విద్వేషానికి స్వస్తి.. ప్రేమకు నాంది..!!
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. కన్యా కుమారి నుంచి కశ్మీర్ వరకు 140 రోజుల పాటు నిర్వరామంగా 75 జిల్లాల గుండా 4080 కిలో మీటర్ల మేర సాగిన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. రాహుల్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. జోడో యాత్రలో రాహుల్ వెంట పాల్గొనడానకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనా ఏకైక మహిళ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ. గతంలో ఆమె ఆంధ్రప్రదేశ్ మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.ప్రత్యేక హోదా..వైజాగ్ స్టీల్ ప్లాంట్.. అమరావతి రాజాధాని రైతుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహిళనేతగానే కాకుండా.. ఉద్యమాల్లో పాల్గొనందుకు అనేక కేసులన్న ఏకైక మహిళ నేతగా పేరుంది . 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటిచేసి ఓడిపోయారు. భారత జోడోయాత్ర గురించి ఆమె స్పందన ఏంటి? 2024 ఎన్నికలపై యాత్ర ప్రభావం చూపే అవకాశం ఉందా? ప‌్రతి పక్ష పార్టీల నేతలు ఏమనకుంటున్నారు వంటి విషయాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..!
ప్రశ్న.. భారత్ జోడో యాత్ర కోసం రాహుల్ బృందంలో ఏపీ నుంచి ఎంపికైనా ఏకైక మహిళ మీరు! యాత్ర అనుభవం ఎలా ఉంది?
పద్మశ్రీ: చాలా బావుదండి! యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏపీ నుంచి నన్ను మాత్రమే పార్టీ సెలక్ట్ చేసింది. కన్యా కుమారి నుంచి కశ్మీర్ వరకు ఎండ, వాన లెక్క చేయకుండా రాహుల్ గాంధీ గారితో ప్రయాణం జీవితంలో మర్చిపోలేను. కార్యకర్తలు సైతం పరిస్థితులతో సంబంధం లేకుండా సంకల్ప దీక్షతో యాత్ర పూర్తి చేశాము.
ప్ర: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు?
పద్మశ్రీ: తెలంగాణ నుంచి 6 గురు..ఏపీ నుంచి నన్ను మాత్రమే పార్టీ సెలెక్ట్ చేసింది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా మహిళా కార్యకర్తలతో కలిసి దేశ హితం కోసం యాత్రలో పాల్గొనడం నా రాజకీయ జీవితంలో మర్చిపోలేని ఘట్టం.
ప్ర: పాదయాత్ర ప్రజల స్పందన ఎలా ఉంది?
పద్మశ్రీ: యాత్ర కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. కుల ,మతాలకు అతీతంగా స్వచ్ఛందంగా యాత్రలో పాల్గొన్నారు. యువతకు రాహుల్ నాయకత్వంపై నమ్మకం పెరిగింది. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేస్తుందన్న భరోసా రాహుల్ గాంధీ కల్పించారు. విద్వేశపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పి.. ప్రేమను పంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడమే మా తక్షణ కర్తవ్యం.
ప్ర. జోడో యాత్రపై ప్రతిపక్ష నేతల స్పందన ఎలా ఉంది?
పద్మశ్రీ: జోడోయాత్రతో ప్రతిపక్ష నేతల వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పై విమర్శలు చేసిన వారే.. నేడ ప్రశంసలు కురిపిస్తున్నారు. యోగేంద్ర యాదవ్ , మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ .. సినీ,రాజకీయ ప్రముఖులు, కవులు యాత్రకు మద్దతుగా మాతో పాల్గొన్నారు. వాళ్ల మాటలను బట్టి మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.
ప్ర: త్వరలో జరగబోయే ఎన్నికల్లో జోడోయాత్ర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారా?
పద్మశ్రీ: ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నాం. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జోడోయాత్రతో ఆవిషయం తేటతెల్లమయ్యింది. 2024 ఎన్నికల్లో రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని బలంగా నమ్ముతున్నా. దక్షిణాదినా కర్ణాటకలో అధికారంలోకి రాబోతున్నాం.
ప్ర: థాంక్యూ ..
పద్మశ్రీ: థాంక్యూ ..