Nancharaiah Merugumala:(Editor)
సాయిబాబా వికలాంగుడని విడుదల కోరితే ఈ నేరాలకు మెదడు ముఖ్యమన్న బెంచీ
……………………………………………………………………….
దిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్ గోకరకొండ నాగ (జీఎన్) సాయిబాబా, మరో అయిదుగురు ఇతరులకు మావోయిస్టులతో సంబంధం ఉందనే కేసులో వారు నిర్దోషులని బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శనివారం స్టే విధించింది. నేడు కోర్టుకు సెలవు రోజైనా ఇది చాలా అత్యవసర ప్రాధాన్యమున్న కేసని భావించింది అత్యున్నత న్యాయస్థానం. 8 సంవత్సరాలుగా నాగపూర్ ‘అండా సెల్’ లో నిర్బంధంలో ఉన్న సాయిబాబా పోలియో వల్ల శారీరకంగా వికలాంగుడు. ఆయన, మిగిలిన నిందితులు నిర్దోషులని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇంత అర్జెంటుగా విచారించి ఆ తీర్పు అమలు నిలిపివేస్తూ సాయిబాబా విడుదలకు బ్రేక్ వేయడం బాధాకరం. ఇది భారత న్యాయవ్యవస్థపై సామాన్యులకు విశ్వాసాన్ని పెంచకపోగా, అసలు లేకుండా చేసే ప్రక్రియ ఆరంభం కావడానికి దోహదం చేస్తుంది.
ఇక ఈ స్టే ఉత్తర్వు ఇచ్చిన సుప్రీం కోర్టు బెంచీలోని ఇద్దరు జడ్జీలూ జస్టిస్ ఎం.ఆర్.షా, బేలా ఎం. త్రివేదీ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. వారు వరుసగా వైశ్య, బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మించారు. గుజరాత్ హైకోర్టులో తొలుత అడిషనల్ జడ్జీలుగా పనిచేసి ప్రమోషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యారు. గొప్ప ప్రధానమంత్రిని, కేంద్ర హోం మంత్రిని దేశానికి ప్రసాదించిన గుజరాత్ కు చెందిన న్యాయకోవిదులు తర్వాత ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారో చూడాలి.
గుజరాతీ వైశ్య, బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టి న్యాయశాస్త్రం చదివి న్యాయమూర్తులైన వారు చివరికి న్యాయమైన తీర్పులే చెబుతారని 140 కోట్ల భారతీయులు నమ్ముతున్నారు. మరి, వారి విశ్వాసం ఏమవుతుందో? ‘‘ నా క్లయింటు సాయిబాబా 90 శాతం వికలాంగుడు. అనేక రుగ్మతలతో బాధపడుతున్నాడు. వీల్ చైర్ లోనే ఉంటాడు. ఈ కారణాల దృష్ట్యా సాయిబాబాను నాగపూర్ జైలు నుంచి విడుదల చేసి కనీసం గృహనిర్బంధంలోనైనా ఉంచడానికి అనుమతించాలి,’’ అని సాయిబాబా తరఫు లాయర్ బసంత్ ఈ ఇద్దరు జడ్జీల బెంచికి విన్నవించారు. అయితే, ‘‘తీవ్ర నేరాలు చేసినట్టు వచ్చిన ఆరోపణలపై సాయిబాబాపై విచారణ జరిపి శిక్ష విధించారు. ఉగ్రవాదం, నక్సలైట్ కార్యకలాపాలకు ఏ ఇతర శారీరక అవయవాల కన్నా మెదడు వినియోగం ఎక్కువ అవసరం,’’ అంటూ జస్టిస్‌లు షా, త్రివేదీ వ్యాఖ్యానించారు. ఈ న్యాయమూర్తుల మాటలను బట్టి చూస్తే గుజరాతీలందరూ మహాత్మా గాంధీలా ఉండరనిపిస్తోంది.