Bealert: దొంగ ‘బంధువులుంటారు’.. జాగ్రత్త..!!

Bealert:

 

NOTE: ఇది మీడియా కథనాల ఆధారంగా రాసింది. ఈ ఘటన యథాతథంగా ఇలాగే జరిగిందన్న నిర్ధారణ లేదు. జనాలను అప్రమత్తం చేయడం మాత్రమే ఈ ఆర్టికల్.

 ఆ అమ్మాయి సొంతూరు కృష్ణా జిల్లాలో ఓ ఊరు. విజయవాడలోని ఓ కాలేజీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న SR(పూర్తి పేరుకు షార్ట్ ఫామ్) ఆమెకు పరిచయమయ్యాడు. మామూలుగా మాటలు కలిపి కొన్ని రోజులయ్యాక, తన అక్కల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని అన్నాడు. ఈ అమ్మాయి ‘అయ్యో’ అనుకుంది. తనకు గుండె జబ్బు ఉందని, రెండేళ్ల కన్నా ఎక్కువ బతకనని బాంబు పేల్చాడు. ఆపరేషన్ చేసినా లాభం లేదని, తనకు చావు తప్పదని వివరించాడు. బతికున్న కొన్ని రోజులు హాయిగా, ఆనందంగా జీవించడమే తన లక్ష్యమని చెప్పాడు(ఏదైనా సినిమా గుర్తొస్తోందా?). ఆమె గుండె ఝల్లుమంది. అతని మీద జాలి మరింత పెరిగింది.

ఆమెను ‘అక్కా..’ అని పిలుస్తూ ఆమె ఇంటికి అప్పుడప్పుడూ వెళుతూ ఉండేవాడు. వాళ్లు కుటుంబసభ్యులు కూడా అతనితో బాగా మాట్లాడేవారు. కొన్నాళ్లకు వారికి ఆ పనీ, ఈ పనీ చేసి పెడుతూ ఇంట్లో పిల్లాడిగా కలిసిపోయాడు. ఆ ఇంట్లోనే ఉండేవాడు. వారు పెట్టింది తినేవాడు. ఒకరకంగా ఆ ఇంట్లో అబ్బాయిలాగే మెలిగేవాడు. ఇదంతా ఒక్క రోజులో జరిగిన విషయం కాదు. కొన్ని నెలలు జరిగిన వ్యవహారం. దీంతో అతని మీద వాళ్లందరికీ నమ్మకం ఏర్పడింది.

ఈ ఏడాది మార్చిలో ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లు బీరువా లాకరులో ఉండాల్సిన రూ.20 లక్షల డబ్బు, రూ.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు లేవు. ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది అని మొత్తం ఆరా తీయగా అనుమానం SRపైకి మళ్లింది.

మెల్లగా అతణ్ని కనుక్కున్నారు. ఆ బంగారం, డబ్బు తానే తీశానని, తన ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, తన తల్లి, తండ్రి అనారోగ్యంతో ఉన్నారని చెప్పాడు. వాళ్ల కోసం ఆ డబ్బు వాడానని అన్నాడు. క్షమించమని, మరో దారి లేక అలా చేశానని కాళ్లు పట్టుకున్నాడు.(ఆ అమ్మాయే జాలితో అతనికి డబ్బు ఇచ్చి ఉంటుందన్న అనుమానం కూడా ఉంది. కానీ అది బయటకు రాలేదు).

‘సరే.. తొందరగా ఆ డబ్బు తెచ్చి ఇవ్వు’ అన్నారు. ఏప్రిల్, మే నెలలు గడిచాయి. డబ్బులు రాలేదు, నగలు రాలేదు. వీళ్లకిక ఓపిక నశించి పోలీస్‌ కేసు పెడతామన్నారు. అలా చేస్తే తాను ఆత్మహత్య చేసుకొంటానని SR బెదిరించడం మొదలుపెట్టాడు. ఇదే టైంలో ఓ వ్యక్తి తెరమీదకు వచ్చాడు. తాను బ్యాంకు రికవరీ ఏజెంటునని, అతని నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఇప్పిస్తానని చెప్పి, ఛార్జీల కింద రూ.5.80 లక్షల దాకా వాళ్ల నుంచి వసూలు చేశాడు. మరో వ్యక్తి కూడా వచ్చి, ఈ వ్యవహారంపై కేసులేమైనా పెడితే చంపేస్తామంటూ ఆ అమ్మాయిని హెచ్చరించడం మొదలుపెట్టాడు.

చిట్టచివరకు ఇదంతా ఓ ట్రాప్ అని ఆ ఇంట్లోవాళ్లకి అర్థమైంది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంతో SRతోపాటు అతని తల్లి, తండ్రి, అన్న, వారికి సహకరించిన మరికొన్ని పేర్లు బయటపడ్డాయి. అసలు SRకి అక్కాచెల్లెళ్లెవరూ లేరని, వాళ్ల ఆత్మహత్య, అతని గుండెజబ్బు.. అన్నీ అబద్ధాలని తేలిపోయింది. కథ ఇక్కడితో అయిపోలేదు. SR పరారీలో ఉండటంతో అతని కుటుంబసభ్యులు హైకోర్టుకు వెళ్లారు. తమ కుమారుణ్ని వాళ్లే మాయం చేశారని, అతణ్ని వెతికి పట్టుకోవాలని ‘హెబియస్ కార్పస్’ పిటీషన్ వేశారు. అతను ఎక్కడున్నా వెతికి కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కేసు నడుస్తోంది.

ఇందులో ఎంత నిజం, ఎంత అబద్ధమనేది ఇప్పుడే నిర్ధారణకు రాలేము. ఇదంతా పోలీసులు చెప్పిన కథనం మాత్రమే. అందులో ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పారనేది తెలియదు. కానీ ఇలాంటి ఘటనలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్తూ ఇదొక హెచ్చరిక మాత్రమే.

‘అక్కా.. చెల్లీ..’ అంటూ ట్రాప్ చేసి, అమ్మాయిలను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ(కొన్నిసార్లు అబ్బాయిలను కూడా) ‘అప్పులవాళ్లు నన్ను వెంటాడుతున్నారు. నువ్విప్పుడు డబ్బులు ఇవ్వకపోతే రైలు కింద పడి చచ్చిపోతాను. లేకపోతే పురుగుమందు తాగి చస్తాను’ అంటూ ఏడ్చి, డబ్బులు గుంజుకునే బ్యాచ్ ఒకటి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఒక్కసారి వారికి చిక్కామంటే అంతే! పీల్చి పిప్పి చేసేదాకా వదలరు. కొందరు అమ్మాయిలు వాళ్లను నమ్మి తమ నగలు, ఆస్తి పత్రాలు కూడా తాకట్టు పెట్టి(నిజంగా) డబ్బులు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. అంతా అయ్యాక ఆ అమ్మాయిలకు ఇంట్లో వాళ్ల తిట్లు, దెబ్బలు, సమాజంలో అనుమానపు చూపులు తప్ప ఏమీ మిగలవు.

కాబట్టి ఇట్లాంటి దొంగ బంధువులతో జాగ్రత్త. ఎవ్వర్నీ అతిగా నమ్మొద్దు. ముఖ్యంగా డబ్బు వ్యవహారాల్లో.

– విశీ

Optimized by Optimole