“వైశాఖ పూర్ణిమ”..

వైశాఖ బుద్ధ పూర్ణిమనే మహా వైశాఖ అంటారు. ఈరోజు మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజని పురాణాలు చెబుతున్నాయి. తద్వారా జనులందరూ మహావిష్ణువును ఆరాధిస్తారు. ఈరోజున దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని.. ఆధ్యాత్మిక సాధనలు చేసిన విశిష్టమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.
వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం సత్యనారాయణ వ్రతం , సంపత్ గౌరీ వ్రతం, దాన ధర్మాలు చేస్తారు. శక్తిని బట్టి కష్టకాలంలో ఉన్నవారికి సహాయం చేస్తే సరిపోతుంది. కుటుంబ ఆచారాలను బట్టి ఈరోజున వ్రతాలు నిర్వహిస్తారు.

సనాతనధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్రస్నానం ఆచరించకూడదు. వైశాఖ పౌర్ణమి రోజున కచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి. ఈ రోజు కరక్కాయను తీసుకెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానమాచరించడం వల్ల నరఘోష, నరదిష్టి తొలగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీకూర్మ జయంతి, అన్నమాచార్యుల జయంతి.. ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది.
వైశాఖ పౌర్ణమి రోజు సిద్దార్థుడు జన్మించడం.. అదే రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని శాస్త్రం చెబుతోంది.
ఆధ్యాత్మిక సాధకులకు, జ్ఞాన ప్రాప్తి పొందేవారికి, సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తోంది.

బోధి వృక్షపూజ..

బౌద్దులకు బోధివృక్ష పూజ ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది. బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతుంది. ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి, దీపాలు వెలిగించి పరిమళజలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది. రంగూన్, పెగు, మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా, నియమనిష్ఠలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు, దీపాలు, జెండాలు పట్టుకు వస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి.

అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి, చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే ‘వట సావిత్రి’ మొదలైన వ్రతాలు ఈ బౌద్ద పర్వం ఛాయవే అని అంటారు.

ప్రాముఖ్యత..

భారత దేశంలో బౌద్ధమతాన్ని స్కీకరించిన ప్రజలు తెల్లని దుస్తువులను ధరించి.. మాంసాహారం తినరు. ఈరోజున కేవలం ఖీర్ మాత్రమే తింటారు. బుద్దుడికి ఒక మహిళ ఒక గిన్నెలో పాలు మాత్రమే సమర్పించిందని చెబుతుంటారు. ఈరోజున బౌద్దులు చుట్టుపక్కల వర్గాల నుంచి పగోడాల వరకు రంగు రంగుల పల్లకిలలో ఉరేగింపులు నిర్వహిస్తారు. అలాగే బోధి చెట్టు మొదట్లో నీరు పోసి.. నైవేధ్యం సమర్పిస్తారు. అక్కడే ధ్యానం చేస్తారు. బుద్ద పూర్ణిమ సందర్భంగా బీహార్ లోని బోధ్ గయాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహా బోధి ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతుంటారు.

Optimized by Optimole