రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. రాష్ట్రంలో అత్యద్భుత పనితీరు కనబరుస్తూ.. కేంద్రం నుండి 10 జాతీయ అవార్డులను సాధించిపెట్టిన శాఖ మూల స్తంభాలైన పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం పట్ల అధికారులు దృష్టి సారించాలని కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను అనుసరిస్తూ జరిగినందున..రెగ్యులర్ చేసే క్రమంలో వారి నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు పీరియడును రెగ్యులర్ సర్వీస్ గా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. టీఎస్పీఎస్సీ.. ఇతరత్రా పోటీ పరీక్షల నిమిత్తమై ప్రిపేర్ అయ్యే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకమైన సెలవులను అభ్యర్థన మేరకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేశ్వర్లు, టీఎన్జీవో కేంద్ర సంఘం ఉపాధ్యక్షులు తెలగమల్ల పర్వతాలు , నజీర్ తదితరులు పాల్గొన్నారు.