ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!

ప్రకాశ జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ లో 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 13 ఏళ్ల క్రితం ఏడుగురు డ్రైవర్లునుు.. క్లీనర్లు ను హత్య చేసిన కేసులో నిరూపితం కావడంతో మున్నా టీమ్ సభ్యులందరికీ మరణదండన విధించింది.

నేరాలు వెలుగులోకి వచ్చాయిలా..

పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి 21.7 టన్నుల ఇనుప రాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారంటూ 2008 అక్టోబర్‌ 17న లారీ యజమాని వీరప్పన్‌ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై నిఘా పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సయ్యద్‌ అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా కోసం గాలింపు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్‌ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు యత్నించిన మున్నాను కర్ణాటకలోని ఒక మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో అరెస్టు చేసి ఒంగోలుకు తీసుకువచ్చారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఇస్లాం పేటలో నివాసముండే మున్నా పదో తరగతివరకు చదువుకున్నాడు. ఇతనికి భార్యతో పాటు ముగ్గురు సంతానం. 2012 అక్టోబర్‌లో ఒంగోలు సబ్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొంతకాలం జీవనం సాగించాడు.

మున్నా నేరాల చిట్టా…

2002 సంవత్సరంలో కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జంట హత్య కేసులో నిందితుడు.

2003లో ఒక వ్యక్తిని మోసం చేసి బంగారం చోరీ చేసిన కేసులో నిందితుడు

2004లో తెనాలి దగ్గర దుగ్గిరాలలో ముగ్గురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు

2006లో రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల కేసులో నిందితుడు

2008లో ఒంగోలు చుట్టు పక్కల తిరుగుతున్న ఐరన్ ఓర్ లారీ ఓనర్లు, క్లీనర్లను హత్య చేసిన కేసులో ముద్దాయి

ఒంగోలు తాలుకా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరాయ కొండ, నల్గొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై అనేక కేసులు ఉన్నాయి.