దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:
‘మీరు ముఖ్యమంత్రి కావాలి సార్’ ఎంతో ఉత్సుకతో తన మనసు వెల్లడించిన ఓ సీనియర్ సబ్‌ఎడిటర్‌కి, తడుముకోకుండా బదులిచ్చారాయన. ‘ఏమయా, నేనిపుడు ఓ ముఖ్యమంత్రికన్నా తక్కువటయ్య?’ అని మనసారా నవ్వుతూ పలకడంతో ‘ఈనాడు’ ఎడిటోరియల్ నెలవారీ సమీక్ష సమావేశంలో నవ్వులు విరిసాయి. నిజమే, పలువురు ముఖ్యమంత్రులు గద్దెనెక్కడం, దిగడంలో అప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర పోషించిన మీడియా మొగల్ రామోజీరావు. పొద్దుపొడుపుకు ముందే వాకిట వచ్చి వాలే… ఈనాడుతో తెలుగునాట ఒక సమాచార విప్లవం తీసుకువచ్చి, అనేకానేక ప్రయోగాలు చేసి, విలువైన ప్రమాణాలు సృష్టించి, వీలయినమేర విలువల్ని పాటించి… భారతదేశపు మీడియా ప్రపంచంలోనే తనదైన ఓ చెరగని చరిత్ర రాసుకున్న మహానుభావుడు. దినపత్రికలు, వార`పక్ష`మాస పత్రికలు, బహు భాషా టీవీ చానళ్లు, వెబ్‌సైట్లు ….. ఇలా ఎన్నింటినో ప్రారంభించి, సమర్థంగా నడిపి, సమాచార వెల్లువ ద్వారా సమాజాన్ని ఉన్నతీకరించిన పద్మవిభూషణుడు. నిరంతర నవ్వచింతనాపరుడు. అనుకూల సందర్భాలను ఒడుపుగా వాడుకుంటూ, ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ… స్వయంకృషితో మహావృక్షమై ఎదిగిన శ్రమజీవి! ఆ చెట్టు నీడన ప్రత్యక్షంగానే కొన్ని వేల కుటుంబాలు కడుపులో చల్ల కదలకుండా భద్రజీవనయానం చేశాయి, చేస్తున్నాయి. ఆయన ‘పట్టిందల్లా బంగారమే’ అంటారు కొంతమంది. దాని వెనుక ఎంత ఆలోచన, వ్యూహం, కృషి, పెట్టుబడి, పట్టుదల ఉంటాయి అని ఆలోచించే వారు తక్కువ. అంతా కేవలం కలిసివచ్చిన అదృష్టమేమో అనుకుంటారు కొందరు, కానీ దురదృష్టకర పరిస్థితుల్ని కూడా పోరాడి సానుకూలంగా మలచుకోవడం రామోజీరావు రక్తంలోనే ఉంది. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకే సాగేవారాయన. అది స్వయంగా ఆయనే అన్నారో, లేక ఆధునిక సోషల్‌మీడియా యుగంలో ‘మారీచ సృష్టో’ తెలియదు కానీ…. జీవితపు చరమాంకంలో ఎదురైన కష్టాల కడలి ఈదుతూ ఓ నిస్సహాయ స్వరంతో ‘ఏమిటో…? ఇదివరకెప్పుడూ ఇలా లేదు, ఇప్పుడు చూస్తున్నా…. ఇది జగన్నాథమాయో, జగన్మాయో?’ అన్నారని ఆ వీడియో క్లిప్ పలికింది. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడమే ఆయనకు తెలిసిన ఏకైక విద్య!
‘పాశుపతాస్త్రమట… పాచి`పతనాస్త్రం చేద్దాం ఆగండి’ అని స్పందించారు, ఓ పోటీ పత్రిక విపరీత ప్రచారాలకు స్పందిస్తూ! ‘మనకు పోటీగా పత్రిక పెట్టాలనే ధైర్యం మరొకరికి పుట్టకుండా చేద్దాం’ అని కూడా ఆయనన్నారు. కాలం మహాగడుసుది కదా! ఆయన ఎంతలా వద్దనుకున్నా అలాంటి ఒక సందర్భం వచ్చి పడింది. ఒకే రోజు 22 ఎడిషన్లతో, 11 లక్షల ప్రింట్ ఆర్డర్‌తో, మీడియా ప్రపంచంలోనే రికార్డు సృష్టిస్తూ తెలుగుజనం సాక్షిగా పుట్టిందో పోటీ పత్రిక. అయినా, ఆ పోటీని తట్టుకొని ‘ఈనాడు’ స్థిరంగా, ఉన్నతంగా నిలబడటం అన్నది, అది రామోజీరావు మానసపుత్రిక అవటం వల్లే సాధ్యమైంది. మరో పత్రికైనా, ఇంకో అధినేత అయినా నిలిచేది కాదు.
సమాచార వైతాళికుడు
సూర్యోదయానికి ముందే చేతిలో పేపర్ ఉండాలి, ప్రపంచ విషయాలు మెదడులోకి ఎక్కాలి అన్న జిజ్ఞాసని తెలుగువారికి ఎక్కించిన ఘనత రామోజీరావుది. ఊరు వదిలి, పక్కూరికి హైస్కూల్ చదువుల కోసం పోతున్న రోజులవి. అది 1975 ప్రాంతం కావడంతో అప్పుడప్పుడే మొదలైన ప్రచార సరళిలో భాగంగా, గోడల మీద రెండే రాతలు కనిపించేవి. ఒకటి దురద, తామర తొలగించే ‘జాలిమిలోషన్’, మరొకటి తాజా వార్తల ‘ఈనాడు’ దినపత్రిక. తర్వాతి కాలంలో నేను ‘ఈనాడు’లో చేరాక, హైస్కూల్ మిత్రులు కొందరు పాత, గోడ రాతల రోజుల్ని గుర్తు చేసేది. ఒకటి గజ్టి, దురద తొలగించేది, మరొకటి (విషయాల) గజ్జి, (వార్తల) దురద అంటించేది’ అని జోకులేశేవారు. నిజంగా, తెలుగు సమాజంలో జ్ఞాన జిజ్ఞాస, విషయాలపై అవగాహన, రాజకీయ పరిజ్ఞానం పెంపొందించడంలో ‘ఈనాడు’ పోషించిన పాత్ర అపారమైంది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఊహకు అందని అంశాల్ని జనం ముంగిట్లోకి తెచ్చి తెలుగు జాతిని తట్టిలేపిన ఘనత రామోజీరావుకు దక్కుతుంది. పత్రికా రంగంలో ఈనాడు ఎన్ని ప్రయోగాలు చేసిందో, టీవీ ప్రసారాల్లో ఆ మాధ్యమాన్ని ఎన్నెన్ని కొత్తపుంతలు తొక్కించిందో, జర్నలిజాన్ని పలు పార్శ్వాల్లో వృద్ది చేసి ఎంత పదునుతేలేట్టు చేసిందో…. లెక్కే లేదు. రంగుల హెడ్డింగులు, రంగుల ఫోటోలు, జిల్లా టాబ్లాయిడ్లు, పుల్లవుట్, ప్రత్యేక పేజీలు, ప్రింటింగ్‌లో ఆధునిక టెక్నాలజీ…. ఏక కాలంలో పలు ప్రాంతాల నుంచి పబ్లిష్‌చేసేలా మల్టిపుల్ ఎడిషన్లు… ఇలా ప్రయోగాలకు ఈనాడు పుట్టిల్లయింది. పొద్దుపొడవక ముందు అరచేతిలో ప్రపంచాన్ని పెట్టే పేపరు, రాత్రి 9 గంటలయిందంటే, విలక్షణమైన సంగీత ధ్వనితో దినమంతటి పరిణామాలను అరగంటకు కుదింటి ఇచ్చే ‘ఈ టీవీ వార్తలు’ ఎరుగని తెలుగువారుండరు అంటే, అతిశయోక్తి కాదు.
రాజగురువు కూడా…
అది 1995. ఆగస్టు సంక్షోభం ముదిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతోంది. ప్రజలు పట్టం కట్టిన ఎన్టీరామారావు నుంచి అధికారం ఆయన అల్లుడు, మంత్రివర్గ సహచరుడైన చంద్రబాబునాయుడుకు బదిలీ అవుతోంది. లక్ష్మీపార్వతి జోక్యాలపర్వం, ఎమ్మెల్యేల తిరుగుబాటు, వైస్రాయ్ క్యాంప్, గవర్నర్ ముందు పరేడ్…. ఎపిసోడ్ అంతా, అందరికీ తెలిసిందే! ఆ సాయంత్రం మేమంతా రిపోర్టింగ్ డెస్క్ దగ్గర కూర్చొని సీరియస్‌గా వార్తలు రాసుకుంటున్నాం. సోమాజీగూడలోని ఈనాడు బిల్డింగ్‌లో తన 5వ ఫ్లోర్‌కు ఎక్కేప్పుడు, దిగేప్పుడు పాత`కొత్త బ్లాక్‌ల మధ్య తను మారడానికి, 2వ ఫ్లోర్‌లో ఉండే మా రిపోర్టింగ్ ఏరియా మీదుగానే రామోజీరావు నడిచి వెళ్లేది. ఆ రోజు అక్కడ ఆగి, ‘….. ఏమయా, ఈ గవర్నరేంటి? వెంటనే నిర్ణయం ప్రకటించక ఇంకా తాత్సారం చేస్తున్నాడు!’’ అంటూ తన అసహనాన్ని ప్రదర్శించారు. నిజానికి, సోషలిస్ట్ నేపథ్యం ఉన్న నాటి గవర్నర్ క్రిష్ణకాంత్, తదుపరి నిర్ణయం ఎలా ఉండాలనే విషయంలో రాజ్యాంగ`న్యాయ కోవిదులతో సలహా, సంప్రదింపులు చేస్తున్నారు. దానికి కొంత ఆలస్యమైంది. ఆ జాప్యం మరి ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో! సందేహం. ఏ ఇబ్బందీ లేకుండా అధికార మార్పిడి సజావుగా, సత్వరం జరిగిపోవాలని, అనాయాసంగా బాబు ముఖ్యమంత్రిగా ప్రతిష్టితుడు కావాలని రామోజీ కోరికగా ఉండింది. అంతకాలం సంపూర్ణ మద్దతుతో మోసిన ఎన్టీయార్‌ను అమాంతం వదిలేసి, రామోజీ ఉన్నపలంగా బాబు పక్షం వహించడం సన్నిహితుల్లోనూ కొందరికి నచ్చలేదు. కానీ, అదలా జరిగిపోయింది. బాబుతో ఆ బంధం, సాన్నిహిత్యం ఆఖరు ఊపిరివరకు అలాగే కొనసాగింది. బాబు మొదటి దఫా ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, బాబు`రామోజీలకు తరచూ భేటీలు జరిగేవి. సలహా`సంప్రదింపులు సాగేవి. ఈనాడు సమావేశాల్లో ముఖ్యమంత్రి పనితీరు, రాష్ట్ర ప్రభుత్వం`పాలన ప్రస్తావనకు వచ్చినపుడు బాబు పట్ల ఎంతో వాత్సల్యంతో రామోజీ మాట్లాడేది. ‘ఒక్కడు ఎంతకని చేస్తాడయ్య, అటు అధికారులు అలా, ఇటు మంత్రులు ఇలా…. సహకరించకుండా ఎందరు ఎలా ఉన్నా బాబు ఎంతో కష్టపడుతున్నాడు’ అని, ఒక నిర్హేతుకమైన దయ, జాలి, సానుభూతి బాబు పట్ల చూపించేది. ఆ ఏకపక్ష వైఖరే, ఆయనలో వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల వ్యతిరేకతను, ఆయనపై వైఎస్.జగన్మోహన్‌రెడ్డికి వైరాన్ని పెంచాయేమో అనిపిస్తుంది. పుట్టిన తొమ్మిది మాసాల్లోనే, ఎన్నికల్లో గొప్ప విజయం సాధించి, 1983లో ప్రభుత్వం నెలకొల్పిన రికార్డు ఘనతంతా తెలుగుదేశం`ఎన్టీఆర్ ఖాతాలో వేస్తారు కొందరు పండితులు. కానీ, నేనంటాను. అప్పుడే పుట్టిన పార్టీగా తెలుగుదేశం ప్రతిభ, రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన సినీ ప్రముఖుడు ఎన్టీరామారావు ప్రతిష్ట మాత్రమే కాకుండా ఇంకో రెండు కీలకాంశాలు అంతటి విజయానికి కారణమయ్యాయని. ఒకటి, నాటి కాంగ్రెస్ వ్యవహారశైలి పట్ల ప్రజల్లో ఏర్పడ్డ ఏహ్యభావం, జుగుప్స, ప్రత్యామ్నాయాల వెతుకులాట. ఇంగ్లీషులో ” Revolution is not a product itself, it’s a byproduct of revolutionary conditions ” అని పెద్దలన్నట్టుగా పరిస్థితుల నుంచి పుట్టిన విజయమది. రెండో బలమైన కారణం, ఆనాడు ‘ఈనాడు`అది పోషించిన పాత్ర’ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ప్రత్యర్థులపై వ్యతిరేక ప్రచారం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం …. ఇలా ఈనాడు పత్రిక, దాని అనుబంధ వ్యవస్థలు చేయని ఊడిగం లేదు.
ఏ పార్టీకి చెందని ఒక తటస్థ దినపత్రికలో ‘కాంగ్రెస్‌కు ఓటు దేశానికి చేటు’ అని నినాదాలు పత్రిక పేజీల శీర్షభాగంలో రాయటం నిజంగా ఒక సాహసమే! కమ్యూనిస్టు భావజాలపు నేపథ్యం ఉన్నవాడైనా ఆయన అన్ని పార్టీల పట్ల సాధారాణ భావనతోనే ఉండేవారు. కాంగ్రెస్ పట్ల ఎందుకో కొంత సహజ వ్యతిరేకత ఉండేది. కానీ, పత్రికను నిష్పక్షపాతంగా నడపాలని చెప్పేవారు. అవసర సమయాల్లో నచ్చిన పార్టీకి కొంత సానుకూలంగా, నచ్చని పార్టీకి కొంత వ్యతిరేకంగా ‘కంటెంట్’ ప్రచురించినా, మిగతా మోజారిటీ కంటెంట్ మాత్రం ప్రొఫెషనల్‌గా ఉండాలనటంలో, ఉండేలా చూసుకోవడంలో రామోజీ శ్రద్దవహించేవారు. ఈ క్యాలికులేటెడ్ వైఖరే పత్రికకు లైఫ్‌లైన్‌గా ఉంటూ వస్తోంది. తెలుగునాట సుదీర్ఘకాలం పాటు అత్యధిక సర్క్యులేషన్‌గల పత్రికగా కొనసాగడానికి ఇదే ముఖ్య కారణం. కంటెంట్‌లో ప్రొఫెషనలిజం, రిపోర్టింగ్ నెట్‌వర్క్‌లో సమగ్రత, పత్రికలో నాణ్యత, సర్క్యులేషన్, పంపిణి, వాణిజ్యప్రకటనలు…. ఇలా అన్ని వ్యవహారాల్లో నిర్దిష్ట ప్రమాణాలు, ప్రొటోకాల్స్ ఏర్పాటు చేయడం ఆయన ప్రత్యేకత!
ఎన్నదగిన విలువలు
పెద్ద ఎమ్‌డీగా పేరు పడ్డ, రామోజీరావు బంధువు కమ్ మితృడు రామ్మోహన్‌రావును ఆయన ఒకరోజు సున్నితంగా తగులుకున్నారు. ‘ఏం రామ్మోహనా! యుద్దానికి నువ్ కుంటివాళ్లను, గుడ్డివాళ్లను పంపుతావటయ్యా?’ అన్నది ఆ చిరు మందలింపు. ఎవరో ఒక సబ్`ఎడిటర్ ఎన్ని సమీక్షా సమావేశాల్లో హెచ్చరించినా, పనితీరు మెరుగుపరచుకోకుంటే, ఒక రోజు స్వయంగా రామోజీరావే అడిగారు. ‘ఎవరయ్యా ఈయన? ఎవరు తెచ్చారు, డెస్క్‌లోకి ఎలా వచ్చాడు? ఆ…’ అని గద్దించినట్టు అడగడంతో విధిలేక డెస్క్ ఇంచార్జీ వెల్లడించారు.తగిన డిగ్రీలు, ఆసక్తి, అవసరం (ఉద్యోగార్థికి) ఉంటే పెద్ద ఎమ్డీ గారు తెచ్చిపెట్టారని. ‘బంధుత్వమో, కులబంధమో ఉంటే…ఏ స్టోర్స్‌లోనో, ఫ్రంట్ ఆఫీస్‌లోనో పెట్టుకోవాలి కానీ, ఎడిటోరియల్‌లో పెడతారా? ఇది యుద్దమయ్యా, యుద్ధం! యుద్దానికెవడైనా గుడ్డోళ్లని, కుంటోళ్లని కూడేసుకొని పోతారా?’ అన్నది రామ్మోహన్‌రావుని ఆయన అడిగిన ప్రశ్న! మతం, కులం, ఆధ్యాత్మికం వంటి అంశాలు వ్యక్తిగతం అని రామోజీరావు బలంగా నమ్మటమే కాక చాలా వరకు ఆచరించారు. ఎక్కడో ఆంతరంగికంగా వీసమెత్తు మొగ్గేవారేమో కానీ, వృత్తి విషయంలో మాత్రం వాటన్నిటికీ అతీతంగా ప్రతిభ`పనితీరే ప్రామాణికంగా ఉండాలని చెప్పేవారు, అలాగే వ్యవహరించేవారు. అందువల్లే, ఒక సలీం డెస్క్‌ను హెడ్ చేయడం, ఒక కరీం రిపోర్టింగ్ టీమ్‌ని లీడ్ చేయడం, శర్మ`శాస్త్రి ద్వయం సెంట్రల్ డెస్క్ నడపడం వంటివి సాధ్యమయాయి. ఆశ్చర్యపోతూ కొందరు నన్నడిగేవారు… ‘సిఫారసులు లేకుండా, గాడ్‌ఫాదర్ లేకుండా…. ఓ తెలంగాణ వాడివి, అదీ రెడ్డివి కమ్మవారి పేపర్‌లో పొలిటికల్ బ్యూరోకి, ఢిల్లీ బ్యూరోకి చీఫ్‌వి ఎలా అయ్యావు?’ అని. దానికి నేను చెప్పేది, ‘అది నా గొప్పతనం కాదు, రామోజీరావు గొప్పదనం’ అని. వృత్తి విషయంలోనూ ఆయన అంతే నిక్కచ్చిగా ఉండేవారు. ఎం,వి. భాస్కరరావు, దినేష్‌రెడ్డి, డాక్టర్ సోమరాజు, త్రిపురానవెంకటరత్నం, మైహోం రామేశ్వరరావ్… వంటి ఎందరెందరో తగాదాలు తీసుకొని ఆఫీస్‌కో, ఆయన సమక్షానికో వెళ్లినా, సదరు వ్యవహారాలను ఫక్తు ప్రొఫెషనల్‌గా డీల్ చేసేవారు. వాస్తవం రిపోర్టు చేస్తే, ఏ స్థాయిలోనైనా రక్షణ కల్పించేవారు. బయట సమాచారం ఇచ్చిన సోర్స్ వెల్లడిరచాల్సిన అవసరం లేదని, లోపల ఎవరు ఏ వార్త రాశారో ప్రభావితులయ్యేవారికి తెలియాల్సిన అవసరం లేదని పేద్ద రక్షణ గోడగా ఆయనే నిలబడేవారు. ‘మేం చూశాం/తెలుసుకున్నాం. నమ్మాం, రాశాం. అంతే, ఇది మా సమిష్టి కృషి, రాసిన రిపోర్టరెవరు అన్నది చెప్పం. మిగతా మీరేం చేసుకుంటారో చేసుకోండి’ అని కరాఖండిగా చెప్పిన సందర్భాలెన్నో! ఉద్యోగులకు జీతభత్యాల విషయంలోనూ ఈనాడుది నిక్కచ్చితనమే! నెలాఖరంటే నెలాఖరు పనిదినమే, ఆదివారాలో, సెలవుదినాలో, బ్యాంకు మూతపడటమో వస్తే నెలాఖరు ముందరి తేదీలకు మారదే తప్ప నెల మారనిచ్చేవారు కాదు. బోనస్, ఎల్టీయే, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఎఫ్, గ్రాట్యుటీ వంటివన్నీ, అందరికీ సక్రమంగా అందించడం వంటి పద్దతుల్ని ఆయన గొప్పగా నెలకొల్పారు. యూనివర్సిటీల నుంచి జర్నలిజం డిగ్రీలు తీసుకొని వచ్చే వారు, తెలుగు టైపింగ్‌కి, ఇక్కడి వృత్తి అవసరాలకు అలవాటుపడేందుకు సమయం పట్టేది. అదొక అనవసర ప్రయాస అని గ్రహించి 90లలో జర్నలిజం స్కూల్ ప్రారంభించి, సంస్థకు అవసరమైన మానవవనరుల వృద్ది చేసేవారు.
‘వ్యక్తులు ముఖ్యం కాదయ్యా, వ్యక్తులు రావొచ్చు, పోవచ్చు, వాటితో నిమిత్తం లేకుండా పత్రిక నిరంతరం సాగేలా అన్నిటినీ వ్యవస్థీకృతం చేయాలి’ అనేవారు. పత్రికు అలా నడిపారు కాబట్టే అసెంబ్లీ, మండలి వంటి చట్టసభల్ని కూడా దైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగారు. ఈనాడును నిలిపారు. ఒకసారి సభలో జరిగిన వ్యవహారాలను రిపోర్టు చేస్తూ ‘పెద్దల సభలో గలభా’ అని రాసినందుకు అభిశంసన వరకూ వెళ్లినా న్యాయస్థానం రక్షణతో ఏ అవమానమూ ఎదుర్కోకుండా నిలిచారు. అన్ని పార్టీలకు చెందిన పెద్ద పెద్ద నాయకులతో సాన్నిహిత్యం, మంచి పరిచయం ఉన్నా…. ఏనాడు ఎటువంటి పదవులు, హోదాలు ఆశించలేదాయన. వ్యక్తిగత ప్రచారం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. చాలా కాలం వరకు ఆయన ఫోటోలు, వార్తలు పత్రికల్లో వచ్చేవి కాదు. తర్వాతి కాలంలో కొంచెం అనుమతించారు. ఒకసారి, పత్రికపై ప్రయివేటు వ్యక్తి (వట్టిపల్లి పార్థసారథి) వేసిన పరువునష్టం కేసులో, తాడేపల్లిగూడెం కోర్టులో ఆయన బోనెక్కాల్సివచ్చింది. అదీ జరిగింది. ఆ ఫోటో ఎలా ప్రచురించడం, అసలు ఫోటో వేయాలా? వద్దా? డెస్క్‌లో మీమాంస. పోనీ ఆయన్నే సలహా అడగాలంటే భయం. దైర్యం చేసి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఉన్న ఎమ్మెన్నార్‌తో అడిగించారు. లౌక్యంగా ‘సర్, ఫోటో పేజీవన్‌లో తీసుకోవాలా? లోపల వేసేయమంటారా?’ అనడిగితే, చమత్కారంగా ‘ఏమయా నేను పేజీవన్ స్థాయి కాదా?’ అన్న ఘటికుడు రామోజీరావు.
సారా వ్యతిరేకోద్యమం సామాజిక సేవ
తెలుగునాట సారా వ్యతిరేక ఉద్యమాన్ని, రామోజీరావు నేతృత్వంలో ‘ఈనాడు’ ముందుండి నడిపింది. కార్యక్రమ రచన నుంచి, వేదికల ఏర్పాటు, బ్యానర్లు కట్టడం, వక్తల్ని`ప్రేక్షకుల్ని సమీకరించడం, ఆయా వార్తల్ని ప్రముఖంగా ప్రచురించడం వరకు అన్నీ తానై చేసేది. నెల్లూరులో దూబగుంట రోశమ్మతో మొదలైన ఉద్యమం, ఈనాడు సర్వశక్తులడ్డి నిలవడంతో తీవ్రరూపం దాల్చింది. అది విజయవంతమై చివరకు రాష్ట్రంలో మద్యనిషేధం విధించే దాకా వెళ్లింది. ఈ విజయాన్ని తెలుగు సమాజం వేనోళ్ల పొగిడిరది. దీని వెనుక వ్యాపార, రాజకీయ ఉద్దేశ్యాలున్నాయని అంటారు, కోట్ల విజయభాస్కరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసమో, మద్యం వ్యాపారాలున్న మీడియా పారిశ్రామిక ప్రత్యర్థి మాగుంట సుబ్బిరామిరెడ్డిని ఆర్థికంగా దెబ్బతీయడానికో నడిపిన ఉద్యమం అనే విమర్శ ఏదో మూలనుంచి, చిన్న స్వరంతో వచ్చేది. అయినా రామోజీరావు లెక్కచేయలేదు. సమాజ హితంలో ఆయన తీసుక్ను నిర్ణయం, జరిపించిన మహోద్యమం కడకు తెలుగునాట సారా లేకుండా చేసింది. అక్కడిక్కడ దొంగ సారా, గుడుంబా తప్ప అధికారికంగా సారా తయారీ, సరఫరా, విక్రయాలకు మరొక్కరు తెగించని వాతావరణం నేడు నెలకొంది. సమాచార హక్కు పై అవగాహన, జ్ఞానం వ్యాప్తి విషయంలోనూ రామోజీ చొరవ తీసుకొని ‘ముందడుగు’ పేరిట ప్రత్యేక పేజీలు నడిపి ఉద్యమించారు. తెలుగు సమాజ వికాసం, భాషాభివృద్ది కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. కథ, నవలా సాహిత్యాన్ని పెంచి పోషించడానికి చతుర, విపుల మాసపత్రికల్ని నడుపడమే కాకుండా ప్రత్యేకంగా భాషాభివృద్ది కోసం ‘తెలుగువెలుగులు’ మాస పత్రికను నడిపారు. సినిమా సమాచారం కోసం ‘సితార’ వార పత్రికను నడిపి ఆ రంగంలో తొలి బాటలు పరిచారు. దేశ వెన్నెముక అయిన రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి, వ్యవసాయంలో సాయం చేసేందుకు అన్నదాత పత్రికను ప్రతిఫలాపేక్ష లేకుండా, ఒక వ్రతంలా నిర్వహించారు. రైతుల మేలు కోరి తానే డబ్బు ఖర్చు చేసి నిర్వహించినా, తర్వాతి కాలంలో అసాధారణ స్థాయిలో చందాదారులను పెంచి, జాగ్రత్తగా ఆర్థికస్వయంసమృద్ది పొందేలా చేశారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోరారాయన.
ఒకసారి రాష్ట్రంలో రాజకీయఖైదీలు జైళ్లలో సమ్మె చేస్తుంటే, వారి సమస్యలపై బాలగోపాల్, హరగోపాల్, కన్నభీరన్ వంటి వారితో మాట్లాడి, ఈనాడు సండే మేగజైన్‌కి కవర్‌స్టోరీ ఇచ్చాను. జస్టిస్ క్రిష్ణఅయ్యర్, జస్టిస్ భగవతి వంటి వారి తీర్పులనుటంకిస్తూ రాసిన వ్యాసం. అది ఆయనను ఎంతగా కదిలించిందంటే, తర్వాత ఏడాది, రెండేళ్లపాటు ఆయనని నేను కలిసిన దాదాపు ప్రతిసారీ అడిగేది, ‘ఏం దిలీప్, ఖైదీల సమస్యలు పరిష్కారం అయ్యాయా? ఎంతవరకు వచ్చింది!
ఆ ప్రయత్నం’అనేది. నేను 2005లో ఈనాడు వీడి, సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా చేరిన తర్వాత అదే సంవత్సరం డిసెంబరు 5న ఫిలిమ్‌సిటీలో ఆయన్ని కలిశాను. పదిహేను నిమిషాలు గడిపానేమో! ‘సర్, 17 సంవత్సరాలు నాకు గొప్ప అవకాశం కల్పించారు,….’ ఇంకా మాట్లాడుతున్న నన్ను మధ్యలోనే ఆపి, (మరింత పొగుడుతానని భయపడ్డట్టున్నారు) ‘‘చూడు దిలీప్ నేను అవకాశం కల్పించాను, నీవు సర్వీస్ చేశావు, ఇది రెసిప్రొకల్ అయ్యా, విష్ యూ ఆల్ ది బెస్ట్’ అన్నారు. గొప్ప మనిషి, మహా గొప్ప మనీషి.
రామోజీరావ్‌కు సెల్యూట్.
===========
–దిలీప్‌రెడ్డి,
సీనియర్ జర్నలిస్ట్.
Mail: dileepreddy.ic@gmail.com, Cell No: 9949099802