TSPSC పేపర్ లీకేజ్.. తప్పు ఏవరిది?ప్రభుత్వానికి సంబంధం లేదా?
నేను పెయింటర్ గా పనిచేస్తున్నా.. నాకు ఇద్దరు అమ్మాయిలు.. నెల సంపాదన రూ .25 వేలు. నా పెద్ద కూతురు పీజీ చదివింది. కాంపిటేటివ్ పరీక్షల కోసం గత రెండేళ్లుగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పటివరకు ఆమె చదువు కోసం మూడు లక్షలు ఖర్చు చేశా. గ్రూప్ -1 ప్రిలిమ్స్ క్వాలిఫై కావడంతో మెయిన్స్ ప్రిపేర్ అవుతోంది. ఇప్పుడు ఉన్నట్టుండి పేపర్ లీకేజ్ కారణంగా పరీక్ష రద్దు చేయడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదు.
– ఓకూతురి తండ్రి ఆవేదన ( జడ్చర్ల)
నేను ప్రభుత్వ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను. మేము ఇద్దరు అన్నదమ్ములం. మాతండ్రి చేనేత కార్మికుడు .తమ్ముడు మూడేళ్లుగా సర్వేయర్ జాబ్ చేస్తున్నాడు.ఏఈఈ నోటిఫికేషన్ విడుదలవడంతో..ఉద్యోగానికి సెలవు పెట్టి ఎనిమిది నెలలుగా రేయింబవళ్లు కష్టపడి చదివాడు. పరీక్ష బాగా రాశాడు. ఖచ్చితంగా జాబ్ వస్తుందని ధీమాతో చెప్పాడు. ఇప్పుడు పేపర్ లీకేజ్ కారణంగా పరీక్ష రద్దు చేయడంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు.
– ఉదయ్ కుమార్( బ్యాంక్ మేనేజర్)
తెలంగాణ వ్యాప్తంగా ఇదే తంతు. నిరుద్యోగ యువత కుటుంబీకులను కదిలిస్తే చాలు..కన్నీటి గాథలే. యువత సంగతి సరేసరి. రేయింబవళ్లు తిండితినక.. కుటుంబాలకు దూరంగా ఉంటూ భవిష్యత్ బెంగతో పుస్తకాలు కుస్తీపడుతున్న తమ జీవితాలు ఆగమ్యగోచరంగా తయారయ్యాయి అంటూ వాపోతున్న యువత ఆవేదన వింటే గుండెబరువెక్కుతుంది. ప్రభుత్వం మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని, మెటిరియల్ సదుపాయం, భోజన వసతి ఏర్పాటు చేస్తామని చెబుతున్నా.. ఆత్మవిశ్వాసం సన్నగిల్లడంతో యువత ప్రభుత్వ ప్రతిపాదనను మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందా? మరోసారి పరీక్షలకు సిద్ధమవుతారా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.
తప్పు ఎవరిది?
ఇద్దరు వ్యక్తులు తప్పు చేస్తే వ్యవస్థకు అపాదిస్తారా? TSPSC పేపర్ లీకేజ్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన సంస్థకు ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటూ సంస్థ మాజీ చైర్మన్ ట్విట్టర్ వేదికగా చేసిన ట్విట్ సారాంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి వారు తప్పును సమర్థించుకున్నా.. లక్షల మంది తెలంగాణ యువత భవిష్యత్ కి సంబంధించిన విషయంలో వీరు వ్యవహరించిన తీరు సరికాదని మేధావి వర్గం తిట్టిపోస్తోంది. నాయకుడు అనేవాడు క్లిష్టసమయంలో యువతకు భరోసా కల్పించాల్సింది పోయి..తప్పును కప్పిపుచ్చు కోవడం ఏంటని? ప్రతిపక్ష నేతలు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.
మంత్రి ఇలాగేనా మాట్లాడేది?
పెట్టుబడుల సంస్థలు రాష్ట్రానికి కుప్పలు తెప్పులుగా వస్తున్నాయని ఐటీ( ఇన్వర్మేషన్ టెక్నాలాజీ) బాగా అభివృద్ధి చెందిందని..పొద్దునలేస్తే గొప్పలు చెప్పే ఐటీ మంత్రి.. పేపర్ లీకేజీ విషయంలో మాట్లాడిన మాటలు ఆమోదయోగ్యంగా లేవని సోషల్ మీడియా వేదికగా యువత మండిపడుతోంది. లక్షల మంది యువత భవిష్యత్ ప్రమాదంలో ఉంటే .. ప్రతి కంప్యూటర్ లో ఏంజరుగుతుందో తనకే తెల్సుతుందని మంత్రి మాట్లాడిన మాటలను ఊటంకిస్తూ.. మంత్రి నిర్లక్ష వైఖరికి నిదర్శనం క్యాప్షన్ తో వీడియోనూ వైరల్ చేస్తున్నారు.
మొత్తంగా పేపర్ లీకేజ్ వ్యవహరంతో తెలంగాణ యువత తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ప్రభుత్వం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నా.. ఆత్మవిశ్వాసం సన్నగిల్లడంతో యువతలో మాత్రం పాజిటివ్ దృక్పథం కనిపించడం లేదు.