Teluguliterature:
ఆ.వె :
శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి
మ్రొక్కవలదు వెర్రి మూఢులార!
యుల్లమందు బ్రహ్మముండుట తెలియర
విశ్వదాభిరామ వినుర వేమ!
అంటాడు యోగి వేమన.
అభిమానించే దైవం మదిలోనే ఉంటాడని, ఉండాలని ఓ లెక్క! నమ్మకమే ఉంటే…. దేవుడెక్కడ లేడు చెప్పండి? ఇదీ హేతువు!
ఇదంతా విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం. మనది ప్రధానంగా విశ్వాసాల మీద ఆధారపడిన జీవన వ్యవస్థ. మనిషిలోని ఈ బలహీనతను సొమ్ము చేసుకునే వ్యాపార ప్రక్రియలు ఇతర అన్ని వ్యవస్థల్లోకి వచ్చినట్టే ‘భక్తి-దైవం’ విషయంలోకీ వచ్చాయి. కట్టడి లేక పెచ్చుమీరుతున్నాయి. అందుకే, దశాబ్దాల కిందటే గజ్జెల మల్లారెడ్డి ఓ మాట…. ‘తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్ గా మారుతోంది’ అన్నారు. అదే క్రమంలో అది ముదిరి పాకానపడింది. ఇవాళ మన చుట్టూ ‘దేవుడు’ ఓ పేద్ద మార్కెట్ వస్తువు. దాని చుట్టూ ఎన్నెన్నో అరిష్టాలు అల్లుకుంటున్నాయి. తెలియని ఈ మాయలో పడి జనం మూఢంగా కొట్టుకుపోతున్నారు. ఉత్తరద్వార దర్శనమంటూ అంతటి వేలంవెర్రి ఎందుకు జనాలకి? తొక్కిసలాటలో నలిగి చచ్చిపోయేటంత! ప్రాణాలను సైతం పణంగా పెట్టేంతగా వికటించింది. నిర్వహణ లోపాలున్నాయి. ఆ తప్పుల్ని ప్రశ్నించాల్సిందే! బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందే! కానీ, మన వేలంవెర్రి గురించీ ఆలోచించాలి. ఆధ్యాత్మిక భక్తి భావన కన్నా ఎన్నో రెట్లు పెరిగిపోయిన పాపభీతి, చేసిన/చేయబోయే తప్పిదాలకు విరుగుడు ఆశించి తర్వాతో, ముందుగానేనో దేవునికి ముడుపులు చెల్లించుకునే క్విడ్-ప్రో-కో పద్దతి ఆందోళన కలిగిస్తోంది! ఆ దేవుడి కంటే ఈ దేవుడు గొప్ప, అక్కడి కంటే ఇక్కడ మహిమ ఎక్కువ, ఇక్కడే మోక్షం సిద్దిస్తుంది, ఏం చేశైనా…ఈ ద్వారం గుండా వెళ్లి దేవుడిని దర్శించుకుంటేనే మనకు పరువు, ప్రతిష్ట అనుకునే తలంపు తప్పు!
ప్రచారంలో ఉన్న ఓ కథ ప్రకారం సిక్కుల గురువైన మహనీయుడు గురునానక్ ఒకసారి మక్కా వెళ్లారు. విశ్రాంతి కోసం ఆయన పడుకున్నపుడు….. ‘తమరి కాళ్లు పవిత్ర సమాధి-దైవం వైపున్నాయి, అది తప్పు, దైవాన్ని అవమానించినట్టవుతుంది. అటువైపు నుంచి తీసి కాళ్లు మరోవైపు పెట్టుకోండి’ అని చెప్పారట. ఆయన ఎంతో వినయంగా…. ‘మీరే చెప్పండి, దైవం లేనిది ఎటువైపో, నేను కాళ్లు అటువైపే పెట్టుకుంటానూ’అని. నివ్వెరపోవడం వారి వంతైంది. మహా భక్త శిఖామణి అయిన ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపునితో చెప్పినట్టు పోతన నుడివిన పద్యం గుర్తుంది కద!
కం
‘ఇందుగలడందు లేడను
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదికిఁ జూసిన
యందందేగలడు దానవాగ్రణి వింటేన్!’
అని తత్వం బోధించాడు. అయితే, ఒక షరతు విధించాడు. ‘వింటేన్’ అన్నాడు. వినాలి కద? వినని వాడికి ఏం చెబుతాం! చెబితే మాత్రం ఏం వింటాడు? అదొక వృధా ప్రయాసే అవుతుందే తప్ప ఫలితమేమి?
అన్నింటిలోనూ ఉన్న, ఉందగల సమర్థుడూ, సర్వాంతర్యామి అయిన భగవంతుడు మనలోనూ ఉంటాడు కద! ఆ ఆత్మజ్ఞానమే ముఖ్యం. ‘అహం బ్రహ్మస్మిః’ అన్నారు. స్థూలార్థంలో పరమాత్మ జీవాత్మ ఒకటే అంటూ, అద్వైత సిద్దాంతం బోధించేదదే! బయటి ఆకాశం (పరమాత్మ), ఇంటిలోని అంగడం లోంచి చూస్తే కనిపించే ఆకాశం (జీవాత్మ) చూడటానికి వేర్వేరనిపించినా…. వాస్తవంలో రెండూ ఒకటే! దీని ఆధారంగానే ‘దేవ-దేహ-జీవ’ సిద్దాంతం వెలిసిందేమో!?
శ్లో :
“దేహో దేవాలయః ప్రోక్తః
జీవో దేవ స్సనాతనః
త్యజేదజ్ఞాన నిర్మాల్యం
సోఽహం భావేన పూజయేత్”
అన్నారు.
దేహమే దేవాలయం. జీవుడే సనాతన దైవం. ఇతరేతర అజ్ఞానం తొలగించుకొని, ‘ఆ పరమాత్మయే నేను’ అనే నిర్మల చిత్తంతో పూజిస్తే, ‘సోహం బ్రహ్మ’ అనే అద్వైత సిద్ది కలుగుతుంది.
ఒక మూర్తిని ఆకరం చేసుకొని, దాని కేంద్రకంగా పూజో, ప్రార్థనో, ధ్యానమో చేస్తేనే తమకు ఏకాగ్రత కుదురుతుందనే వారు కొందరు. వారి వారి అభీష్టాల్ని బట్టి వేర్వేరు దేవుళ్లు/దేవతల్ని మొక్కడాలను, విగ్రహారాధనను సమర్థించే వారూ ఉంటారు. అంతమాత్రాన దాన్ని నేరుగా తప్పుపట్టడానికి లేదు. వారికి ముప్పు లేనంత దాకా, ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకు…. వారి వారి నమ్మకాలు, విశ్వాసాల పట్ల ఇతరులెవరికీ అభ్యంతరాలు ఉండవలసిన పని లేదు, ఆ అవసరమూ లేదు. కానీ, ఒకరి చర్యలు…. ఇతరుల విశ్వాసాలకు భంగకరంగానో, ఒరులకు ఇబ్బంది కలిగిస్తేనో, వారికే ప్రమాదకరంగా మారితేనో అది అభ్యంతరకరమే! దాన్ని నిశితంగా ఖండించాల్సి వస్తుంది. తప్పుని తప్పని నొక్కి చెప్పాల్సి వస్తుంది. నేను అటువంటి ప్రయత్నమే చేశాను, చేస్తున్నాను, చేస్తాను.
భయమైనా, భక్తయినా…. ఆచారమైనా, ఆధ్యాత్మికతైనా …. మతమైనా, మరొకటైనా…. పరిమితుల్లో ఉంటేనే పసందు. హేతుబద్దమైతేనే మేలు. చెలియలికట్ట దాటితే… ఏదైనా చెరుపే! తస్మాత్ జాగ్రత్త!!