Delimitation:
-బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు.
=============
దేశ సమాఖ్య స్ఫూర్తికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడుగడుగునా తూట్లు పొడుస్తూ భిన్నత్వంలో ఏకత్వమైన మన జాతీయ సమైక్యతను నీరుగారుస్తోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా వివక్షతతో కూడిన ఎజెండాను అనుసరిస్తూ ఒంటెత్తు పోకడలతో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ విధానాలు పరాకాష్టకు చేరుకుంటున్న ప్రమాదకరమైన దశలో ఆ పార్టీ మెడలు వంచడానికి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా చేతులు కలుపుతున్నాయి. జనాభా నియంత్రణ పాటించి దేశ ప్రగతికి తోడ్పడుతున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతున్న బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పగ్గాలు వేయడానికి చెన్నైలో బీజేపీ యేతర పార్టీలు సమావేశాన్ని నిర్వహించి ‘ఫెయిర్ డీలిమిటేషన్’ కోసం సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయడమే కాకుండా ఈ అంశంపై భవిష్యత్తులో కూడా ఒకే మాటా ఒకే నిర్ణయం తీసుకుంటూ దేశ సమాఖ్య, సమైక్య స్ఫూర్తిని పరిరక్షించాలని తీర్మానించాయి.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో చిన్న రాష్ట్రాలకు ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో పలు పార్టీలు తమ నిరసన తెలియజేసినా దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ దీన్ని పట్టించుకోకపోవడంతో చైన్నైలో నిర్వహించిన సమావేశంలో రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీలు పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా గొంతెత్తాయి. ఒక జాతీయ పార్టీగా దేశ సమైక్యత కోసం ఇప్పటికే అనేక త్యాగాలు, బలిదానాలు చేసిన కాంగ్రెస్ మరోసారి దేశ సమాఖ్య, సమైక్యతను పరిరక్షించేందుకు తన వంతు కృషి చేస్తూ ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించింది. జేఏసీ ఈ ఒక్క సమావేశానికే పరిమితం కాకుండా లక్ష్యం సాధించే వరకు పోరాడాలనే లక్ష్యంతో తదుపరి సమావేశం హైదరాబాద్లో నిర్వహించేలా తెలంగాణ కాంగ్రెస్ తనవంతుగా ప్రత్యేక చొరవ తీసుకుంది.
నిబంధనల ప్రకారం దేశ జనగణన ప్రతి పదేళ్లకు నిర్వహించాల్సి ఉండగా 2011 తర్వాత చేపట్టలేదు. 2014 నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జనగణనను నిర్లక్ష్యం చేసింది. జనగనణ చేపట్టి అందులో భాగంగా కులగణన కూడా నిర్వహించి బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 2026లో జనాభా లెక్కలు నిర్వహించి వాటి ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే కుట్రలకు తెరలేపింది. జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ నిర్వహిస్తే ఉత్తరాది రాష్ట్రాలకు అధిక లాభాలుండడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని నిరసిస్తుంది. జనాభా లెక్కలతో దక్షిణాదిలో నియోజకవర్గాల్లో కోతపడి చట్ట సభల్లో ప్రాధాన్యత తగ్గడంతో రాజకీయ ప్రయోజనాలకు భంగం కలగడమే కాకుండా ఈ ప్రాంత ఆర్థిక ప్రయోజనాలు కూడా దెబ్బ తిని దేశంలో అసమానతలు పెరుగుతాయి.
అధిక జనాభా దేశ ప్రగతికి, అభివృద్ధికి అనర్థకం అని తలచి జనాభా నియంత్రణ చేపట్టాలని 1971లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు కట్టుదిట్టడంగా అమలు చేయడం ఇప్పుడు వాటికి శాపంగా మారింది. అధిక జనాభాతో నిరుద్యోగం పెరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడుతాయి. దేశ వనరులు కూడా సరిపోక తాగునీటి, మౌలిక వసతులు కల్పించడం కూడా అసాధ్యమవుతుంది. దేశ పురోగతికి తమ వంతు బాధ్యతగా దక్షిణాదిన జనాభా కట్టడి చేస్తే, ఉత్తరాది రాష్ట్రాలు విఫలమయ్యాయి. దేశంలో 1951లో దక్షిణాది రాష్ట్రాల జనాభా వాటా సుమారు 26 శాతం కాగా, 2022 నాటికి సుమారు19 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వాటా 1951లో సుమారు 39 శాతం ఉండగా, 2022 నాటికి సుమారు 43 శాతానికి చేరుకోవడంతో దేశంలో అసమానతలు పెరిగాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో, ఈశాన్యంలోని చిన్న రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటులో తగ్గుదల కనిపిస్తుంది. 2019-21లో దేశంలో అత్యల్పంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు1.4 ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్, హిమచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది1.5 నమోదైనట్టు భారత రిజిస్ట్రార్ జనరల్ నివేదిక ద్వారా తెలుస్తుంది. అదే సమయంలో బీహార్ (3), ఉత్తరప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6) రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అధికంగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో 2026లో జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడుతాయి. నియోజకవర్గాల పునర్విభజనపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నా బీజేపీ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వకుండా మరింత గందరగోళంగా వ్యవహరిస్తోంది. ఒక్కో నియోజకవర్గాన్ని ఎన్ని లక్షల జనాభా ప్రకారం ఏర్పాటు చేస్తారో స్పష్టత లేదు. ఉదాహరణకు 20 లక్షల జనాభా ప్రతిపాదికన పునర్విభజన చేపడితే ప్రస్తుతమున్న 543 నియోజకవర్గాలు దాదాపు 700 చేరుకుంటాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు భారీగా పెరుగుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీట్లలో కోత పడే అవకాశాలున్నాయి. దీంతో భారత భవిష్యత్ అవసరాల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించి దేశ ప్రగతికి సహకరిస్తే ఇప్పుడు శిక్షిస్తారా..? అనే ఆందోళన ఇక్కడి ప్రజల్లో ప్రారంభమైంది.
ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దక్షిణ రాష్ట్రాల్లో సీట్లు తగ్గవని కేంద్రం పెద్దలు చేస్తున్న ప్రకటనల్లో అనేక కుట్రలు ఉన్నాయి. అన్ని వైపుల నుండి వస్తున్న ఒత్తిడితో దక్షిణాదిన స్థానాలు తగ్గవని చెబుతున్నా ఉత్తరాదిన సీట్లు పెరుగుతాయా..? లేదా వారు స్పష్టం చేయడం లేదు. దక్షిణాదిన సీట్లు తగ్గకపోయినా, ఉత్తరాది ప్రాధాన్యత పెరిగి, దక్షిణాది ప్రాధాన్యత తగ్గి కీలకాంశాల్లో దక్షిణాది పాత్ర నామమాత్రమై, ఉత్తదారి ఏకచ్ఛక్రాధిపత్యం పెరగడం ఖాయం. ఉత్తరాది ప్రాంతంలో మతతత్వంతో సున్నితమైన మనోభావాలను రెచ్చగొడుతూ ఆధిపత్యం కొనసాగిస్తున్న బీజేపీ లౌకికవాదానికి తిలోదకాలిస్తూ, బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయానికి భంగం కలిగించే పలు వివాదాస్పద నిర్ణయాలతో దేశంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చట్టసభల్లో దక్షిణాది ప్రాధాన్యత తగ్గితే దేశ లౌకికవాదానికి, సమైక్య స్ఫూర్తికి, బడుగు బలహీన వర్గాల హక్కులకు భంగం కలిగించేలా బీజేపీ ప్రమాదకరంగా వ్యవహరిస్తూ చట్టాలు, బిల్లులు రూపొందిస్తే సంఖ్యా బలంగా అడ్డుకోవడం కష్టం.
అశాస్త్రీయంగా నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయ హక్కులకు భంగం కలగడమే కాకుండా దక్షిణ రాష్ట్రాలు ఆర్థికంగానూ నష్ట పోతాయి. జనాభా ప్రాతిపదికనే కేంద్రం నిధులు కేటాయిస్తే దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. కేంద్రానికి రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నులలో రాష్ట్రాలకు తిరిగి రావాల్సిన వాటాల్లో ఇప్పటికే వివక్షతతో అన్యాయం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు పన్నుల రూపంలో రూపాయి చెల్లిస్తుంటే కర్ణాటకకు 14 పైసలు, తమిళనాడుకు 29 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళాకు 62 పైసలు మాత్రమే వెనక్కొస్తున్నాయి. మరోవైపు బీహార్కు రూ.6.06 పైసలు, ఉత్తరప్రదేశ్కి రూ.2.73 పైసలు, మధ్యప్రదేశ్కు రూ.1.73 పైసలు ఇస్తుండడంతో రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణ పాటిస్తూ సకాలంలో పన్నులు చెల్లిస్తుంటే ప్రతిఫలంగా జనాభా ప్రాతిపదిక పేరుతో అన్యాయం చేస్తే బాధిత రాష్ట్రాల నుండి కచ్చితంగా ఆక్రోశం, ఆందోళనలు వెలువడుతాయి.
భారత దేశ భౌగోళిక, సంస్కృతి, చరిత్రపై పూర్తి అవగాహన ఉన్న ఉక్కు మహిళగా పేరుగాంచిన మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దూర దృష్టితో ప్రాంతాల మధ్య అసమానతలు పెరగకుండా దేశ సమాఖ్యను పరిరక్షిస్తూ, సమైక్య స్ఫూర్తికి భంగం కలగకుండా 1976లో నియోజకవర్గాలను జనాభా ప్రాతిపదికన కాకుండా సరిహద్దులు మారుస్తూ పునర్విభజించారు. అందరికీ ఆమోదయోగ్యమైన ఈ ఫార్ములానే వాజ్పేయి ప్రభుత్వం కూడా అసుసరించి గతంలో డీలిమిటేషన్ చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తూ దక్షిణాదికి అన్యాయం జరగకుండా జనాభా ప్రాతిపదికన కాకుండా సరిహద్దుల మార్పులతోనే నియోజకవర్గాలను పునర్విభజించాలి. రాబోయే 25 సంవత్సరాల వరకు ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథస్థితిని కొనసాగించాలి. రాజ్యాంగంలో 42, 84, 87వ సవరణల ప్రకారం జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలను ప్రోత్సాహిస్తూ, వాటి హక్కులను పరిరక్షించాలి.
మతం, కులం పేరుతో విభేదాలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనతో ప్రాంతాల మధ్య విభజనలు సృష్టిస్తూ ప్రమాదకరమైన కుట్రలకు తెరలేపింది. పునర్విభజన పేరుతో బీజేపీ దక్షిణాదికి చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి. దేశ సమాఖ్య, సమైక్యతకు భంగం కలగకుండా ప్రజా పక్షాన నిత్యం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల పునర్విభజనపై కూడా కేంద్రంతో తలపడడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో అన్ని వర్గాలు కాంగ్రెస్కు మద్దతుగా నిలిచి పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం పునారాలోచించేలా ఒత్తిడి తెచ్చి దేశంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా పోరాడాలి.