Operationsindoor:
భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఇప్పటివరకు తొమ్మిది స్థావరాల్లో 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారికి ప్రకటన రావాలి. బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే(లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఒక్కో క్యాంపులో 25-30 మంది మృతులు ఉన్నట్లు సమాచారం. కానీ పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చనిపోయింది 8 మందే అని, భారత్ కావాలని తమ దేశ సార్వభౌమాధికారాన్ని, మతహక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని అంటోంది. తప్పక ప్రతీకారం తీర్చుకుంటానని అంటోంది. అయితే అంతర్జాతీయ సమాజం(బహిరంగంగా) భారత్ వైపున నిలబడటం వల్ల పాక్ పరిస్థితి ఒంటరిగా మారింది.
ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో దానికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టారు. భారత స్త్రీల సిందూరాన్ని నేలరాల్చిన వారి మీద ప్రతీకార చర్యగా ‘సిందూర్’ అని ఈ దాడికి నామకరణం చేశారు. కశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైన క్యాంప్‌లను భారత సైన్యాలు నేలమట్టం చేశాయి. 1971 తర్వాత మూడు దశాలు(వైమానిక, నేవీ, ఆర్మీ) పాల్గొన్న దాడి ఇదే.
పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలే తప్ప, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేయలేదని భారత్ స్పష్టం చేసింది. రాఫెల్ విమానాల సాయంతో లక్ష్యంపై గురిపెట్టి దాడులు చేశామని తెలిపింది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే పాక్ నుంచి గట్టి ఆరోపణలేవీ రాకపోవడం వల్ల అక్కడ సామాన్య ప్రజలకు తక్కువ హానే జరిగి ఉంటుందని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. పాక్ తప్పకుండా కుయుక్తులు పన్నుతుందని, ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇకనైనా ఇలాంటి పనులు మానేయమని సలహా ఇస్తున్నారు.
చనిపోయిన ఉగ్రవాదులు, వారి పేర్లు, వారి గురించిన పూర్తి వివరాలు బయటకు వస్తే, ఉగ్రవాదంపై భారత్ జరిపిన కీలకమైన దాడిగా ‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలిచిపోతుంది. అంతర్జాతీయ సమాజంలో భారత్ కీర్తి వెలుగుతుంది. ఇదంతా భారత సైనికులు ధైర్యసాహసాలకు దక్కాల్సిన గౌరవం. వారి శక్తికి దక్కిన ఫలితం.
కొంతకాలంపాటు దేశంలోని ప్రముఖ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా మందిరాలు, సున్నితమైన ప్రాంతాల్లో గట్టి నిఘా అవసరం. ఏమాత్రం అనుమానం ఉన్న ప్రాంతానికైనా ప్రజలు వెళ్లకపోవడం మంచిది. ఒకేచోట ఎక్కువమంది గుమికూడే చోట మరింత భద్రత అవసరం. ఉగ్రనేపథ్యం అనుమానం ఉన్నవారిపై రహస్య నిఘా ఉంచాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మతాలకతీతంగా అందరూ ఐకమత్యంగా ఉంటే ఉగ్రవాదం తోకముడుస్తుంది.
– విశీ(వి.సాయివంశీ)