మద్దెల చెర్వు, జూలై 8: పత్రికా వర్గాల్లో నిబద్ధతతో, విలువలతో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి అకాల మరణం జర్నలిస్టు సమాజాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
దత్తురెడ్డి గారి స్వగ్రామమైన మద్దెల చెర్వులో ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి వెంకట్ రెడ్డి, దత్తురెడ్డి భార్య ప్రియాంకతోపాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. “దత్తురెడ్డి సేవలను మరువలేం. ఆయన కుటుంబానికి అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత” అని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.4 లక్షలు అందజేశారు. అంతేకాక, దత్తురెడ్డి గారి భార్య ప్రియాంకకు ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
“జర్నలిస్టులు ప్రజలకు వాస్తవాలు చేరవేస్తున్న సమకాలీన యోధులు. వారి సంక్షేమం, భద్రతకు మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో తపన పడుతుంది,” అని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విలేకరుల సంఘాలు మంత్రి చర్యను అభినందించాయి. దత్తురెడ్డి గారి సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.