Telangana Congress:
బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు
(జనహిత పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో చేపట్టనున్న నిరసనల సందర్భంగా ప్రత్యేక వ్యాసం…)
తెలంగాణలో సబ్బండ వర్గాల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజలకు మరింత మేలు చేయాలనే సంకల్పంతో ‘జనహిత’ పాదయాత్ర చేపట్టింది. రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం ఇప్పటికే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తూ ‘తెలంగాణ రైజింగ్’తో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యింది. ఒకవైపు ప్రభుత్వ పరంగా ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్న కాంగ్రెస్, మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమైనా స్థానిక సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిని సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో పార్టీ నేతృత్వంలో ప్రజల వద్దకు వెళ్లాలని సంకల్పించి ‘జనహిత’ పాదయాత్రకు తెలంగాణ పీసీసీ శ్రీకారం చుట్టింది.
ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు అని కొలిచే కాంగ్రెస్ అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపడుతుంది. పార్టీ అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టి క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలను, ప్రజా సమస్యలను గుర్తించారు. భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించింది. తెలుగు నాట పాదయాత్ర కాంగ్రెస్‌కు కొత్తకాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డా.రాజశేఖర రెడ్డి 2003లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో ‘ప్రజా మానిఫెస్టో’ రూపొందించి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రలు నిర్వహించి ప్రజా సమస్యలతో పాటు బీఆర్ఎస్ పాలనలో ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి ‘అభయ హస్తం’ మానిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించి, ఆరు నూరైనా వాటిని అమలు చేస్తోంది.
బీఆర్ఎస్ రెండు దఫాల పాలనలో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ అప్పులతో ఆర్థికంగా కుదేలయినా మడమ తిప్పని కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండో రోజే ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సుప్రయాణాన్ని అమలు చేసింది. అనతికాలంలోనే రూ.500 సబ్సిడీ గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు, భారీగా రేషన్ కార్డుల మంజూరు, రేషన్ షాపులలో సన్న బియ్యం ఉచిత పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు వంటి బృహత్ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా మహిళా సాధికారిత కోసం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం తీసుకొచ్చి వారికి ఆర్థికంగా అండగా నిలిచింది.
రైతులు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని విశ్వసించే కాంగ్రెస్ తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకుంది. రైతు రుణమాఫీ, వరికి బోనస్, రైతు భరోసా, రైలు కూలీలకు ఇందిరమ్మ భరోసా వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పంటలకు సరైన మద్దతు ధర చెల్లించింది. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సాగు నీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంది. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసినా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆపన్న హస్తం అందించింది.
మన రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువత ఆశలను బీఆర్ఎస్ సర్కార్ వమ్ము చేసింది. ఇంటికో ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు రాజకీయ పదవులు ఇచ్చుకున్నారు కానీ రాష్ట్ర యువతను పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే 65 వేలకు పైగా నియామకాలు పూర్తి చేయడమే కాకుండా, స్వయం ఉపాధి కోసం రాజీవ్ వికాసం ద్వారా రుణాలను అందిస్తోంది.
రాష్ట్రంలో శాస్త్రీయబద్దంగా కులగణన నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలవడంతో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని ప్రకటించడం కాంగ్రెస్ నైతిక విజయం. కులగణన గణాంకాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం చారిత్రాత్మక నిర్ణయం. బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రం కేంద్రానికి పంపినా మోదీ ప్రభుత్వం చట్టబద్దత కల్పించలేదు. రాష్ట్ర హై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక ఎన్నికలను త్వరలో నిర్వహించాల్సిన దృష్ట్యా, బీసీలకు రాజకీయంగా అన్యాయం జరగకూడదనే సద్దుదేశంతో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తే, దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీ బిల్లు, ఆర్డినెన్స్ రెండూ కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉండడంతో ‘బీసీల నోటి కాడ ముద్ద లాగొద్దు’ అని కాంగ్రెస్ కోరుతున్నా బీజేపీ సర్కార్ పట్టించుకోవడం లేదు.
బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా కేంద్రంపై ఒత్తిడి తేలేని రాష్ట్ర బీజేపీ నేతలు బీసీ బిల్లుకు చట్టబద్దత సాధ్యం కాదని ప్రకటించడం ఈ సామాజిక వర్గాలపై వారికున్న వివక్షకు నిదర్శనం. ఇంతదాకా వచ్చాకా తెలంగాణలోని బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదనే సంకల్పంతో బీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టబద్దత కోసం జాతీయ స్థాయిలో బీజేపీపై ఒత్తిడి తేవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ‘ఇండియా’ కూటమిలోని పార్టీలను కలుపుకొని ఆగస్టు 5,6,7 తేదీల్లో ఢిల్లీలో నిరసనలు చేపట్టనుంది. ఈ కార్యక్రమాలకు బీసీ సంఘాలు, మేధావులు, ప్రజలు భారీగా తరలి వచ్చేలా కాంగ్రెస్ ‘జనహిత పాదయాత్ర’లో మద్దతు కూడకట్టుతోంది.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లపై బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తోంది. భౌగోళికంగా రాష్ట్రం ఏర్పడినా సామాజిక తెలంగాణ రాలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవితే అన్నారంటే వారి పదేళ్ల పాలనలో సామాజిక న్యాయం ఏమేరకు జరిగిందో తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే, కేసీఆర్ సర్కార్ 23 శాతనికి తగ్గించి వారి రాజకీయ భవిష్యత్‌ను దెబ్బతీసింది. కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీఆర్ఎస్ మద్దతివ్వకుండా బీజేపీతో చేతులు కలిపింది. గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాలు భారీ స్థాయిలో ధర్నా నిర్వహిస్తే దేశంలోని 15 పార్టీలు మద్దతిచ్చాయి కానీ, బీజేపీ, బీఆర్ఎస్ గైర్హాజరయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో బీసీ బహిరంగ సభలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ ప్రకటించడం హాస్యాస్పదం. బిల్లు ఆమోదం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంటే ఢిల్లీలో కాకుండా రాష్ట్రంలో నిరసనలు చేపట్టడం విడ్డూరం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు మద్దతిచ్చి గతంలో చేసిన తప్పిదాలకు బీఆర్ఎస్ ప్రాయశ్చితం చేసుకోవాలి.
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల వద్దకు తీసుకెళ్లి, వాటిలో ఏమైనా లోటుపాట్లుంటే ఎలాంటి భేషజాలకు పోకుండా జనహిత పాదయాత్ర ద్వారా సమీక్షించుకుని మరింత సుపరిపాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. రెండు దఫాలుగా చేపట్టనున్న ఈ పాదయాత్రకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్‌తో పాటు పార్టీ రాష్ట్ర అగ్రనేతలందరూ ఉత్సాహంగా తరలి వచ్చారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ చేపడుతున్న ‘జై బాపు, జై సంవిధాన్, జై బీమ్’ కార్యమ్రాలు ప్రజలకు చేరువయ్యేందుకు కూడా ‘జనహిత పాదయాత్ర’ దోహపడతుంది. ఇందులో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో శ్రమదానం నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది. డా.అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు తీసుకొచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా కాంగ్రెస్ ‘జనహిత పాదయాత్ర’ను వినియోగించుకుంటుంది. ప్రజల హితం కోసం చేపట్టిన ‘జనహిత’ పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న స్పందనతో మరింత ఉత్సాహంగా ప్రజా సంక్షేమాలు చేపట్టే అవకాశం కాంగ్రెస్‌కు దక్కింది.