విశీ: తెలుగు భాషా పరిరక్షణకు, తెలుగు సాంస్కృతికవ్యాప్తి కోసం పదేళ్లుగా ఒక మాసపత్రిక నడుస్తోంది. ఈ మధ్యనే ఆ పత్రికకు సంబంధించి ఒక వెబ్‌సైట్ కూడా మొదలుపెట్టారు. సరే! ఒకసారి చూద్దాం అని ఇవాళ చూశాను. ఏదైనా పత్రికలో నాకు ఎక్కువ ఆసక్తి కలిగించేవి కథలు. ఇందులో కథలు ఏమున్నాయో చూద్దామని PDFలు డౌన్‌లోడ్ చేశాను. దాదాపు ఆరు నెలల క్రితం వరకూ చూశాను. ఒక్కటంటే ఒక్క కథ లేదు. మధ్యలో ఒకే ఒకసారి ఏనాడో ఆంగ్లం నుంచి అనువాదం చేసిన ఒక్క కథ వేశారు. అంతే! ఆ పత్రికలో వ్యాసాలు వస్తున్నాయి. సీరియల్ వస్తోంది. కవితలు వస్తున్నాయి. పుస్తక సమీక్షలు వస్తున్నాయి. లేనిదల్లా కథ. తెలుగు కథ. కొత్త కథ.
మరో తెలుగు మాసపత్రిక. చాలా పేరుంది. పెద్దలు నడుపుతున్నారు. కొన్ని నెలల నుంచి చూస్తూ ఉన్నాను. చాలా వరకు రచయితలు ఎప్పుడో రాసిన కథలు కొత్తగా వేస్తున్నారు. అదెందుకో అర్థం కావడం లేదు. కథకులు కొత్తవి రాయలేరా? అలా రాసి ప్రచురించడం సాధ్యం కాదా? ఇప్పుడున్న వాళ్ల పాత కథలు వేయడం కంటే కొత్త కథకులు రాసిన కొత్త కథలు వేయడం అసాధ్యమా? ఎందుకిలా! ఏమిటో దాని వెనుక ఉన్న ఇబ్బంది?
కొత్త కథకులు ఇంత ఉత్సాహంగా రాస్తున్న ఈ కాలంలో మాసపత్రికలు పాటిస్తున్న ఈ పద్ధతులేమిటో, దాని వెనకాల దాగున్న రహస్యాలు ఏమిటో ఎవరికైనా అర్థం అయితే చెప్పండి.