VasanthaPanchami:
ఈరోజు వసంత పంచమి. వసంత పంచమి అంటే… మన సంస్కృతిలో జ్ఞానానికి ప్రతీక అయిన శ్రీ సరస్వతీ మాతను పూజించే పండుగ. అంటే, మన విద్యావ్యవస్థకు ప్రాణం పోసే గురువుల గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగ కూడా! “గురు బ్రహ్మ, గురు విష్ణు” అని మొదలుపెట్టి, ‘‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా’’ అని మన విద్యార్థులు సదా స్మరించే శ్లోకమే దీనికి నిదర్శనం! జ్ఞానమాతను పూజించే ఈ రోజున, జ్ఞానదాతలైన ఉపాధ్యాయుల బాధలు మరిచిపోవడం ఎంత వింతో, అంతే విచారకరం!
తెలంగాణలో విద్యావ్యవస్థ బలపడుతోందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం, ఉపాధ్యాయులు, అధ్యాపకుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. పండుగలప్పుడు గురువు బ్రహ్మ, గురువు విష్ణు… అని స్తుతించే ప్రభుత్వాలు, వారికి కనీస ఉద్యోగ భద్రత ఇవ్వకుండా ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా, విధానాలు మారుతున్నా, ఉపాధ్యాయుల జీవితాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏరు దాటేంత వరకూ ఓడ మల్లన్న అని, ఏరు దాటగానే బోడి మల్లన్న అంటూ పూర్వ బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే టీచర్లను మోసం చేసింది.
మన ఉపాధ్యాయులు, అధ్యాపకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్త కోరికలేమీ కోరడం లేదు. కొత్త డిమాండ్లను కూడా ముందుకు తేవడం లేదు. గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా తమ భవిష్యత్తు భద్రత కోసం తిరిగి పాత పెన్షన్ పథకం అమలు చేయాలంటున్నారు. తమను తమ కుటుంబాలకు దూరం చేసిన జీవో 317 ని మార్చాలంటున్నారు. ఏళ్ల తరబడి చేస్తున్న తమను గుర్తించి ఖాళీగా ఉన్న పదోన్నతులను భర్తీ చేయాలంటున్నారు. కానీ, వీటిపై ప్రభుత్వం కనీసం మాట్లాడటం లేదు. పీఆర్సీ కూడా అమలు చేయకపోవడంతో ఉపాధ్యాయులకు జీతం పెంపు లేకుండా పోయింది. దీనికి తోడు పెండింగ్ డీఏలు, ఇతర బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో టీచర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు కేవలం జీతాలకే పరిమితం కాదు. ఒకప్పుడు టీచర్ అంటే విద్యార్థులకు బోధించడం, బోధించడం కోసం ఎప్పటికప్పుడు సన్నద్ధం కావడం మాత్రమే. కానీ, ఇప్పుడు వారిని అనేక పనుల్లో నిమగ్నం చేస్తున్నారు. ఎన్నికల విధులు, సర్వేలు, మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించడం, సెలవుదినాల్లోనూ డ్యూటీలు… ఇలా అన్నీ చేయిస్తున్నారు. ఈ అధిక పనిభారం వల్ల ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులు ఉత్సాహాంగా పాఠాలు చెప్పగలరా? విద్యార్థులకు న్యాయం చేయగలరా?అని ప్రభుత్వం ఆలోచించాలి.
సంక్షేమ హాస్టళ్లలో భోజనంతో పాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలోనూ టీచర్లను బాధ్యులుగా చేస్తూ వేటు వేయడం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. నాణ్యమైన భోజనానికి సరైన ధరలు చెల్లించకుండా, ఇచ్చే అరకొర నిధులను కూడా సమయానికి చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించగలనని ఎలా అనుకుంటోంది? ఈ విషయంలో ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా ఉపాధ్యాయుల గౌరవానికే ఎసరు పెడుతోంది. ఉపాధ్యాయ వృత్తిని అగౌరపరచడం వల్ల విద్యార్థులు తమ గురువుల పట్ల విశ్వసనీయత కోల్పోతున్నారు. గురు శిష్యుల బంధం బీటలువారి విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
మన రాష్ట్రంలో అనేక మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి భవిష్యత్తుకు ఏ గ్యారెంటీ లేకుండా పోయింది. వీరికి రెగ్యులరైజ్ అయ్యే హక్కు ఉండి కూడా దశబ్దాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. కన్సాలిడేటెడ్ పే మీద సంవత్సరాలు గడుస్తున్నా… అతి తక్కువ జీతంతో పని చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన వారే, తాము ఏ క్షణంలోనైనా ఉద్యోగం కోల్పోయే ప్రమాదంలో ఉన్నామన్న భయంతో బతకాల్సి వస్తోంది. ప్రభుత్వం కనీసం వీరికి ఒక హెల్త్ కార్డు కూడా లేకపోవడం దురదృష్టకరం.
ఉపాధ్యాయులు ఇలా ఆర్థిక, మానసిక ఒడిదుడుకులు ఎదుర్కుంటూ బోధనలో తగిన నిబద్ధత ఎలా చూపగలరు? ఇలాగైతే విద్యా ప్రమాణాలు ఎలా మెరుగవుతాయి?
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సర్వ శిక్ష అభియాన్ ఉపాధ్యాయులకు, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు కనీసం టైం స్కేల్ లేకపోవడం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా పోయింది. కనీసం పే స్కేల్ ఇవ్వకపోవడం వల్ల అత్యవసరాలకు రుణాలు కూడా పొందలేని పరిస్థితి ఏర్పడింది. నైట్ డ్యూటీలు, హాలీడే డ్యూటీలు చేయడం, వీటికి అదనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష టీచర్లను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి, మాట తప్పారు. దీంతో తమ హక్కుల కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయుల బాధలను పట్టించుకునే ప్రయత్నం కూడా చేయకుండా… ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తానని హెచ్చరించడం వారి ద్వందనీతికే చెల్లింది.
ఉపాధ్యాయుల సమస్యలపై ఆయా సంఘాలు ఎప్పటికప్పుడూ నిరసనలు చేస్తున్నా…వాటికి ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు ఎప్పుడూ నిరాశే కలిగిస్తోంది. సమ్మెలు జరిగినా, ఉపాధ్యాయులు రోడ్ల మీదికి వచ్చినా, ప్రభుత్వానికి పట్టింపే లేకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పుడు ఉపాధ్యాయులు మార్పును ఆశించారు. కానీ, ఇప్పుడు కూడా వారి హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు టీచర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక విద్యా సంస్థల్లో మౌలిక వసతుల స్థితిగతులు ఎంత దారుణంగా ఉన్నాయో
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!
వసంత పంచమి అంటే మనం జ్ఞానాన్ని పూజించే పండుగ. కానీ, ఆ జ్ఞానాన్ని పంచే గురువుల గొంతు ఈ రోజు వినిపించకుండా పోతుంటే… ఇది నిజమైన పండుగ కాదనే భావన కలుగుతోంది. ప్రభుత్వాలు మారినా, విధానాలు మారినా, ఉపాధ్యాయులూ, పాఠశాలల దుస్థితి మారకపోతే, మన విద్యావ్యవస్థకు ఎదురయ్యే ప్రమాదం ఊహాకందనంత తీవ్రంగా పరిణమిస్తుంది. అందుకే, ఈ వసంత పంచమికి మనం సరస్వతీ దేవిని ఆరాధించడమే కాకుండా, మన రాష్ట్రానికి విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువుల హక్కులను రక్షించాలని ప్రతిజ్ఞ చేద్దాం. మళ్లోచ్చే వసంత పంచమి వరకైనా.. ఉపాధ్యాయుల సమస్యలు తీరి, వారి జీవితంలో నిజమైన ” వసంతం” రావాలని కోరుకుందాం!
మల్క కొమరయ్య,
విద్యావేత్త