Chhatrapati Shivaji: శివాజీ హిందూత్వవాదా? లౌకికవాదా?

Chhatrapati Shivaji: శివాజీ హిందూత్వవాదా? లౌకికవాదా?

విశీ ( సాయి వంశీ) :  (AN IMPORTANT CASE YOU SHOULD KNOW)

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కొల్హార్ ప్రాంతానికి చెందిన గోవింద్ పన్సారేకు తన పాఠశాల ప్రాయంలోనే కమ్యూనిజంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇష్టం, నమ్మకంగా మారింది. 1952లో సీపీఐలో ఆయన చేరారు. ఆపై అనేక పుస్తకాలు చదివారు. ఆ దశలోనే సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం, గోవా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. 1962లో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. భారత్-చైనా యుద్ధ సమయంలో కమ్యూనిస్టు అయిన కారణంగా ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం విడుదలై, లాయర్‌గా ప్రాక్టీసు మొదలుపెట్టారు. సీపీఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. అప్పట్లో గుళ్లల్లో నిర్వహించే పుత్రకామేష్టి యాగాలను వ్యతిరేకించారు. గాంధీని చంపిన నాథూరాం గాడ్సేని గొప్పవాడిగా పొగడటాన్ని నిరసించారు. రైట్ వింగ్ కార్యకర్తలు ఆయనపై అనేకసార్లు బెదిరింపులకు పాల్పడ్డారు.

ఛత్రపతి శివాజీని కొన్ని రాజకీయ పార్టీలు హిందూత్వవాదిగా పేర్కొంటున్న నేపథ్యంలో 1987 మేలో ఆయన శివాజీ వ్యక్తిత్వం గురించి ప్రసంగం ఇచ్చారు. శివాజీ లౌకికవాది అని, తన సైన్యంలో ముస్లింలకు చోటిచ్చి కీలక పదవులు కేటాయించారని వివరించారు. వెట్టిచాకిరీని రద్దు చేశారని పేర్కొన్నారు. స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వాలని కోరేవాడని, శివాజీ అసలైన లౌకికవాది అని వివరించారు. ఆయన ప్రసంగం ఆధారంగా ‘శివాజీ కోన్ హోతా’(శివాజీ అంటే ఎవరు) అనే పుస్తకం వెలువడింది. తొలుత మరాఠీలో వచ్చిన ఆ పుస్తకం ఆ తర్వాత హిందీ, ఇంగ్లీషు, కన్నడ, మలయాళ.. ఇలా అనేక భాషల్లోకి అనువాదమైంది. ఇప్పటికి 1.45 లక్షల కాపీలు అమ్ముడుపోయింది. 2015 ఫిబ్రవరిలో కొందరు దుండగులు ఆయనపై దాడి చేసి చంపేశారు.

ఆ తర్వాత ఎనిమిదేళ్లకు.. అంటే 2023 ఆగస్టు 10న ముంబయిలోని యశ్వంత్‌రావ్ చావన్ కళాశాలలో డా.మృణాళిని అహర్ అనే ప్రొఫెసర్ తన విద్యార్థులకు పాఠం చెప్తూ శివాజీ పేరును ప్రస్తావించారు. అయితే ఆయన్ని ‘ఛత్రపతి’ శివాజీ అని పిలవాలని విద్యార్థులు ఆమెతో వాదించారు. దానికి ఆమె గోవింద్ పన్సారే రాసిన ‘శివాజీ కోన్ హోతా’ పుస్తకం గురించి వివరించారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ విషయం పోలీసులకు చేరడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆ కళాశాలకు లేఖ రాశారు. దానిపై మృణాళిని బొంబాయి హైకోర్టును ఆశ్రయంచారు.

కేసును విచారించిన హైకోర్టు పోలీసుశాఖకు చీవాట్లు వేసింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని, ఒక ప్రొఫెసర్ ఏం మాట్లాడాలో చెప్పడానికి మీరెవరు అని ప్రశ్నించింది. ఆమె ప్రస్తావించిన పుస్తకం చదివారా, కనీసం భారత రాజ్యాంగం అయినా చదివారా అని పోలీసు అధికారులను సూటిగా ప్రశ్నించింది. కాలేజీకి లేఖ రాయడానికి మీకేం అధికారం ఉందని అడిగింది. భావప్రకటన స్వేచ్ఛను కాదనే హక్కు ఎవరికీ లేదని, ఆ లేఖను వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశించింది.