తుఫాన్ హెచ్చరిక !

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది పోర్ట్‌బ్లెయిర్‌కి ఉత్తర వాయువ్యదిశగా 590 కి.మీ, పారాదీప్‌కి దక్షిణ ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం అర్థరాత్రికి తీవ్ర వాయుగుండమై, సోమవారం మరింత బలపడి తుపానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు ప్రకటించారు. ఈ నెల 26 సాయంత్రానికి ఇది ఉత్తర ఒడిశాలోని పారాదీప్‌, పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాన్ కు యాస్ గా పిలవడం జరుగుతోంది.

యాస్ ‘ అంటే..?‘యాస్‌’ అనే పేరును ఒమన్‌ దేశం సూచించింది. అక్కడి భాషలో దీనికి మల్లె పువ్వు అని అర్థం.

వాయుగుండం కారణంగా ఇప్పటికే అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25-27 మధ్య ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కింలోని పలు జిల్లాల్లో అదే స్థాయిలో వర్షాలు కురవనున్నాయి.క్రమంగా పెరగనున్న గాలుల తీవ్రతసోమవారానికి మధ్య బంగాళాఖాతంలో గంటకు 65 కి.మీ నుంచి 85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 26 మధ్యాహ్నం నుంచి తుపాను తీరం దాటేదాకా గంటకు 90-110 కి.మీ వేగంతో, తీరం దాటేటప్పుడు 155-165 నుంచి 185 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఆయా తేదీల్లో మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా, అసాధారణంగా మారుతుందని తెలిపారు. సోమవారం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో అలలు 1-2 మీటర్ల వరకూ ఎగసిపడతాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

మోడీ ఉన్నతస్థాయి సమీక్ష..

‘యాస్‌’ తుపాను విరుచుకుపడనున్న నేపథ్యంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, తీర ప్రాంతాల్లో ముప్పున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌-19 సోకి చికిత్స పొందుతున్న వారికి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సన్నద్ధంగా ఉందాం: ఎన్డీఆర్‌ఎఫ్‌
ఎన్డీఆర్‌ఎఫ్‌తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉందామని ‘జాతీయ విపత్తు ఉపశమన దళం'(ఎన్డీఆర్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ పశ్చిమబెంగాల్‌, ఒడిశా ప్రభుత్వాల అధికారులకు పిలుపునిచ్చారు. ఎలాంటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కొని ముందుగానే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *