Annamalai: అన్నామలై ఎందుకు ఓడిపోయారు?

సాయి వంశీ ( విశీ):

ఆయనో ఇంటర్‌నెట్ సెన్సేషన్. మాజీ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రంలో కమలదళ అధ్యక్షుడు. ఆయన పేరు చెప్తే యూత్ అంతా ఉర్రూతలూగిపోతారు‌. దక్షిణాదిలో కమలదళానికి బలమైన యువశక్తి. తమిళనేలపై ఆ పార్టీకి ఆయనే వెన్నుదన్ను. అయినా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఎందుకు ఎంపీ కాలేకపోతున్నారు?

ఆయనే అన్నామలై. అన్నామలై కుప్పుసామి. 2024 ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 1.18 లక్షల ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమి ఆయనకు మొదటిసారి కాదు. 2021లో అవరకురచ్చి అసెంబ్లీ స్థానంలోనూ నిలిచి 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. నెట్లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న ఆయన ఎన్నికల్లో మాత్రం వెనుకబడటం చాలామందికి ఆశ్చర్యం. ఈ ఎంపీ ఎన్నికల్లో ఆయన ఓటమి మరోసారి కమలదళానికి షాక్. అందుకు కారణాలేమిటి? ఆయనలో లోపాలు ఏమిటి?

సోషల్ మీడియాలో చాలా శక్తివంతంగా కనిపించే అన్నామలైకి నిజజీవితంలో చాలా బలహీనమైన డెసిషన్ మేకింగ్ ఉంటుందనే విమర్శ ఉంది. ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం పార్టీకి చాలా చేటు చేస్తోందని ఆ పార్టీనేతలే పలుమార్లు విమర్శించారు. ముఖ్యంగా అన్నామలై దూకుడుతనం ఎవరికీ రుచించడం లేదు. పెరియార్, కరుణానిధి, గాంధీ వంటి వారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటమే ఆయన పట్ల తమిళనాడులో ఏహ్యభావాన్ని పెంచుతోందనే విమర్శ ఉంది.

అన్నామలైది నియంతృత్వ ధోరణి అనే మాట కూడా నిరంతరం వినిపిస్తూ ఉంటుంది. ఐపీఎస్ అధికారి హోదాలో చూపించిన దూకుడుతనమే రాజకీయాల్లోనూ చూపిస్తూ, తనకు నచ్చనివారిని పార్టీలో నుంచి తీసేస్తూ, వార్‌ రూం పేరుతో నియంతలా వ్యవహరిస్తారనే పేరుంది ఆయనకు. తాను బాగా చదువుకున్నానని, తనొక అధికార హోదా నుంచి వచ్చాననే కఠిన ధోరణి ఆయనలో ఉంటుందనే మాటా ఉంది. ఇవన్నీ ఆయన్ని సోషల్ మీడియా జనాలకు దగ్గర చేసి, సొంత రాష్ట్ర ప్రజలకు దూరం చేసిందని అంటుంటారు. పైగా అన్నామలై దృష్టి అంతా యువత మీదే ఉంటుంది. వారిని ఉత్తేజపరిస్తే చాలానే ఆలోచన ఆయనది. ఈ నేపథ్యంలో ఇతర వయసుల వారిని ఆయన పట్టించుకోరనే ఆరోపణలున్నాయి.

ఈసారి ఆయన పోటీ చేసిన కోయంబత్తూరు నియోజకవర్గంలో క్రైస్తవ, ముస్లిం ఓటర్లు ఎక్కువ. ఆయన కమలదళం నుంచి అక్కడ పోటీ చేయడం మొదటి లోపంగా మారింది. ఆ ప్రాంతం ఏఐఏడీఏంకేకి కంచుకోట లాంటిది. జనం ఆ పార్టీ నేతనే తమ ఎంపీగా కోరుకున్నారు. ఎన్నికల ముందు ఏఐఏడీఏంకే-కమలదళం పొత్తు కుదిరింది. అక్కడ ఏఐఏడీఎంకే అభ్యర్థి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండేది. అయితే తానే అక్కడ గెలిచి, తన సత్తా చాటుకుందాం అనుకున్న అన్నామలై నిర్ణయం తప్పుగా మారింది. భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడైతే అక్కడ ఆయన పోటీకి దిగారో ముస్లింలు, క్రైస్తవులు, హిందువుల్లో ఇతర వర్గాలన్నీ ఏఐఏడీఏంకేని వదిలేసి నేరుగా డీఏంకే వైపు చూశాయి. మొత్తం ఓట్లు ఒకే వైపు పడ్డాయి.

పైగా ఎన్నికలకు ఒక నెల ముందే అన్నామలై ఈ చోట నుంచి పోటీ చేస్తారనే విషయం నిర్ధారణ అయింది. దీంతో ఆయన పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోయారు. చేసిన చోట్ల అంత బలాన్ని ప్రదర్శించి ఆకట్టుకోలేకపోయారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకేనే తమకు సరైన ప్రతినిధి అని కోయంబత్తూరు ప్రజలు భావించారు. అన్నీ కలిసి అన్నామలైని ఓటమిపాలు చేశాయి. ఆయన తన ధోరణి, దూకుడుతనం మార్చుకోకపోతే పార్టీకి చేటు తప్పదని తమిళనాడు రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.