న‌కిరేక‌ల్ లో ఢీ అంటే ఢీ అంటున్న ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యే.. ఆశ‌తో క‌మ‌ల‌నాథులు..

తెలంగాణ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం న‌కిరేక‌ల్ లో రాజ‌కీయం వాడీ వేడిగా న‌డుస్తోంది. అధికార బిఆర్ఎస్ పార్టీ  ఎమ్మెల్యే – మాజీ ఎమ్మెల్యే  మ‌ధ్య వ‌ర్గ పోరు తీవ్ర స్థాయికి చేరింది. రెండు వ‌ర్గాల నేత‌లు టికెట్ త‌మ నాయ‌కుడికే వ‌స్తుదంటూ సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మ‌రోవైపు బిఆర్ ఎస్ – వామ‌ప‌క్షాల పొత్తు క‌న్వ‌ర్ఫ్మ్ కావ‌డంతో ..ఈసీటు వారి ఖాతాలోకి వెళ్తుంద‌న్న ప్రచారం జ‌రుగుతుంది. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎవ‌ర‌న్న‌దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా  న‌కిరేక‌ల్ రాజ‌కీయం రంజుగా మారింది. ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య‌- మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ప‌రిస్థితి త‌యారైంది. ఈసారి టికెట్ త‌మ నేత‌కు వ‌స్తుందంటూ.. రెండు వ‌ర్గాల నేత‌లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శ‌లు చేసుకుంటున్నారు. అధిష్టానం ఆశీస్సులు త‌న‌కే ఉన్నాయ‌ని.. టికెట్ విష‌యంలో ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేద‌ని.. మ‌రోసారి ఎమ్మెల్యేగా గెల‌వ‌డం ఖాయ‌మ‌ని చిరుమ‌ర్తి ధీమాతో క‌నిపిస్తున్నారు. మ‌రోవైపు ఈ సారి సిటింగ్‌లకే టికెట్‌ అని కేసిఆర్‌ ప్రకటనపై వీరేశం అసంతృప్తితో ఉన్న‌ప్ప‌టికి.. ఎమ్మెల్యేపై ఉన్న‌ అవినీతి ఆరోప‌ణ‌లు.. అన్ని సర్వేలు అనుకూలంగా ఉండ‌టం.. త‌న‌కూ క‌లిసొస్తుంద‌ని ఆయ‌న‌ భావిస్తున్నారు. ఒక‌వేళ పార్టీ టికెట్ రాకుంటే.. ఏపార్టీ నుంచి పోటిచేసినా.. గెలుపు త‌మ నాయ‌కుడిదే అంటున్నారు వీరేశం అనుచ‌రులు.

ఇక మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌కు తమతో పొత్తు తప్పదని భావిస్తున్న వామపక్షాలు ఇక్కడి నుండి పోటిచేసేందుకు సుముఖంగా ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈనియోజ‌క‌వ‌ర్గంలో దివంగ‌త  న‌ర్రారాఘ‌వ‌రెడ్డి, నోముల నర్సింహయ్య సుధీర్ఘ కాలం ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. ఇప్ప‌టికి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి ప‌ట్టుండ‌టంతో .. సీనియ‌ర్ నేతను బ‌రిలోకి దింపాల‌ని వామ‌ప‌క్షాలు భావిస్తున్నాయి.

ప్ర‌తిప‌క్షాల విషయానికొస్తే ఉద్య‌మ‌కారులు సీనియ‌ర్ నేత‌ చెరుకు సుధాకర్‌ తన భార్యను కాంగ్రెస్ నుంచి పోటిచేయించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు . కాంగ్రెస్ పార్టీ హామీ మేర‌కే పార్టీలో చేరారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మాజీ ఎంపీపీ చామల శ్రీనివాస్‌, దైద రవీందర్‌, కొండేటి మల్లయ్య సైతం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి వర్గీయుడైన కొండేటి మల్లయ్య నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, ఆయన నాగార్జున సాగర్‌కు చెందిన నేత, స్థానికేతరుడని స్థానిక పార్టీ కార్యకర్తలు దూరం పెడుతున్నారు.

బండి సంజ‌య్ పాద‌యాత్ర‌తో న‌కిరేక‌ల్ లో బీజేపీ బ‌లం బాగా పెరిగింది. క్యాడ‌ర్ సైతం పార్టీ కార్య‌క్ర‌మాల‌తో జోష్ లో క‌నిపిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం..బీజేపీ లో చేర‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా.. పార్టీ బ‌లం తోడైతే ఎమ్మెల్యేగా గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అన్న‌ది కాషాయం నేత‌ల వాద‌న‌గా వినిపిస్తోంది.

మొత్తంగా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో న‌కిరేక‌ల్ లో పార్టీల‌కు అతీతంగా ఎమ్మెల్యే చిరుమ‌ర్తి – మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Optimized by Optimole