ysrcp: వైసీపీలో ఏం జరుగుతోంది..?

ysrcp: వైసీపీలో ఏం జరుగుతోంది..?

APpolitics:

‘‘వైసీపీలో ఏం జరుగుతోంది?’’ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, రాజీనామ తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశారు. ముందు ముగ్గురు రాజీనామాల్లో అంత ప్రత్యేకత ఏమీ లేకపోయినా స్వయం ప్రకటిత జగన్ ఆత్మ అయిన విజయసాయిరెడ్డి రాజీనామ ప్రత్యేకమైనది. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసిన ఆయన, జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు, అది కూడా జగన్ లండన్ లో ఉన్న సమయంలో హ్యాండ్ ఇచ్చారు. ఇలా ముఖ్య నాయకులు బయటకు వెళ్లిపోవడం వల్ల వైఎస్సార్సీపీ బలహీన పడుతుందా?

కాకినాడ పోర్టు విషయంలో జరిగిన అక్రమాల కేసులో విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ‘‘తిమింగళం తెలివిగా వల నుంచి తప్పించుకోవడానికే రాజీనామా చేసింద’’ని క్షేత్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, కష్టకాలంలో విడిచిపోతున్నారని, ‘‘పదవులూ ఆస్తులూ మీకూ, కేసులు మాకా?’’ అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయినా సరే, విజయసాయి రెడ్డి విషయంలో నాయకుల నుంచి కార్యకర్తల వరకూ ఎవ్వరూ సానుభూతి ప్రకటించడం లేదు. మరోవైపు ఆయన రాజీనామా ప్రకటించిన తర్వాత ‘వద్దు’ ‘పోవద్దు’ అని సయోధ్య కుదిర్చేందుకు కూడా ప్రయత్నంచలేదు. దీని గురించి కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టేవాళ్లు లేకపోవడాన్ని చూస్తే, ఆ పార్టీలో ఉన్న గందరగోళ పరిస్థితికి అద్దం పడుతోంది.

ఎవరూ రాజీనామా చేసినా… పోతే పోనీ అన్నట్లుగానే వ్యవహారం ఉంది. వైస్సార్సీపీ ఏర్పడి దాదాపు 12 ఏళ్లు కావొస్తున్నా… ఆ పార్టీకి ఓటర్లు ఉన్నారు కానీ, సంస్థాగత నిర్మాణం సరిగా లేదు. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా అధినేత ఏకపక్ష నిర్ణయాలను మానుకోవడం లేదు. నాయకులు రాజీనామా చేసినప్పుడు సయోధ్య చేసే ప్రయాత్నాలు కూడా చేయకపోవడం దీనికి నిదర్శనం. వైఎస్. షర్మిలా మొదలుకొని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి జగన్ ఆప్తులు బయటకెళ్లడం వల్ల వైఎస్సార్సీపీ పనైపోయిందనుకోవడం అపోహా మాత్రమే. ఆప్తులు బయటకు వెళ్లడం వల్ల జగన్ నైతిక స్థైర్యం దెబ్బతింటుందేమోగానీ, పార్టీ దెబ్బతినే అవకాశం లేదు.

ప్రాంతీయ పార్టీలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న నాయకులే ముసలం సృష్టించే ప్రయత్నం చేస్తారు. 2019లో టీడీపీ ఓడగానే ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. వీరు కూడా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులుగా పేరుపొందినవారే! వీళ్లు పార్టీ విడివడం వల్ల టీడీపీకి కలిగిన నష్టం సున్నా! ఇప్పుడు జగన్ విదేశాల్లో ఉన్నప్పుడే సాయి రెడ్డి రాజీనామ చేసినట్టు, అప్పుడు చంద్రబాబు నాయుడి కుటుంబం విదేశాల్లో ఉన్నప్పుడే టీడీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడం యాదృచ్చికమా? బీజేపీ ప్లానా? అనే అనుమానాలు ఉన్నాయి.

ఆంధ్ర రాష్ట్రాల్లో కర్మ ఏంటంటే… అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీ కేసుల్లో చిక్కుకోవడం వల్ల బీజేపీ ప్రాంతీయ పార్టీల భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నాయి. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ భుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని కూల్చాలని ప్రయత్నించిన బీజేపీ, ఇప్పుడు టీడీపీ భుజం మీద తుపాకీ పెట్టి వైఎస్సార్పీని కూల్చే ప్రయత్నం చేస్తోందని చర్చించుకుంటున్నారు. కానీ, బీజేపీ, టీడీపీ కలిసి వైఎస్సార్సీపీని అంతం చేయడం కల్లగానే భావించాలి. ఎంతమంది ప్రముఖలు పోయినా వైఎస్సార్సీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే, మాయల పకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్టు… వైఎస్సార్సీపీ భవిష్యత్తు కాంగ్రెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఓటర్లంతా కాంగ్రెస్ ఓటర్లే. కాంగ్రెస్ పార్టీకి గతంలో బలంగా మద్దతిచ్చిన ఎస్సీ- మాల, ముస్లింలు, రెడ్డిలు, కాపులు, క్రిస్టియన్లు, బ్రాహ్మణులే… ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రధాన ఓటర్లుగా ఉన్నారు. వీళ్లు ఎప్పుడూ టీడీపీకి, దానితో కూటమికట్టే పార్టీలకు వ్యతిరేకంగానే ఉంటారు.

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి అకాల మరణం, తెలంగాణ ఉద్యమం కలిసి ఆంధ్రాలో కాంగ్రెస్ ని పాతాళంలోకి తొక్కాయి. 2014 నాటికి నోటాతో పోటిపడే స్థాయికి పరిస్థితి దిగజారింది. 2014లో నందిగామ ఎన్నికలో వైఎస్సార్సీపీకి 46.9 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ కి 1.3 శాతం ఓట్లు వచ్చాయి. అక్కడి నుంచి గెలిచిన టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు మరణించడంతో వెంటనే ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో వైఎస్సార్సీపీ ఓట్లు బదిలీ అయ్యి 19.5 శాతం ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. 2015లో తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికలో కూడా వైఎస్సార్సీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ ఓట్లన్ని కాంగ్రెస్ కి బదిలీ అయ్యాయి. 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీకి 44.6 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ కేవలం 2.8 శాతానికే పరిమితమయ్యింది. విభజన తర్వాత కాంగ్రెస్ బలం, బలగం అంతా కాంగ్రెస్ నుంచి వెళ్లి జగన్ పెట్టిన వైఎస్సార్సీపీకి బదిలీ అయ్యాయని చెప్పడానికి ఇవే నిదర్శనాలు.
గత పన్నెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటర్, వైసీపీ ఓటర్ ఒక్కరే! కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పెరిగినప్పుడు మాత్రమే జగన్ ఆందోళన చెందాలి గానీ, విజయసాయిరెడ్డి లాంటి నాయకులు వెళ్లిపోయినప్పుడు కాదు. షర్మిలా రాకతో కాంగ్రెస్ కి పునర్వైభవం వస్తుందని అంతా భావించారు. కానీ, ఆమె ఎంత ప్రయత్నించినా… వైఎస్సాఆర్ వారసురాలుగా గుర్తింపు పొందడం లేదు. భారత సంస్కృతి, దేశంలో వివిధ రాజకీయ పరిణామాలను అధ్యయనం చేస్తే రాజకీయ వారసత్వం ఆయా కుటుంబాల్లో కొడుకులకే దక్కుతోంది తప్ప, కూతుళ్లకు దక్కిన దాఖలాలు తక్కువ. కాబట్టి, జగన్ కి కాంగ్రెస్ నుంచి ఇప్పటికిప్పుడు ముంచుకొస్తున్న ప్రమాదం కూడా ఏమీ లేదు.

ప్రత్యేక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా రాజ్యంగేతర శక్తులుగా వ్యవహరించిన సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణ లాంటి వాళ్ల నుంచి వైఎస్సార్సీపీ అనేక గుణపాఠాలు నేర్చుకోవచ్చు. కార్పొరేట్ కల్చర్ తో దీర్ఘకాలిక రాజకీయాలు చేయలేమని ఇప్పటికైనా జగన్ గుర్తించాలి. ఆర్ధిక వనరులు సమకూర్చేవారు, లాబీయింగ్ చేసేవారు ఏ పార్టీకయినా అవసరమే. కానీ వాళ్లను తెర వెనుకకే పరిమితం చేయాలి తప్ప బడా లీడర్లుగా ప్రమోట్ చేయొద్దు. జిల్లాల పర్యవేక్షణ, క్రైసిస్ మేనేజ్మెంట్ అంతా ఫుల్ టైం రాజకీయ నాయకులతోనే సాగించాలి. అధ్యక్షుడు అందర్నీ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే భావన కలిగించడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతుంది.
ఏనాడు ప్రత్యేక్ష ఎన్నికల్లో గెలవని సాయి రెడ్డి వల్ల ఒక్క ఓటు కూడా రాదు. పైగా ఆయన వివాదాస్పద వ్యవహారాల శైలితో పార్టికి తీవ్ర నష్టం జరిగింది. ఆయన ఒక అవినీతిపరుడు అనేది మిడిల్ క్లాస్ ప్రజల్లో ఒక అభిప్రాయంగా ఉంది. ప్రజల్లో సానుకూల ఇమేజ్ తెచ్చుకోవాలని సాయిరెడ్డి ఏనాడూ ప్రయత్నించలేదు. సాయిరెడ్డితో పాటు కొడలి నానీ, అంబటి రాంబాబు, రోజా, జోగి రమేశ్ వంటి నాయకుల దిగజారుడు భాషతో పార్టీకి నష్టం జరిగింది. అజాత శత్రువుగా గుర్తింపు పొందిన అశోక్ గజపతిని వేధించిన తీరును కూడా ప్రజలు అసహ్యించుకున్నారు. ఆయనకు రాజకీయ పరిపక్వత లేదని చెప్పడానికి ఇవే నిదర్శనం.

సాయిరెడ్డి నిష్క్రమణ వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూలతను కొంత తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వైఎస్ఆర్సీపీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించేందుకు దీన్ని ఒక సదావకాశంగా చేసుకోవాలి. ఉత్తరాంధ్ర , గోదావరి జిల్లాల మీద నెల్లూరు, రాయల సీమ రెడ్లు పెత్తనం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీనిని చెరిపేసుకోవడానికి కూడా దీన్నొక అవకాశంగా చూడాలి. కార్పొరేట్ కంపెనీగా కాకుండా ఒక రాజకీయ పార్టీ గా వ్యవహారాలు సాగించాలని, ఈ ఉదాంతం నిరూపించింది. 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీని ఎంతమంది వీడిపోయినా అది టీ కప్పులో తుఫాన్ మాత్రమే. కాబట్టి, ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరైన రాజకీయ దృష్టి కోణంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగితే… పార్టీకి పునర్వైభవం తీసుకురావడం కష్టమేమీ కాదు.

– జంపాల ప్రవీణ్,
రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ