హైదరాబాద్:
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డి పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు.
“కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆరా? లేక హరీశ్ రావా? అనేది మాకు సంబంధం లేదు. వారి హయాంలోనే స్కాం జరిగిందనేది కవిత మాటలతో రుజువైంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే? కాళేశ్వరం అవినీతిలో మామ కేసీఆర్ వాటా ఎంత..? అల్లుడు హరీశ్‌రావు వాటా ఎంత..? అనేది తేలాల్సి ఉందని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు.
బీఆర్‌ఎస్ నేతల కుటుంబ విభేదాలపై కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. “కేసీఆర్ కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్ దశకు చేరింది. కుటుంబ కలహాలను కాంగ్రెస్‌పై రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఏమీ తప్పు చేయలేదంటున్న బీఆర్‌ఎస్ నేతలు సీబీఐ విచారణ ఎదుర్కొనే ధైర్యం ఎందుకు చూపడం లేదు?” అని ప్రశ్నించారు.
మొదటి దఫా ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు తప్పు చేసి ఉంటే, అప్పట్లోనే కేసీఆర్ చర్యలు ఎందుకు తీసుకోలేదని మహేష్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. “ఆ సమయంలో కవిత ఎందుకు నోరు విప్పలేదు? నేడు తమ కుటుంబ అంతర్గత కలహాలతో హరీశ్‌రావును టార్గెట్ చేయడం ఏమిటి? అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చిన కేటీఆర్, కవితలు ఒకే స్క్రిప్ట్‌తో హరీశ్‌రావుపై దాడి చేస్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ అవినీతిని బయటపెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. “గతంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చెప్పింది. ఆ దెయ్యాలు హరీశ్ రావు, సంతోష్ రావులేనా..? ఇంకా ఎవరెవరున్నారో ఆమె స్పష్టం చేయాలి. కవిత మాటలే నిజమా? లేక నిన్న అసెంబ్లీలో మాట్లాడిన హరీశ్‌రావు మాటలే నిజమా? వారే క్లారిటీ ఇవ్వాలి” అని మహేష్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.