Tearfulltribute: ఎవరి ‘స్వర్గం’ వారే రచించుకోవాలి..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):  సాత్వికంగా ఉంటే… సామర్థ్యంతో నిమిత్తం లేకుండా ఒకోసారి గుర్తింపు రాదేమో! గుర్తింపులోనూ తేడాలు. ఎవరి గుర్తింపు? ఏ రకమైన గుర్తింపు? మళ్లీ ఇవి సాపేక్షంగా చూడాల్సినవే! అందుకని, ఒకరిని ఎవరి దృష్టి కోణంలో వారు చూసి, మంచి-చెడులు గణించడం, ఆ మేర పరిగణించడమే సమంజసమేమో! జన్నత్ హుస్సేన్, ఐ.ఎ.ఎస్ అనే సీనియర్ ఆలిండియా సర్వీసెస్ అధికారి… మౌలికంగా సద్యోచన (positive thinking) గల మంచివాడు. సాత్వికుడు. అందరితోనూ మంచిగా ఉండాలి, నలుగురికి వీలయిన ఏదైనా మేలు చేయాలి అనుకునే వాడు. ఆధ్యాత్మిక భావజాలం ఉన్నా ఛాందసుడు కాదు అనిపిస్తుంది. లౌకికులతో ఉన్నట్టే, ఆయన తన మతానికి చెంది ముద్రపడ్డ ఛాందసులతోనూ సాత్వికంగా మమేకమై, సమ్మిళితమై…. ఓ అంచనాకు దొరకని వాడుగా నాకు కనిపించేది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్)గా చేరడానికి ఎంతో ముందుగానే ఆయన నాకు పరిచయం. మరో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మద్యనిషేధం అమలు చేస్తున్నపుడు సదరు ఎక్సైజ్-ప్రొహిబిషన్ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. ఈనాడు దినపత్రిక సీనియర్ రిపోర్టర్గా నేను ఆ శాఖలో పరిణామాలను సన్నిహితంగా గమనిస్తున్నపుడు, కొన్ని కథనాలు ప్రచురిస్తున్నపుడు…  జన్నత్ హుస్సేన్ని పలు పర్యాయాలు కలిశాను. తర్వాత నేను సమాచార హక్కు చట్టం అమలు చేసే రాష్ట్ర కమిషనర్గా ఉన్న చివరి దశలో ఆయన మాకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)గా వచ్చారు. ఇప్పటిలా కాదు, చట్టం వచ్చీ రాగానే కమిషన్ ఏర్పరచడం, ఖాళీ అయిన వెంటనే ఆయా స్థానాలు భర్తీ చేయడం, అలా… కమిషన్ను ప్రభుత్వం నిరంతరాయంగా కార్యాచరణలో ఉంచిన మంచి కాలమది. మా పదవి గడువు ముగియడానికి ఇంకా కొన్ని నెలలు ఉంది అన్నప్పుడే మా చీఫ్ కమిషనర్ సి.డి.అర్హ (65 యేళ్లు నిండి) పదవీవిరమణ చేశారు. ఆ స్థానంలోకి జన్నత్ హుస్సేన్ వచ్చారు. అలా కొంత కాలం మేం కలిసి పనిచేశాం.

     ముఖ్యమంత్రికి పొలిటికల్ సెక్రటరీగా పనిచేసిన ఐఎఎస్ అధికారుల్లో నాకు తెలిసి ఎస్వీప్రసాద్ ఎంతో ప్రభావవంతమైనవాడిగా ప్రసిద్దులు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, కోట్ల విజయభాస్కరరెడ్డితో పాటు పలువురు సీఎం ల దగ్గర ఆయన పనిచేశారు. పరిపాలనలో మెదడు వంటి సీఎంఓలో ఉండి, నాయకుడికి తల్లోనాలుకగా వ్యవహరించడం కొందరికే సాధ్యమౌతుంది. అలాంటి వాళ్లలో జన్నత్ ఒకరు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ లాల్బహదూర్ స్టేడియంలో బాధ్యతలు స్వీకరించి ‘రైతులకు ఉచిత విద్యుత్తు’ ఫైల్పై తొలి సంతకం చేస్తున్నపుడు జన్నత్ ఆయన పక్కనే ఉన్నారు. ఇక, సీఎంవోలో అవ్యక్త, ఆంతరంగిక వ్యవహారాలు ఎలా ఉంటాయో మచ్ఛుకు ఒకటి చెబుతాను. ఆర్టీఐ కమిషనర్గా ఉన్నపుడు చట్టరీత్యా నా హోదా చీఫ్సెక్రటరీతో సమానం. కుందన్బాగ్లోని ఐఎఎస్ అధికారుల క్వార్టర్స్లో అధికారిక నివాసం ఉండొచ్చు. ‘ఇక్కడ ఫలానా క్వార్టర్ ఒకటి ఖాళీ ఉంది, నీవు దరఖాస్తు చేసుకోవచ్చు కద?’ అని నాకు సన్నిహితులైన ఇద్దరు ఐపీఎస్ అధికారులిచ్చిన సూచన మేరకు నేను మామూలుగానే దరఖాస్తు చేశాను. సాధారణంగా దానికో ప్రొసీజర్ ఉన్నా…. అప్పుడున్న డిమాండ్-సప్లై నిష్పత్తిని బట్టి ముఖ్యమంత్రి విచక్షణ మేరకు కేటాయింపు జరుగుతుంది. కొంత కాలం తర్వాత జన్నత్ హుస్సేన్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీతో మాట్లాడాలి, నేను రానా..? మీరు వస్తారా?’ అన్నారాయన. ‘మీరేం వద్దు. అర్జంట్ కాదు అంటే, రేపు నేను సీఎంవోకు రాగలను’ అన్నాను. అలా మేం కలిసినపుడు, ‘మీరు క్వార్టర్ కోసం అడిగారు కద, సర్వీస్ ఆఫీసర్లదే పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఈ చక్కర్లోకి తను ఎందుకు? ప్రయివేటు హౌజ్లో ఉన్నా ప్రభుత్వం రెంటల్స్ పే చేస్తుంది కద, దిలీప్ని ఏదైనా మంచి ప్రయివేట్ అకామిడేషన్ చూసుకోమని సూచించండి అని సీఎం గారు నాతో చెప్పారు’ అన్నారు జన్నత్! ‘ఇట్స్ ఓకే’ అన్నాను సింపుల్గా. కొన్నాళ్ల తర్వాత నాకు తెలిసిందేమిటంటే, క్వార్టర్స్ కేటాయింపు అంశం సీఎం పరిశీలనకు వచ్చినపుడు, ప్రయివేటు అద్దె ఇల్లు సలహా సీఎం కి తట్టింది కాదు…  సూచించిందే జన్నత్ హుస్సేన్ అని, ‘అలా అయితే, అది మీరే చెప్పండి బావుంటుంది’ అన్న సీఎం పురమాయింపుతో ఆయన నాతో భేటీ అయ్యారనేది నాకు తెలిసిన సమాచారం.

     అది 2010 నవంబరు నెల. అందరం కమిషన్లో కలిసి పనిచేస్తూ, అంబటి సుబ్బారావు, కె. సుధాకరరావు, నేను… మేం ముగ్గురం పదవీ విరమణ చేసే సమయం. అంతకు ఒక రోజు ముందు రమజాన్ పండుగ వచ్చింది. జన్నత్ హుస్సేన్ ఆహ్వానం మేరకు మేం ముగ్గురం పంజాగుట్టలోని ఆఫీసర్ కాలనీలో ఆయన ఇంటికి వెళ్లాం. సరాదాగా మాట్లాడుకొని, కీర్ పాయసం తిన్న తర్వాత….  ఒక కేసు ఆర్డర్ గురించి మాట్లాడాం. అది అప్పటికే తీవ్ర  జాప్యం జరిగింది. తుది ఉత్తర్వులు సిద్దం చేసి ఉన్నాయి. “……. రేపటి తేదీతో ఆ ఉత్తర్వులు ఇచ్చేద్దాం. సంతకాల కోసమైతే ఇవాల అటెండర్ని ఇచ్చి, మా ఇళ్లకు ఫైల్ పంపించండి పని తేలికవుతుంది” అన్నాం. ఒకవేళ అది జరుగకపోతే, ఒకటి-రెండు రోజుల తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టి కేసు, వివరాలు, జాప్యం, దారితీసిన కారణాలు…. ఇత్యాది వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది అని అంతకు ముందే, మేం ముగ్గురం కలిసి తీసుకున్న ఒక నిర్ణయాన్నీ ఆయనకు తెలియజేశాం. అది, ఆలిండియా సర్వీస్ అధికారులు ఏటా శాఖాధిపతికి, సీల్డ్ కవర్లో సమర్పించే తమ ఆస్తుల వివరాల సమాచార వెల్లడి వివాదం కేసు. ఇవ్వనవసరం లేదని ఆఫీసర్ల సంఘం వాదించగా, ఇవ్వాల్సిందేనని పౌరసమాజ కార్యకర్తలు వాదించారు. ఆర్టీఐ రెండో అప్పీలును పరిష్కరిస్తూ కమిషన్ ఫుల్బెంచ్ వెలువరించిన తుది తీర్పది. అంతకు ముందరి ఉన్నత న్యాయస్థానాల తీర్పులను ఉటంకిస్తూ… సదరు సమాచారం ఆర్టీఐ కింద, కోరినవారికి వెల్లడించాల్సిందేని కమిషన్ తీర్పు ఇచ్చింది. తరువాత దాన్ని ప్రతివాదులు హైకోర్టువరకు తీసుకువెళ్లగా కమిషన్ తీర్పునే సదరు న్యాయస్థానం సమర్థించింది. అది వేరే విషయం.అందుకని, ఆ కేసు ప్రాధాన్యత కలిగిందిగా మేం ముందే భావించాం. పైగా అంతకు ముందు ఈ కేసు ఉమ్మడి విచారణలో పాల్గొన్న సి.డి.అర్హ, చివర్లో బెంచ్కు నేతృత్వం వహించిన జన్నత్ హుస్సేన్…. ఇద్దరు కూడా రిటైర్డ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారులే అయినందున, వారికి మచ్చ రాకూడదనీ మేం అంతగా స్పందించాల్సి వచ్చింది.ఏమనుకున్నారో… ఆ సాయంత్రమే ఫైల్ మాకు సర్క్యులేట్ చేసి, తర్వాతి రోజు తేదీతో తుది ఉత్తర్వులిప్పించ్చారు. దటీజ్ జన్నత్ హుస్సేన్.

” జీవిత చరమాంకంలో మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్) తో ఇబ్బందిపడి, అసువులు బాసి అంతిమంగా జన్నత్ (స్వర్గం) చేరిన మితృడికి కన్నీటి నివాళి ..వినమ్ర శ్రద్దాంజలి

Related Articles

Latest Articles

Optimized by Optimole