Nalgonda: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షి టీమ్ ఆధ్వర్యంలో 3.2కె రన్ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎస్పీ అపూర్వ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని కోరారు. ప్రతిఏటా మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు పట్టం కట్టే ఒక సరికొత్త థీమ్ మహిళల గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు.గతేడాది వివక్షను బద్దలు కొట్టి లింగసమానత్వాన్ని పెంపొందించండి అనే థీమ్ నిర్వహిస్తే.. ఈ సంవత్సరం లింగ సమానత్వం.. ప్రతి చోట మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడాన్ని ప్రచార థీమ్ గా నిర్ణయించారని ఎస్పీ స్పష్టం చేశారు.
మహిళలు పట్టుదలతో కృషి చేస్తే సాదించలేనిది ఏది లేదంటూ హితువు పలికారు అపూర్వ రావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కొరకు జిల్లా లో షి టీమ్ , భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆకతాయిలు ఇబ్బందులు పెడితే మహిళలు దైర్యంగా షి టీమ్ బృందాలకు లేదా డైయల్ 100 , సంబంధిత పోలీస్ స్టేషన్ కి సమాచారం అందిస్తే వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ అపూర్వ రావు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, ఎస్ ఐ, ఆర్.ఐ బృందంతో పాటు మహిళా అధికారులు పోలీస్ కళా బృందం, సిబ్బంది, బాలికలు పాల్గొన్నారు.