Nancharaiah merugumala senior journalist:
యేసు క్రీస్తును మానవాళికి అందించిన యూదుల మాదిరిగా కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా? కొలంబియా యూనివర్సిటీ త్వరగా తేల్చాల్సిన విషయాలివి!
కాపు జాతి మనది–నిండుగా వెలుగు జాతి మనది.. వైఎస్సార్ కాంగ్రెస్ మనది–టీడీపీ మనది..జనసేన మనది–బీజేపీ మనది..అసలు తెలుగు నేలే మనదే మనదేరా! అన్నట్టు సాగుతోంది తెలుగు కాపుల రాజకీయ ప్రయాణం ఈ ఎన్నికల ముందు కాలంలో. తెలుగు న్యూజ్ చానల్స్ సహా తెలుగు మీడియా సంస్థలన్నీ ఇప్పుడు కాపుల్లో ఐక్యత, కాపుల్లో చీలికలపైనే దృష్టి కేంద్రీకరించి చర్చోపచర్చలు జరిపిస్తున్నాయి. ఈ టీవీ డిబేట్లలో కాపు రాజకీయ నాయకులు, కాపు మేధావులు, కాపు మాజీ జర్నలిస్టులు అత్యుత్సాహంతో పాల్గొంటున్నారు. పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 1962 నుంచి అవశేషాంధ్ర ప్రదేశ్ లో నిర్వహించిన 2019 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఎప్పుడు ‘కాపు ఓటు’పై మీడియా శ్రద్ధ, కాపేతర కులాల ఆసక్తి 2024 ఎన్నికల స్థాయిలో లేదు. టెలివిజన్ న్యూజ్ చానళ్లలో కాపు కులానికి చెందని (వైదిక బ్రాహ్మణడీయన) మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, అలాగే టీవీ 9 లో కీలక పదవిలో పనిచేస్తున్న కమ్మ టీవీ జర్నలిస్టు వెల్లలచెరువు రజనీకాంత్ సహా అనేక మంది నాన్–కాపు మేధావులు పదే పదే ‘కాపు జాతి, కాపు జాతి, కాపు జాతి కోసం ముద్రగడ పద్మనాభం గారి ఆరాటం, కాపు కురువృద్ధుడు చేగొండి హరిరామ జోగయ్య గారు కాపు జాతికి న్యాయం, కాపు జాతి ఐక్యత కోసం పడుతున్న ఆవేదన,’ అంటూ మాట్లాడడం కాస్త వింతగానే కనిపిస్తోంది. ఈ టీవీ కబుర్లు వింటుంటే ఇజ్రాయెల్ దేశంలోని యూదులు, పాలస్తీనియుల మాదిరిగా, ఇండియాలోని జొరాష్ట్రియన్ల (ఫార్సీలు) వలే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సముదాయం కూడా ప్రత్యేక జాతా? కాపులకు కూడా ఒక ప్రత్యేక జాతిగా తన ఉనికి కాపాడుకోవడానికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలు ఉన్నాయా?’ అనే అనుమానాలు కాపులు కాని తెలుగువారిని శూలాల్లా పొడుస్తున్నాయి.
కాపులు ఒక కులమా లేక ప్రత్యేక జాతా? అనేది కొలంబియా వర్సిటీయే తేల్చాలి!
కాపులు కేవలం తెలుగువారే కాదా? వారు ప్రత్యేక జాతి కూడానా? అనే విషయంపై న్యూయార్క్ లోని ప్రపంచ ప్రసిద్ధ కొలంబియా యూనివర్సిటీలోని (బాబాసాహబ్ బీఆర్ అంబేడ్కర్ మతం, కులం, జాతి వంటి అంశాలపై లోతైన అవగాహన సంపాదించింది ఈ విశ్వవిద్యాలయంలో నూరేళ్ల క్రితం చదువుకున్నప్పుడే) సోషియాలజీ లేదా ఆంథ్రొపాలజీ శాఖలు పరిశోధనలు జరిపిస్తే బావుంటుందని మంచి ఆలోచనాపరులైన అనేక మంది కాపులు ఆశిస్తున్నారు. ఎన్నో దశాబ్దాల పాటు రాజ్యాధికారం అనుభవించిన, కాపులతో సమానంగా జనాభా ఉన్న (కులగణన పకడ్బందీగా జరగనంత వరకూ కోటాలు, కాటాలు లేని కాపుల జనాభా ఐదారు శాతమే ఉంటుందని అంచనాతో) రెడ్లు, కమ్మలే ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ప్రత్యేక జాతులుగా పిలిపించుకోవాలనే యావ లేకుండా బతుకుతున్నారు. మరి కాపులేమో జత్యహంకారంతో ‘కాపు జాతి, కాపు జాతి’ అంటూ మాట్లాడుతూ చివరికి ఏపీ ముఖ్యమంత్రి పదవిని సాధించాలని చూస్తున్నారు. మా దివంగత మిత్రుడు, కాపు కమ్యూనిస్టు, కాపు ఉద్యమకారుడు గుర్రంకొండ తిరుమల రావు ఉరఫ్ శ్రీకాంత్ గారు 20 ఏళ్ల క్రితమే నాటి ‘వార్త’ దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో కాపులపై చక్కటి పరిశోధనాత్మక వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో ‘‘ తెలుగువారంతా తెలగలే. తెలగ కులస్థులే (కాపులే అనే అర్ధంలో) అని అనేక మంది సామాజికశాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు, ’’ అని శ్రీకాంత్ గారు రాసిన వాక్యాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. కాపులతో పోల్చితే బాగా అన్ని రంగాల్లో వెనుకబడిన గౌడ, గొల్ల, పద్మశాలి, ముదిరాజు కులస్థులు సైతం తమను తాము ప్రత్యేక జాతిగా పరిగణించుకోవడం లేదు. అలాంటిది ఒక్క కాపులకే ‘జాతి’ అనే మాట ఈమధ్య మీడియాలో పదే పదే ఉపయోగించడం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సముదయానికి శుభసూచకంగా భావించవచ్చు.