Congress: ఎగ్జిట్ పోల్స్ ను బాయకాట్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఏమనాలి..!

Exitpolls2024: 

” పోల్ బాయకాట్ చేయకుండా… ఎగ్జిట్ పోల్స్ ను బాయకాట్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఏమనాలి? ” 

ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ముందు రాజకీయ పరిస్థితులు సజావుగా లేవని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇచ్చేవిగా ఈసీ పోకడలు కనిపించడం లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ అసలు పోల్ బాయకాట్ ప్రకటించాల్సింది. ఎందుకో అంతటి గొప్ప సాహసం గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీఓపీ) చేయలేదు. కానీ శనివారం సాయంత్రం అన్ని మీడియా వేదికల ద్వారా ప్రసారమయ్యే ఎగ్జిట్ పోల్స్ ను బహిష్కరిస్తున్నట్లు హస్తం పార్టీ ఒక రోజు ముందే ప్రకటించడం చాలా మందికి అర్థం కాని విషయం. నాలుగో తేదీ ఓట్ల లెక్కింపులో ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు లేదా సీట్లు వస్తాయని అంచనావేసి చెప్పే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై టీవీ స్టూడియోల్లో జరిగే చర్చలను అగ్రగామి జాతీయపార్టీ అయినా కాంగ్రెస్ బహిష్కరించడం ఇదే మొదటిసారి.

తాజా పార్లమెంటు ఎన్నికలను రాహుల్ గాంధీ బాయకట్ చేసి ఉంటే..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 150 సీట్లు దాటిపోయేది. 18వ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్కోరు 2019 నాటి 52 సీట్ల నుంచి 85-100 స్థానాల వరకూ పెరుగుతుందని ప్రఖ్యాత రాజకీయ, ఎన్నికల విశ్లేషకుడు, పూర్వ సిఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ అంచనా వేశారు. పార్లమెంటు దిగువసభలో తన బలం దాదాపు రెట్టింపు అయ్యే అవకాశాలు కళ్ళకు కనిపిస్తున్నా … ఎగ్జిట్ పోల్ బాయకాట్ కు కాంగ్రెస్ ఎందుకు దిగిందో కనీసం తెలుగు టీవీ న్యూజ్ చానళ్ల దిగ్గజాలు అయినా సాయంత్రం తెలుగు పౌరులకు చెబుతారని ఆశిద్దాం.