దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ఈ రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలకమైనవి. రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వానికి సెమీఫైనల్సే అని చెప్పవచ్చు. అందుకే బిజెపికి ఈ ఎన్నికలు పెను సవాలు విసురుతున్నాయి. తొలుతగా ఫిబ్రవరిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ 2014లో ఢల్లీి పీఠం ఎక్కాక ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయడంలో సఫలమయ్యింది. ఈ విజయాలు బిజెపి బలమా..? లేదా వాపా..? అనేది రాబోయే ఎన్నికల్లో తేలిపోనున్నాయి. త్రిపుర ఎన్నికలు జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లతో పాటు సిపిఐ(ఎం)కు అగ్నిపరీక్ష లాంటివి.
సీపీఐ(ఎం) కోటను కొల్లగొట్టిన బిజెపి
2018 వరకు సిపిఐ(ఎం), కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉండే త్రిపురలో బిజెపి అనూహ్యంగా అందలమెక్కింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈశాన్య రాష్ట్రాలో పాగా వేయాలని భావించిన బిజెపి క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంఘాల సహాయసహకారాలతో చురుకైన పాత్ర పోషించింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 1.5 శాతం ఓట్లే సాధించిన బిజెపి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 44.4 ఓట్ల శాతంతో 36 సీట్లు సాధించి 25 సంవత్సరాలు నిరాటంకంగా పాలిస్తున్న మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఐ(ఎం) ప్రభుత్వం కోటలను బద్దలు కొట్టింది. రాష్ట్ర చరిత్రలో 35 సంవత్సరాలు అధికారంలో ఉన్న సీపీఐ(ఎం) 2013 అసెంబ్లీ ఎన్నికలో 51.7 శాతం ఓట్లతో 49 సీట్లు సాధించగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 33 సీట్లు కోల్పోయి 16 స్థానాలకే పరిమితం అయ్యింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 43.6 శాతం ఓట్లు పొందింది. రాష్ట్రంలో బిజెపి ఉనికి ప్రారంభమయ్యాక తీవ్రంగా నష్ట పోయింది కాంగ్రెస్ పార్టీయే. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 36.5 శాతం ఓట్లతో పది స్థానాలు సాధించిన కాంగ్రెస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 7.4 శాతం ఓట్లు మాత్రమే పొంది ఒక్క సీటు కూడా సాధించలేదు. 2015 తర్వాత రాష్ట్రంలో బిజెపి ప్రభావం ప్రారంభంతో అధికార సీపీఐ(ఎం)కు ప్రత్యామ్నాయం బిజెపియే అనే వాతావరణం ఏర్పడిరది. 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి బిజెపిలోకి పెద్దఎత్తున వలసలు జరిగాయి. నిరాటంకంగా పాలిస్తున్న మాణిక్ సర్కార్‌పై ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటును బిజెపి అందిపుచ్చుకొని అధికారం చేపట్టింది. వామపక్షాలతో సైద్ధాంతికత వైరుధ్యం ఉన్న బిజెపి సీపీఐ(ఎం) కోటలో పాగా వేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. లైఫ్ట్ రైట్ వైరుధ్య భావాలున్న బిజెపి, సీపీఐ(ఎం) పార్టీలు ముఖాముఖి తలపడ్డ రాష్ట్రం త్రిపురయే. దేశవ్యాప్తంగా వామపక్షాలకు పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాలలో బలముంది. పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం బిజెపితో తృణముల్ పార్టీ తలపడుతుండగా, కేరళాలో బిజెపి బలం నామమాత్రమే. మూడవ రాష్ట్రమైన త్రిపురలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య ముఖాముఖి పోరు ఉండడంతో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. దేశ వ్యాప్తంగా ఎదుగుతున్న బిజెపిని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న వామపక్షాలు సొంత బలమున్న త్రిపుర నుండి బిజెపి పతనాన్ని శాసిస్తామనే విశ్వాసంతో అడుగులేస్తున్నాయి.
ముఖ్యమంత్రి మార్పు బిజెపికి లాభించేనా..?
బిప్లబ్ కుమార్ దేబ్ నేతృత్వంలో 2018లో బిజెపి అధికారం చేపట్టాక బిజెపి, సీపీఐ(ఎం) పార్టీల మధ్య రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. బెంగాలీలు అధికంగా ఉండే ఈ రాష్ట్రంలో 2020 తర్వాత పశ్చిమబెంగాల్‌లో పాలకపక్షమైన తృణముల్ కాంగ్రెస్ ప్రభావం కూడా అధికంగానే ఉంది. సంస్థాగతంగా బలపడేందుకు బిజెపి 2021లో జరిగిన స్థానిక ఎన్నికలను సద్వినియోగించుకొని భారీ విజయాన్ని సాధించింది. స్థానిక ఎన్నికల్లో బిజెపి 59 శాతం ఓట్లను, సీపీఐ (ఎం) 18 శాతం ఓట్లు సాధించగా తృణముల్ కాంగ్రెస్ 16 శాతం ఓట్లు సాధించి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న సంకేతాలను ఇచ్చింది. బిప్లబ్ కుమార్ దేబ్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించడంతో పాటు ఆయన తరచు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన పదవికి ఎసరు తెచ్చాయి. నాలుగు సంవత్సరాలు పాలించిన బిప్లబ్ కుమార్ దేబ్ నేతృత్వంలో జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి బిజెపి అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. ఆర్‌ఎస్‌ఎస్ బీజాలున్న బిప్లబ్ కుమార్ దేబ్ స్థానంలో కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరిన మాణిక్ సాహాను పార్టీ 2022 మే నెలలో ముఖ్యమంత్రిగా చేసింది. సంవత్సరంలోపు ఎన్నికలున్న సమయంలో ముఖ్యమంత్రి మార్పు బిజెపికి ఎటువంటి ప్రయోజనం చేకూరుస్తుందో చూడాలి.
పార్టీల బలాలు, బలహీనతలు
2013 ఎన్నికల ప్రచారంలో ఏడవ పే కమిషన్ ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, ఉచిత స్మార్ట్‌ఫోన్ల పంపిణీ, మహిళలకు డిగ్రీ వరకు ఉచిత విద్య వంటి హామీలను ఇచ్చిన బిజెపి ప్రభుత్వం వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోవడం ఆ పార్టీకి నష్టం చేకూర్చవచ్చు. కాంగ్రెస్ నుండి భారీగా వలసలు వచ్చిన నేతలకు బిజెపి సైద్ధాంతికతో వైరుధ్యాలు, పార్టీలో అంతర్గత అసమ్మతి పెద్ద ఎత్తున ఉండడం బిజెపికి ప్రతికూలతలు. ఈ ఐదేళ్లలో బిజెపి సంస్థాగతంగా పటిష్టమవడం ఆ పార్టీకి ప్రత్యేకమైన బలం. క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్ బలపడడం బిజెపికి అదనపు బలం. ఇక ప్రతిపక్ష పార్టీల స్థితిగతులను పరిశీలిస్తే ప్రజా బలం గల మాణిక్ సర్కార్ నాయకత్వం సీపీఐ(ఎం) పార్టీకి ప్రత్యేక బలం. సెక్యులర్ సిద్ధాంతానికి కట్టుబడడం, సంస్థాగతంగా బలంగా ఉండడం సీపీఐ(ఎం)కు అదనపు బలం. గతంలో మాణిక్ సర్కార్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు ఆ పార్టీకి తోడ్పడుతాయి. పాతికేళ్ల సీపీఐ(ఎం) పాలనలో రాష్ట్రం మౌలిక సదుపాయాల కల్పనలో, పేదరిక నిర్మూలనలో వెనకబడిపోయిందనే విమర్శ ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 స్థానిక ఎన్నికల్లో సీపీఐ(ఎం) వరుసగా పరాజయాల ప్రభావం పార్టీ కేడర్‌పై పడిరది. బెంగాలీయుల బలంతో రాష్ట్రంలో రాజకీయ ప్రవేశం చేసిన తృణముల్ కాంగ్రెస్‌తో సీపీఐ(ఎం)కు నష్టం చేకూరే అవకాశాలున్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ ప్రస్తుతం సంస్థాగతంగా బలహీన పడిరది. పెద్ద నాయకుల మొదలుకొని కింది స్థాయి కార్యకర్తలు పార్టీని వీడడంతో అభ్యర్థులను కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతల వలసలు, ఓటు బ్యాంకు మొత్తం వైఎస్‌ఆర్‌సిపికి బదిలీ కావడంతో కాంగ్రెస్ ఏపీలో నష్టపోయిన పరిస్థితే ఇప్పుడు త్రిపురలో కూడా నెలకొంది. రాష్ట్రంలోని మైనార్టీ ఓట్లపైనే కాంగ్రెస్ పెద్దఎత్తున ఆశలు పెట్టుకుంది. నూతనంగా రంగ ప్రవేశం చేసిన తృణముల్ కాంగ్రెస్ రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధ్వర్యంలో పార్టీ పలు కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతోంది. ఇటీవల రాష్ట్రంలో బిజెపికి తృణముల్ కాంగ్రెస్‌కు మధ్య జరిగిన పలు హింసాత్మక ఘటనలతో తృణముల్ కాంగ్రెస్ నిత్యం వార్తల్లో ఉంటుంది.
మారుతున్న రాజకీయ సమీకరణాలు
సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీలు ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో బిజెపి ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలకుండా ఉండాలని పొత్తుకు సీపీఐ(ఎం) చొరవ తీసుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని దాదాపు నిర్ణయించిన సీపీఐ(ఎం) గ్రేటర్ త్రిపాలాండ్ డిమాండ్ చేస్తున్న ‘తిప్రా మోతా’తో కూడా జట్టు కట్టాలని భావిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తిప్రా మోతాతో పొత్తుకు అయిష్టంగా ఉంది. బిజెపి ఓటమే లక్ష్యంగా సీపీఐ(ఎం) తిప్రా మోతాతో పొత్తుకు సిద్ధమవుతోంది. గిరిజన ప్రాంతాలతో కూడిన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తున్న తిప్రా మోతా తమ డిమాండ్‌కు ఆమోదం తెలుపుతూ రాతపూర్వకంగా హామీ ఇచ్చే పార్టీతోనే పొత్తు పెట్టుకుంటామని బహిరంగంగా ప్రకటించింది. త్రిపుర రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలతోనే కాకుండా అస్సాం, మిజోరం రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దులో నివసించే గిరిజనుల ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక గిరిజన రాష్ట్రం ఏర్పాటు చేయాలని వీరి డిమాండ్. పొత్తుల సమీకరణాలతో బిజెపిని అడ్డుకోవచ్చని సీపీఐ(ఎం) భావిస్తుండగా, సీపీఐ(ఎం), కాంగ్రెస్ కూటమి ప్రత్యేక గిరిజన రాష్ట్రం కోరుతున్న తిప్రా మోతాతో పొత్తు పెట్టుకుంటే గిరిజనేతర ప్రాంతాల్లో తమకు లాభం చేకూరుతుందని బిజెపి అంచనా వేస్తోంది. కేరళా వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో ముఖాముఖి తలపడుతున్న సీపీఐ(ఎం) త్రిపురలో పొత్తు పెట్టుకోవడాన్ని రాజకీయ అవకాశవాదంగా ప్రజల ముందుకు బిజెపి తీసుకెళ్తుంది. మరోవైపు తృణముల్ పార్టీ విడిగా పోటీ చేస్తుండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే జరగనున్న త్రిపుర ఎన్నికల తీర్పు దేశ రాజకీయాల్లో ప్రధానంగా బిజెపి వ్యతిరేక పొత్తుల సమీకరణాలకు నాంది పలికే అవకాశాలున్నాయి.
=====================
– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ.