Janasena: ‘రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా 225 ఫైల్స్ మీద సీఎం డిజిటల్ సంతకాలు ఆయన పేషీలోనే ఫోర్జరీ అయ్యాయి అనే వార్తలు ఆందోళన కలిగిస్తోందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అసలు సీఎం పేషీలోకి వచ్చే ఫైల్స్ చాలా కీలకంగా ఉంటాయి.. అలాంటి ఫైల్స్ మీద సీఎంకే తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేశారు అంటే వెనక ఏదో తతంగం ఉండే ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలా చేసింది ఎవరు..? ఫోర్జరీ చేసిన ఫైల్స్ ఏమిటి? రెవెన్యూ శాఖకు సంబంధించినవా.. గనులు శాఖవా? బదిలీలు, నియామకాలకు చెందినవా? ఇంకా ఇతర ముఖ్య ఫైల్స్ దీనిలో ఉన్నాయా..? అనేది అంతు పట్టకుండా ఉందన్నారు. సీఎం పేషీలో ఇంత పెద్ద తప్పు జరిగినా విషయం బయటకు పొక్కకుండా ఎందుకు అంత రహస్యంగా ఉంచుతున్నారు..? దీని వెనుక ఉన్న శక్తులు.. వ్యక్తులను ఎవరు?? వారిని వెనకేసుకొస్తుంది ఎవరు?? ఏ ఫైల్స్ విషయంలో తప్పు జరిగిందో వెంటనే సీఎంఓ ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం ఉదయం గుంటూరు నగర పార్టీ కార్యాలయంలో నాదెండ్ల విలేకరులతో మాట్లాడారు. సాక్షాత్తు తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఫైల్స్ కే రక్షణ లేకుండా పోతే వాలంటీర్లు సేకరిస్తున్న సామాన్యుడి కీలకమైన సమాచారానికి భద్రత ఎక్కడుంటుందని ప్రశ్నించారు. 360 డిగ్రీల సమాచారం సేకరణ పేరుతో ప్రజల వ్యక్తిగత అంశాలు, అత్యంత సున్నితమైన అంశాలను సైతం వాలంటీర్లు తీసుకుంటున్నారని.. ఆ సమాచారం అంతా ఎవరు సేకరిస్తున్నారు.. ఎక్కడికి వెళ్తుంది… ఆ సమాచారంతో ఏం చేయబోతున్నారు? అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పకుండా ఆయన మీద వ్యక్తిగతంగా మంత్రులు మాట్లాడడానికే ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే ఈ ప్రభుత్వం అసలు విషయాన్నీ కావాలనే పక్కదారి పట్టిస్తోందని అర్థమవుతోందన్నారు. ప్రజలకు సంబంధించిన కీలకమైన అంశాలు, సమాచారం ప్రైవేటు ఏజెన్సీల వద్దకు ఎందుకు ఉంటోందని నిలదీశారు. హైదరాబాదులోని నానక్ రాంగూడ కేంద్రంగా ఉన్న కార్యాలయంలో ఏం జరుగుతుందో ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని..ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే డిజిటల్ దొంగతనం జరిగితే, దాన్ని కూడా తొక్కిపెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత శోచనీయమని విచారణ వ్యక్తం చేశారు. ఓ ప్రభుత్వాన్ని నడిపించే పెద్దదిక్కు లాంటి ముఖ్యమంత్రి సంతకానికే రక్షణ లేకపోతే.. సామాన్యుడు ఈ ప్రభుత్వం లో బతుకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని మనోహర్ అభిప్రాయపడ్డారు.
ఆర్థిక శాఖ ఉద్యోగులను సస్పెండ్ చేశారు.. మరి ఇప్పుడు..?
నియంత మాదిరి వ్యవహరించే ముఖ్యమంత్రి తన కార్యాలయంలో జరిగిన విషయాన్ని దాచిపెట్టడం చూస్తే, ఏదో పెద్ద తప్పే జరిగింది అని అర్థమవుతుందని మనోహర్ సందేహం వ్యక్తం చేశారు. అన్ని దాపరికం, అంతా దాపరికం అన్నట్లు సాగుతున్న వైసీపీ పాలనలో బటన్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో?ఎలా అప్పులు చేస్తున్నారో? పత్రికల్లో వార్తలు వస్తే అప్పటికప్పుడు ముగ్గురు నలుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారని..మరి ముఖ్యమంత్రి డిజిటల్ సంతకం పక్కదారి పట్టి , భారీగా ఫైల్స్ బైటికి వెళ్లి పోయినా ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడం చూస్తే దాని వెనుక కీలకమైన ప్రభుత్వ పెద్దలు ఉన్నారా అన్న అనుమానం వస్తోందని.. ఇప్పుడు ఎవర్ని బాధ్యులని చేస్తారని? నాదెండ్ల నిలదీశారు.