మునుగోడు టీఆర్ఎస్ సభ పై నీలినీడలు.. డైలామాలో అధిష్టానం!

మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ లో చిచ్చురేపింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడిస్తామని అసమ్మతి నేతలు హైకమాండ్ కి తేల్చి చెప్పారు. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం జిల్లా ఇంఛార్జ్ మంత్రి జగదీశ్వర్​రెడ్డి వారితో చర్చలు జరిపిన.. సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నెల 20న ప్రజాదీవెన పేరుతో భారీ సభ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న కారు పార్టీ.. అసమ్మతి నేతల వైఖరితో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఇక మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు ఉప ఎన్నిక  టికెట్ కన్ఫర్మ్ వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే  భారీ సభ నిర్వహించి సీఎం కేసిఆర్ ద్వారా అధికారికంగా ప్రకటించాలని నేతలు భావించారు. మంత్రి అధ్వర్యంలో సభా స్థలి కోసం  పరిశీలనకు వెళ్ళిన వెంటనే.. అసమ్మతి నేతలు సమావేశమై కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ హైకమాండ్ కి అల్టిమేటం జారీ చేశారు. అతనికి టికెట్ ఇస్తే ఓడిస్తామని కుండ బద్దలు కొట్టారు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థి విషయంలో ఎలా  స్పందిస్తుందాని సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు టీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో  టీఆర్ఎస్ యంత్రాంగం..అధికారం.. మంత్రాంగం.. ఉపయోగించి భారీ సభ పెట్టేందుకు ప్రయత్నించిన ఫలితం శూన్యమని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో కాషాయం జెండా ఎగిరి తీరుతుందని రఘునందన్ జోస్యం చెప్పారు.

ఇటు అసమ్మతి నేతల వైఖరితో అటు బీజేపీ నేతల మాటల దాడితో టీఆర్ఎస్ ఉక్కిరబిక్కిరి అవుతోంది. ఉప ఎన్నికలో గెలిచి.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కారు పార్టీకి సొంత నేతల నుంచే ముప్పు పొంచి ఉండడంతో డైలమాలో పడింది.