ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధం ఎందుకు? : నాదెండ్ల మనోహర్

NADENDLAMANOHAR:  ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. విశాఖపట్నం నగర వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసి వేసి, ప్రజలకు లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం ఇంత నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషాలు ఉండటంతో టైకూన్ కూడలి మూసివేశారు. దీనిపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సోమవారం ఉదయం కూడలి వద్దకు బయలుదేరిన నాదెండ్ల మనోహర్ ని నోవాటెల్ హోటల్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఆనంతరం అరెస్టు చేశారు.
ఉదయం 9 గంటలకే హోటల్ వద్దకు చేరుకొని కనీసం రూమ్ నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ మూర్తి ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్సైలతో భారీగా పోలీస్ బందోబస్తు హోటల్ వద్దకు చేరుకుంది. రూమ్ నుంచి బయటకు రావద్దంటూ పోలీసులు అడ్డుకోవడంతో వారికి ప్రజలకు ఉన్న ఇబ్బందులు వివరిస్తూనే  మనోహర్  హోటల్ కిందికి వచ్చారు.


ఆదేశాలు వచ్చాయి… వెళ్లనీయం: విశాఖ పోలీసులు
అక్కడ మరోసారి  మనోహర్ తోపాటు పార్టీ నాయకులను బయటకు వెళ్ళనీయకుండా గేట్లు వేసి మరీ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి బయటకు వెళ్లేందుకు వీల్లేదు అంటూ అడ్డుకున్నారు. శాంతియుతంగా, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఫుట్ పాత్ మీద అయినా కనీసం ప్రజా సమస్యపై నిరసన తెలుపుతామని  మనోహర్ .. అసిస్టెంట్ కమిషనర్ కు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఉన్నతాధికారులు, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాము ఏమీ చేయలేమని శాంతియుతంగా కూడా నిరసన తెలపవద్దని పోలీసులు చెప్పడంతో అయన  అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.


శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా:  నాదెండ్ల 
ఈ సందర్భంగా  నాదెండ్ల  మాట్లాడుతూ “ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదు అని ప్రభుత్వం ఆంక్షలు విధించడం అత్యంత దారుణం. ఎంపీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వ్యవస్థలను ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉపయోగించుకుంటుందో అర్థమవుతుంది. ఎంపీ ప్రైవేట్ వెంచర్ ను కాపాడేందుకు అన్ని విధాలా ఆరాటపడుతున్నారు. విశాఖలోని లక్షలాది మందికి ఎంతో అవసరమైన కూడలిని మూసివేసి, రెండు కిలోమీటర్ల దూరం పెంచి చుట్టూ తిరిగి రావాలనేలా ప్రజల సమయంతో ప్రభుత్వ పెద్దలు ఆటలాడుతున్నారు. ఎంపీ నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వాస్తు దోషం వస్తే పూర్తిగా ఆ రోడ్డునే మూసి వేయడం ఈ ప్రభుత్వ నియంత విధానానికి ప్రత్యక్ష తార్కాణం. ఇప్పటికే జనసేన పార్టీ ఈ సమస్యపై నాలుగుసార్లు నిరసన తెలిపినా అధికారుల నుంచి ఏ మాత్రం స్పందన రాలేదు. వినతి పత్రాలు ఇచ్చినా చలనం లేదు. ప్రజా సమస్యలపై పోరాడితే అడ్డుకోమని పోలీసులతో చెప్పింది ఎవరు..? విశాఖపట్నం వచ్చిన ప్రతిసారీ పోలీసులతో నిర్బంధకాండ కొనసాగిస్తున్న ప్రభుత్వం తన అప్రజాస్వామిక పంథా వీడే వరకు పోరాటం చేస్తాం. రోడ్డుపై నిలుచుని శాంతియుతంగా ఐదు నిమిషాలు నిరసన తెలిపే హక్కు కూడా లేకపోతే ఇంక ప్రజాస్వామ్యం ఎందుకు..? మూడు నెలల్లో మారిపోయే ఈ ప్రభుత్వం మాటలను వినాల్సిన అవసరం లేదు అని అధికారులు కూడా గుర్తుంచుకోవాలి. టైకూన్ కూడలి సమస్య తీరే వరకు జనసేన పార్టీ చివరి వరకు పోరాడుతుందని మనోహర్  అన్నారు.