్దరు కాకుండా, పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చి కూడా ‘తామింకా బీఆర్‌ఎస్ లోనే ఉన్నాం’ అంటున్న వారికి దన్నుగా మరికొంత మందిని బీఆర్‌ఎస్ నుంచి లాగి, మూడింట రెండొంతుల మెజారిటీ (20/39) ఎమ్మెల్యేల బలంతో ‘విలీన’ (అనర్హత వర్తించని) ప్రక్రియకు కాంగ్రెస్ నాయకత్వం తలపడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, పురపోరులో ఓడితే…. కాంగ్రెస్‌కు, స్థానిక నాయకత్వానికి కష్టాలు తప్పవు. ఢిల్లీ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వంపై చిన్నచూపే! నిన్న జూబ్లీహిల్స్‌లో బహిరంగ మద్దతు ప్రకటించిన ఎమ్‌ఐఎమ్ ఈ పురపోరులో కాంగ్రెస్‌తో కలిసివస్తుందా? అన్నది చిక్కుప్రశ్నే! అందుకే, ఎలా చూసినా ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం.
మేలుకుంటేనే మేలు!
2023 అసెంబ్లీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు ఘోర పరాజయమేమీ కాదు. పదేళ్ల పాలన తర్వాత స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో ఎదురైన ఓటమి అది. తర్వాతి పరిస్థితే దయనీయంగా మారుతూ వస్తోంది. అప్పుడు బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల వ్యత్యాసం 2 శాతమే! ఆరుమాసాల్లోపు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు. తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్ని అధికార కాంగ్రెస్‌కు కోల్పోయింది. ఎన్నికైన 39 మందిలో పదిమంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి గోడ దూకి, అనర్హతను తప్పించుకోవడానికి ‘మేం ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాం’ అంటున్నా సాంకేతికంగా ఏమీ చేయలేని అశక్తత! అయినా పార్టీ గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. ఇంకా అదే ఫామ్‌హౌజ్ నేతృత్వం, విల్లాలు`సోషల్‌మీడియాల్లో మనుగడ. రాష్ట్రవ్యాప్తంగా జనాల్ని కదిలించిన ఒక్క జనాందోళన లేదు, ప్రజాఉద్యమం కానరాదు. ‘నదీజలాల వివాదం- ఏపీతో పంచాయతీ’ ద్వారా ‘తెలంగాణ’ సెంటిమెంట్ లేవనెత్తాలని చూసినా… జనంలో నాయకత్వంపై నమ్మకం సడలుతోంది. తమ రాజకీయ మనుగడ కోసం ఎక్కడికక్కడ కార్యకర్తలు గట్టిగా నిలబడి, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఆ మాత్రం ఫలితాలు సాధించిపెట్టారే తప్ప అది నాయకత్వ ప్రతిభ కాదన్నది పార్టీలోనే వినిపించే గుసగుస. నాయకత్వం ఒకరకంగా కాడి వదిలేసిందనేది విమర్శ. ‘బీఆర్‌ఎస్‌కు అసలు ఎందుకు ఓటేయాలి?’ అంటున్న తెలంగాణ సగటు ఓటర్‌కు సమాధానమిచ్చే పరిస్థితి నాయకత్వానికి లేదు. పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న 39 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలుస్తుంది? అన్నదొక పెద్ద ప్రశ్న! 2028 ఎన్నికలకు ఏర్పాటు చేసుకునే దారిలో బీఆర్‌ఎస్‌కు ఇదొక ముఖ్య మజిలీ! మేలుకొని ఎన్నికల రాజకీయ వేదికను ఏలుకోకుంటే, బీజేపీకి తానుగా రాష్ట్రంలో ఎర్రతివాచీ పరిచినట్టే!
బంతి బలంగా పైకి లేవాలె!
రాబోయే పురపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని బీజేపీ తెలంగాణ నాయకత్వం చెబుతోంది. ఇలా ప్రతిసారీ చెబుతున్నారు తప్ప ఫలితాల్లో అది అంతగా ప్రతిబింబించడం లేదు. పార్టీ అధినాయకుడైన దేశ ప్రధాని ‘మోదీ’ పేరిట లోక్‌సభ ఎన్నికల్లో లభిస్తున్న అనూహ్య- అసాధారణ (8/17) ఫలితాలే తప్ప మిగతా ఎన్నికలన్నీ తెలంగాణలో బీజేపీకి చతికిలబాటే! గెలిచి అధికారంలోకి వస్తామన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలే దక్కాయి. ఇప్పుడు 8 మున్సిపాలిటీల్లో గెలిచినా జెండా ఎగిరినట్టేనని పార్టీలోనే ఒకవర్గం (నిర్)ఆశావహంగా మాట్లాడుతోంది. నరేంద్ర మోదీ స్థాయి నాయకులు పలుమార్లు మందలించినా తెలంగాణ పార్టీ నడతలో పేర్కొనదగ్గ మార్పేమీ కనిపించడం లేదు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ పరిధిలో ఒక కార్పొరేషన్‌తో పాటు పలు మున్సిపాలిటీలున్నాయి. అలాగే పలువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపైనైనా ప్రత్యేకంగా శ్రద్దపెట్టి పోరాడితే సత్ఫలితాలకు ఆస్కారం ఉంటుంది. ‘పట్టణ పార్టీ’ అని ఒకప్పుడు బీజేపీకి పేరు! ఎక్కడిక్కడ కొత్తగా బలం పెంచుకోవడం సంగతలా ఉంచి, ఉన్నది నిలుపుకోలేని పరిస్థితి. అందుకే, ప్రస్తుత ‘పుర’పోరు వారికి ఒక పెద్ద సవాల్! అదే సమయంలో చక్కని అవకాశంగానూ చూడొచ్చు! పాలకపక్షంగా కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటుంటే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ దెబ్బతిని చతికిలపడి ఉన్న ప్రస్తుత తరుణంలో బీజేపీకి ఇదొక మంచి అవకాశం. పట్టుజారిపోయిన ముంబాయి మహానగర పాలకసంస్థ ఎన్నికల్లో బీజేపీ తిరిగి పుంజుకున్నట్టు, తెలంగాణలోనూ బీజేపీ బంతి బలంగా పైకి లేస్తేనే పార్టీకి ఇక్కడ భవిష్యత్ మనుగడ! లేదంటే బీఆర్‌ఎస్ నెత్తిన పాలు పోసినట్టే!
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ… ఈ ముగ్గురికీ తెలంగాణ నగర-పురపోరు సవాల్ లాంటిదే!
-దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రిసర్చి సంస్థ డైరెక్టర్




