మహాశివరాత్రి:
పరమ మంగళకరమైనది శివస్వరూపం. ” శివ ” అంటే మంగళమని అర్థం. శివుని అనుగ్రహం కోసం జరుపుకునే అతి ముఖ్యమైన పండగ మహాశివరాత్రి. ఏటా మాఘమాసం క్రుష్ణపక్షంలో చతుర్థశినాడు ఈపండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్రలేవగానే శివుడి మీద మనస్సు లగ్నం చేయాలి. స్నానం ఆచరించి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజద్రవ్యాలను సమకూర్చుకోవాలి. రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్లి సమకూర్చుకొన్న పూజద్రవ్యాలను అక్కడ ఉంచి.. శివాగమ ప్రకారం పూజచేయాలి. శివమంత్రానుష్టానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలని శాస్త్రం చెబుతోంది.
భక్తా భావంతొో శివరాత్రి తొలి యామం(జాము) పూజను పూర్తి చేయాలి.శివమంత్రానుష్టానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆతర్వాత శివ వ్రత మహాత్మ్య కథను వినాలి. ఈపూజను నాలుగు జాములలో ఆరోజు రాత్రి చేయాల్సి ఉంటుంది. నాలుగు జాములలో పూజచేసి..పంచామ్రుతాభిషేకం..జలధారతో అభిషేకం నిర్వహించాల్సి ఉంటుంది.
శివపూజకు సమర్పించాల్సినవి;
- చందనం, నూకలు లేని బియ్యం, నల్లని నువ్వులతో పూజచేయాలి.
- ఎర్రగన్నేరు,పద్మంలాంటి పుష్పాలు స్వామివారికి అర్పించాలి
- భవుడు,శర్వుడు,రుద్రుడు, పశుపతి,ఉగ్రుడు, మహాన్,భీముడు, ఈశానుడు,అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి.
- అన్నం,కొబ్బరి, తాంబూలాలను నివేదించాలి.
- ధేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి
- పూజ అనంతరం పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది.
- రెండోజాము పూజలో నువ్వులు,యవలు, కమలాలు పూజద్రవ్యాలుగా ఉండాలి
- మూడో జాము పూజలో యవల స్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి
- నాలుగో జాము పూజలో పూజద్రవ్యాలుగా మినుములు, పెసలు లాంటి ధాన్యాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను ..మినుములతో కలిపి వండిన పదార్థాన్ని స్వామికి పెట్టాలి.
నాలుగుజాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని , ఆశీర్వచనాన్ని స్వీకరించాలి. ఇలా పూజ చేస్తే భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు,సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మా, విష్ణు, పార్వతులకు వివరించినట్లు పురాణ వచనం.