Vemulawadapolitics:
వేములవాడలో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. అధికార బిఆర్ ఎస్ అంతర్గత పోరుతో సతమతమవుతుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈసారి ఎట్టిపరిస్థితుల్లో నియోజకవర్గంపై జెండా ఎగరేయాలని తీవ్ర పట్టుదలతో కనిపిస్తున్నాయి.అసలు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితి ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది?
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ బాబు కొనసాగుతున్నారు. ఉప ఎన్నికతో కలుపుకుని నాలుగు మార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మరోసారి ఎమ్మెల్యేగా పోటిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆయన పనితీరు పట్ల నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికి తోడు పౌరసత్వ వివాదం ఆయనను వెంటాడుతోంది. దీంతో రానున్న ఎన్నికల్లో ఆయన స్థానంలో మరోవ్యక్తిని పోటిలో దింపేందుకు బిఆర్ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మరోవైపు బిఆర్ఎస్ నేత చల్మెడ లక్ష్మీనరసింహ్మారావు పట్టణంలో సొంతంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమానికి వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు,కోనరావుపేట ,సనుగుల విండో చైర్మన్లు, మాజీ జెడ్పీ చైర్మన్ తీగల రవీందర్, కౌన్సిలర్లు, సెస్ మాజీ చైర్మన్ ,వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు హాజరవడంతో పార్టీ టికెట్ ఆయనకే వస్తుందన్న ప్రచారం జరుగుతుంది.
ఇకపోతే బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న మరోవ్యక్తి ఎన్నారై గోలి మోహన్. ఈయన ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు అండగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బిఆర్ ఎస్ లో చేరిన ఏనుగు మోహన్ రెడ్డి సైతం పార్టీ టికెట్ ఆశిస్తున్న..నియోజకవర్గంలో ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదు.
వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా కనిపిస్తుంది.గత ఎన్నికల్లో పోటిచేసిన ఓడిపోయిన ఆదిశ్రీనివాస్.. రానున్న ఎన్నికల్లోను పార్టీ తరపున బరిలోకి దిగనున్నారు. ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి కనిపిస్తున్న విజయవకాశాలు తక్కువనే భావన వారిలో కనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పోటిచేసి ఓడిపోయిన ఆయన ఆర్థికంగా బలంగా లేరనే మాట పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది.
ఇక బీజేపీ విషయానికొస్తే.. మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ తో పాటు చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ ఎమ్మెల్యే టికెట్ కోసం పోటిపడుతున్నారు. తుల ఉమ పేరు ఒకటి రెండు మండలాల్లో వినిపిస్తున్న.. వికాస్ పేరు మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది. ప్రతిమ ఫౌండేషన్ పేరిట ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు దగ్గరయ్యేందుకు దోహదపడుతున్నాయి . దీనికితోడు తండ్రి విద్యాసాగర్ రావు ఎంపీగా నియోజకవర్గానికి చేసిన పనులను ప్రజలు ఇప్పటికి గుర్తు చేసుకోవడం వంటి అంశాలు వికాస్ కు కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది.
మొత్తంగా వేములవాడలో రానున్న ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పట్టు నిలుపుకోవాలని అధికార బిఆర్ఎస్.. నియోజకవర్గంపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ.. బ్యాక్ బౌన్స్ కావాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.