తమిళ చిత్రం బిచ్చగాడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హీరో విజయ్ ఆంటోనికి ఆచిత్రంతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో తన సినిమాలను తెలుగులో విడుదల చేయడం ప్రారంభించాడు. తాజాగా అతను నటించిన బిచ్చగాడు- 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈమూవీ.. బిచ్చగాడు లాంటి ల్యాండ్ మార్క్ హిట్ ను సొంతం చేసుకుందా! లేదా? అన్నది సమీక్షలో తెలుసుకుందాం!
కథ…
దేశంలోని టాప్ -10 సంపనుల జాబితాలో ఒకరు వి.జి.గ్రూప్ వ్యాపార సంస్థల అధిపతి విజయ్ గురుమూర్తి(విజయ్ ఆంటోని). అతని ఆస్తిని కొట్టేయాలని స్నేహితుడు అరవింద్(దేవ్ గిల్) మరికొంతమంది మిత్రులతో కలిసి కుట్రపన్నుతాడు. మరోవైపు బిచ్చగాడైన సత్య(విజయ్ ఆంటోని) చిన్నప్పుడు తప్పిపోయిన చెల్లి కోసం వెతుకుతుంటాడు. అనేక నాటకీయ పరిణామాల మధ్య విజయ్ గురుమూర్తి ప్లేస్ లోకి సత్య వస్తాడు. ఈక్రమంలోనే అరవింద్ కుట్రకు బలైపోతాడు. ఆతర్వాత ఏజరిగిందన్నది తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే..!
ఎలా ఉందంటే..
బిచ్చగాడు-2 చిత్రం ఆద్యంతం చెల్లి సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ విషయానికొస్తే.. సినిమా ఆరంభంలో వచ్చే బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్, సర్జరీ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ వరకు ఏంజరుగుతుందా అనే క్యూరియాసిటిని బాగా మెయింటెన్ చేశారు. కానీ సెకాండాఫ్ వచ్చేసరికి కథ పూర్తిగా గాడి తప్పుతుంది. సామాజిక సేవ అంటూ హీరో ‘యాంటి బికిలీ ‘మాల్ ను ప్రారంభించడం.. దాని కోసం ఓ భారీ సభ ఏర్పాటు చేసి సుధీర్ఘ ప్రసంగం ఇవ్వడం వంటి సన్నివేశాలు చిరాకు తెప్పిస్తాయి. దీంతో అసలు కథ పక్కకు వెళ్తుంది. మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కొంతమేర ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ సీన్స్ మనసును హత్తుకుంటాయి.
ఎవరెలా చేశారంటే?
విజయ్ ఆంటోని రెండు పాత్రల్లో చక్కగా నటించి మెప్పించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో గా సినిమా నడిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్స్ తో కంటితడిపెట్టించాడు. హీరోయిన్ కావ్య థాపర్ హొమ్లీ లుక్స్ తో అందంగా కనిపించింది. నటన పరంగా ఉన్నంతలో బాగానే నటించింది. కీలకపాత్రలో నటించిన దేవ్ గిల్ సినిమాకు మేజర్ ఎసెట్. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక పనితీరు..
దర్శకుడిగా విజయ్ ఆంటోని చెప్పాలనుకున్న కథను తెరపై ప్రజెంట్ చేయడంలో కొంత మేర విజయం సాధించారు. యాక్షన్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ను బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు కొంత తడపడ్డాడు.మ్యూజిక్ పరంగా ఓకే అనిపిస్తుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా బిచ్చగాడు-2 ‘ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ‘
రివ్యూ: 3/5
(సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)