కాంగ్రెస్ కుటుంబానికి  బోఫోర్స్‌..ప్ర‌ధానికి గుజరాత్‌ అల్లర్లు–భూతాల్లా వెంటాడతాయి!

కాంగ్రెస్ కుటుంబానికి బోఫోర్స్‌..ప్ర‌ధానికి గుజరాత్‌ అల్లర్లు–భూతాల్లా వెంటాడతాయి!

Nancharaiah Merugumala:(senior journalist)
………………………………………………………………………………
దేశంలో అవినీతి విషయంలో గుత్తాధిపత్యం కాంగ్రెస్‌ పార్టీది. హిందూ మతోన్మాదాన్ని ఎన్నికల్లో వాడుకోవడం బాగా తెలిసిన పార్టీ బీజేపీ. ఇప్పుడు జనంలో ఉన్న అభిప్రాయాలివి. అయితే, ఈ రెండు కారణాలతోనే ఈ రెండు పార్టీలను పదే పదే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం కుదిరే పని కాదని గత 40 ఏళ్ల చరిత్ర చెబుతోంది. 1987–89 మధ్య కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉండగా వెలుగులోకి వచ్చింది బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలు కుంభకోణం. స్వీడన్‌ సరఫరా చేసిన ఈ ఆయుధాల కొనుగోలు ఒప్పందంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజీవ్‌ తన మనుషుల ద్వారా కోట్లాది రూపాయల ముడుపులు తీసుకున్నారని అనేక రుజువులతో మీడియాలో కథనాలు వచ్చాయి. కమ్యూనిస్టు నేత గురుదాస్‌ దాస్‌ గుప్తా, ఎస్‌.జైపాల్‌ రెడ్డి, అల్లాడి అరుణ (డీఎంకే) వంటి సీనియర్‌ పార్లమెంటేరియన్లు బోఫోర్స్‌ ముడుపులు ఎలా రాజీవ్‌ ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి అందాయో పరిశోధన ద్వారా నిరూపించారు.

అయినా 1989 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 197 స్థానాలతో అతిపెద్ద పార్టీగానే అవతరించింది. తర్వాత కోర్టులో రాజీవ్‌ బోఫోర్స్‌ దళారి అని రుజువు కాకపోవడంతో ఈ పాపంతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ, ఆమె కూతరు, కొడుకు ప్రకటించుకున్నారు. అయినా భారత రాజకీయాల్లో ఉన్నంత వరకూ గాంధీ–నెహ్రూ కుటుంబ సభ్యులను బోఫోర్స్‌ భూతం వెంటాడుతూనే ఉంటుంది. అలాగే, 2002 గుజరాత్‌ అల్లర్లలో నాటి సీఎం, నేటి ప్రధాని నరేంద్రమోదీ పాత్ర లేదని కోర్టులు, కొన్న దర్యాప్తు సంఘాలు, మధు పూర్ణిమా కిష్వర్, తవ్లీన్‌ సింగ్‌ వంటి ప్రసిద్ధ జర్నలిస్టులు చెప్పినా గాని ఆయన ప్రధానిగా ఉన్నంత కాలం గుజరాత్‌ మారణకాండ ఆయనను వదిలిపెట్టేలా లేదు. కాంగ్రెస్‌ అవినీతిని దేశ ప్రజలు సహించి మర్చిపోయినట్టే, బీజేపీ హింసాత్మక హిందుత్వను జనం పెద్ద నేరంగా ప్రస్తుతానికి భావించడం లేదు.