Nancharaiah merugumala senior journalist:
‘ ఫస్ట్ పుట్ ద పేపర్స్ ఆన్ మై టేబుల్ ‘…2007లో కలిసినప్పుడు రామోజీ గారు అన్న మాటలివి
‘ఈనాడు’ సంస్థల్లో నేనెప్పుడూ రెగ్యులర్ ఉద్యోగిని కాదు, వారి పేరోల్స్ లో ఎన్నడూ లేను. ఇప్పుడు బతికి ఉన్నదో లేదో చెప్పడానికి వీలులేని తెలుగు డైలీ ‘వార్త’లో ఏ నెల జీతం ఏ తేదీన వస్తుందో తెలియని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నాకు– 2003లో ఆగస్టులో ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్)లో ‘విజిటింగ్ ఫ్యాకల్టీ’ పేరుతో పాఠాలు చెప్పే అవకాశం ఇచ్చారు ఇప్పటి ఏపీ ఈనాడు ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు గారు. నేను బెజవాడ ‘ఉదయం’ పత్రికలో పనిచేస్తున్నప్పుడు –అక్కడి ఈనాడు ఉద్యోగి, సోషలిస్ట్ దిగ్గజం డా.రాంమనోహర్ లోహియా జీ ఆలోచనల అభిమాని బీసీ నారాయణరావు గారు ఆ రోజుల్లోనే నన్ను ఈనాడులో ఎలా చేర్పించాలా? అనే ఐడియాతో ఉండేవారు. చెరుకూరి రామోజీరావు గారు గుడివాడ కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లో కామ్రేడ్ ‘ప్లీడర్’ నాగభూషణం గారి ఇంటి పక్కన ఒక గదిలో అద్దెకుండేవారట. నాగభూషణం గారు గుడివాడ పట్టణ కమ్యూనిస్టు పార్టీలో మా నాన్న ఎం.ఆర్. నాగేశ్వరరావు కలీగ్. నాగభూషణం గారి పెద్దబ్బాయి రామ్మోహనరావు గారు మా నాన్నకు బాగా ఇష్టమైన వ్యక్తి. తర్వాత రామ్మోహనరావు (వైఆరెమ్) గారు ఈనాడులో చేరి సర్క్యులేషన్ విభాగంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. వైఆరెమ్ గారు కూడా నన్ను ఈనాడులో చేర్చించి జీతం ఎంతైనాగాని ఫస్టునే దాన్ని అందుకునేలా చేసి ఆదుకోవాలనే ఆలోచన తో ఉండేవారు. ప్రగతిశీల కమ్మ కుటుంబాల్లో పుట్టిన ఈ ఇద్దరు శ్రేయోభిలాషుల చొరవతో 2003 సెప్టెంబర్ ఒకటి నుంచి ఈజేఎస్ లో వర్తమాన వ్యవహారాలు (కరెంట్ అఫైర్స్) అక్కడి జర్నలిజం విద్యార్ధులకు బోధించే అవకాశం నాకు వచ్చింది. నాలుగు నెలల తర్వాత 2004 జనవరి ఒకటిన ప్రిన్సిపల్ ఎమెనార్ గారు ఈజేఎస్ సహచర ఉద్యోగులతోపాటు నన్ను కూడా ఈజేఎస్ కు 50 మీటర్ల దూరంలో ఉన్న ‘చైర్మన్’గారి ఆఫీసుకు తీసుకెళ్లారు. అప్పుడు రామోజీ గారికి న్యూ ఇయర్ గ్రీటింక్స్ చెప్పి కరచాలనం చేయడం అదే మొదటిసారి. అలా నేను ఈజేఎస్ లో 2007 అక్టోబర్ 16 వరకూ కొనసాగాను. చెప్పిన పాఠాలకు, దిద్దిన అసైన్‌మెంట్లకు లెక్కగట్టి నాకు ఇచ్చే పారితోషికం సంతృప్తికర స్థాయిలో ఉండేది కాదు. దాంతో నాకు అదనపు ఆదాయం వచ్చేలా చూడడానికి నాగేశ్వరరావు గారు ఒక కొత్త ప్రాజెక్టు పని చేసే అవకాశం ఇప్పించారు.
‘ పుట్ ద పేపర్స్ ఆన్ మై టేబుల్’
2007 ఆరంభంలో ఈనాడులో హైదరాబాద్ నగర ఎడిషన్ లో ప్రత్యేక కథనాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టు పని కోసం కొత్త భవనం 9వ అంతస్తులోని రామోజీరావుగారి దగ్గరకు నన్ను ఎమెనార్ గారు తీసుకెళ్లారు. ‘నాంచారయ్య గారిది మీ ఊరేనండి,’ అంటూ ఈజేఎస్ ప్రిన్సిపల్ గా ఉన్న నాగేశ్వరరావు పరిచయం చేశారు. ‘మీది ఏ ఊరు? గుడివాడ దగ్గర ఏ గ్రామం?’ అని అగడగ్గానే, ‘ గుడివాడ టౌనేనండి. దగ్గరలోని అంగలూరు నుంచి మా తాత, నాయనమ్మ వచ్చి ఈ పట్టణంలో స్థిరపడ్డారు,’ అని రామోజీ గారికి చెప్పాను. ఈ ‘కొత్త ప్రాజెక్టు’ హైదరాబాద్ సిటీకి సంబంధించిన వ్యవహారం కావడంతో, ‘ నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్లయింది?’ అని ఆయన అనగానే పన్నెండేళ్లయిందని చెప్పాను. ఉత్తరాది నగరాల నుంచి వచ్చే ఇంగ్లిష్ దినపత్రికల్లో ఎలాంటి వార్తలు గుర్తుపట్టి వాటిని మార్క్ చేసి పెట్టాలో నాకు రామోజీ వివరించారు. తర్వాత వారం రోజులకు న్యూఢిల్లీ నుంచి వచ్చే టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్ పత్రికలు దాదాపు 20 కాపీలను పట్టుకుని ఆయన చాంబర్‌కు వెళ్లాను. ఎదురుగా కూర్చోమనగానే ఈ ఆంగ్ల పత్రికల ప్రతులను నా ఒళ్లో పెట్టుకుని కుర్చీలో కూర్చున్నాను. వాటిని అక్కడి టేబుల్ పై పెట్టడానికి భయపడి ఇబ్బండిపడుతూనే వాటిని ఒడిలో మోస్తూనే కూర్చున్నాను. ఇది గమనించి, వెంటనే, ‘ పుట్ ద పేపర్స్ ఆన్ మై టేబుల్,’ అనగానే నేనా పనిచేశాను. నేను మార్క్ చేసిన కథనాలను చూసి ‘ఇలాంటివి కాదు,’ అంటూ ఆయన లేని నా పక్కనున్న కుర్చీలో వచ్చి కూర్చుని ఒక ప్లాంక్ పై ఆ పేపర్లను పెట్టుకుని తెలుగులో అనుసరించడానికి ఉపయోగపడే వార్తలు, కథనాలను పెద్ద పెన్నుతో మార్క్ చేసి ఎలా చేయాలో చూపించారు. కొత్తగా రాబోతున్న ‘సాక్షి’లో చేరడానికి అప్పటికి ఆరు నెలలకు నేను– ఈజేఎస్ లో ‘ఉద్యోగం కాని ఉద్యోగం’ మానేశాను. నేను కొద్దిగా మొదలెట్టిన ‘ప్రాజెక్టు’ పని ఓ కొలిక్కి రాకుండానే రామోజీ ఫిల్మ్ సిటీలో నాలుగేళ్లుగా సాగిన నా వినూత్న కరియర్ కు ముగింపు పలికాను. ఈజేఎస్ లో నేను ‘పర్మనెంటు ఉద్యోగిని’ కాదు కాబట్టి రామోజీ రావు గారిని అప్పుడు కలవాల్సిన అవసరం లేదనిపించింది.
రామోజీని మొదట చూసింది తెల్ల ప్రీమియర్ నిసాన్ 118 ఎన్.ఈ కారులో!
2000 సంవత్సరం మొదట్లో అనుకుంటా. ఒక రోజు జూబిలీహిల్స్ జర్నలిస్టు కాలనీలో నివసించే సీనియర్ జర్నలిస్టు, నా ఆత్మీయ మిత్రుడు పాశం యాదగిరి గారి ఇంటికి వెళ్లాను, 127 నంబర్ సిటీ బస్సు దిగి నడుస్తుండగా యాదగిరి గారి ఇంటి ముందు ఉన్న ప్రఖ్యాత సినీ దర్శకుడు వీరమాచనేని ‘విక్టరీ’ మధుసూదనరావు గారి వీధిలోకి వెళుతున్న రామోజీ గారిని మొదటిసారి బయట చూశాను. అప్పుడు ఆయన తెల్లరంగు ప్రీమియర్ నిసాన్ 118 ఎన్. ఈ మోడల్ కారులో వచ్చి కిందికి దిగారు. అంతకు ముందు ఆయన పాత మోడల్ అంబాసిడర్ మార్క్ టూ కారు వాడినట్టు గుర్తు. (మా గుడివాడ ప్రాంతం వారికి కార్లు, లారీల మోడల్సుపై అప్పట్లో కాస్త ఆసక్తి ఎక్కువ.) వీ. మధుసూదనరావు గారి భార్య, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ ప్రజానాట్యమండలిలో పార్టీ ఆవిర్భావం తర్వాత క్రియాశీల పాత్ర పోషించిన కామ్రేడ్ సరోజనమ్మ గారు ఆరోజే కన్నుమూశారని, అందుకే పరామర్శకు రామోజీ వచ్చారని యాదగిరి గారు ఆ తర్వాత చెప్పారు. రామోజీరావు 1990ల మధ్యలోఅనాజ్ పూర్ గ్రామ పరిధిలోని ఫిల్మ్ సిటీలోని తన హోటల్ లోకి నివాసం మార్చక ముందు హైదరాబాద్ నగరంలో బేగంపేట చీకోటి గార్డెన్స్‌లోని సొంతింట్లో ఉండేవారని 1997 నాటికే తెలుసు. అయితే, నా పాత కలీగ్, తెలుగు కవి త్రిపురనేని శ్రీనివాస్ కన్నుమూసిన మరుసటి రోజు అతని అపార్టుమెంటులో సంతాప కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ ఇల్లు వెతుకుతూ చీకోటి గార్డెన్స్ లో ఓ పెద్ద ఇంటి ముందు నుంచి పోతుండగా దానిపై ‘ రమాదేవి–రామోజీ రావు’ అనే అక్షరాలు కనిపించాయి. ఇదేనా సిటీలో ‘తెలుగు మీడియా ముగల్’ 20 ఏళ్లకు పైగా నివసించిన ఇల్లు? అనుకున్నాను.