INC: కాలంతో కాంగ్రెస్ కాలు కదిపితేనే…!

INC:

కాంగ్రెస్ పునర్వైభవం, కాంగ్రెస్ కన్నా దేశానికి ఎక్కువ అవసరమనే ప్రజల ఆకాంక్షని పార్టీ నాయకత్వం గ్రహించినట్టుంది. కానీ, అదెలా జరగాలనే విషయంలో దానికొక స్పష్టత లేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) 86వ జాతీయ సమావేశ వేదిక వెల్లడి చేసింది. పాత విషయాల వల్లెవేతనే తప్ప… జాతికి నూతన ఆశలు కల్పించే, మిత్రపక్షాలకు కొత్త నమ్మిక ఏర్పరిచే, పార్టీ శ్రేణులకు తాజా ప్రేరణనిచ్చే అంశాలేవీ తీర్మానాల్లోకి రాలేదు. రాజ్యాంగ స్ఫూర్తి రక్ష, లౌకికవాద పరిరక్షణ, అసలైన జాతీయవాదమే తమ విధానమని మరోమారు నొక్కి చెప్పారే కాని, స్వరంలో తీవ్రత లేదు. జిల్లా కమిటీల్ని పటిష్టపరుస్తూ పార్టీని బలోపేతం చేసే సంకల్పాన్ని నాయకత్వం ప్రకటించింది. పనిచేయని నేతలు తప్పుకొని, కొత్తవారికి చోటివ్వాలని హెచ్చరించింది. మోదీ నాయకత్వంపై ఒంటికాలిపై లేచింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పార్టీని పట్టుగా/గుట్టుగా ఉంచడంపై అధిష్టానానికి శ్రద్దాసక్తులు లోపించినట్టు కనిపిస్తోంది.

కాలం చెల్లిన అంశాలను వల్లెవేయడం కాకుండా కాలంతో కాలు కదిపితేనే కాంగ్రెస్కు మళ్లీ పాత రోజులు వస్తాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఆ దిశలో నాయకత్వమే చొరవ చూపటం లేదు. జాతిపిత గాంధీజీ ఆశ్రమం నెలకొల్పిన సబర్మతి నదీ తీరంలో జరిగిన రెండు రోజుల కాంగ్రెస్ జాతీయ సదస్సు ‘మరో భేటీ’లాగ, సాదాసీదాగానే ముగిసింది. కాంగ్రెస్ మహామహుల పుట్టిల్లయి ఉండీ, మూడు దశాబ్దాలుగా అధికారానికి పార్టీ దూరమైన గుజరాత్ నేల నుంచి గట్టి సందేశం ఇచ్చి ఉండాల్సిందనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. కానీ, సదస్సు చప్పగా సాగిందని పార్టీ ముఖ్యనేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. కాంగ్రెస్ లేని భారత్ (కాంగ్రెస్ ముక్త్ భారత్) నెలకొల్పాలని భారతీయ జనతాపార్టీ నాయకత్వం ముమ్మరంగా ప్రచారం చేస్తూ, పార్టీ ప్రభుత్వాలను కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితం చేసిన తరుణంలో… ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ మిశ్రమ ఫలితాలు సాధించిన 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీ నాయకత్వాన్ని కృంగదీసింది. సంస్థాగతంగా పార్టీ బలహీనపడుతోందనే భయం వెన్నాడుతోంది. పార్టీలో ఉమ్మడి కృషి, గెలుపు తపన, ప్రజల్లో విశ్వాసం కల్పించడం లోపిస్తోంది. ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్రల్లో గెలిచే వాతావరణం, సానుకూల పరిస్థితులుండీ బీజేపీ నేతృత్వపు ఎన్డీయే కూటమి చేతిలో కాంగ్రెస్కు ఓటమి తప్పలేదు. ఇది పార్టీ శ్రేణుల్ని నిస్పృహకు గురిచేసింది. జమ్మూకశ్మీర్, రaార్ఖండ్ రాష్ట్రాల్లో విపక్ష ‘ఇండియా కూటమి’ నెగ్గినా అక్కడ కూటమిలో కాంగ్రెస్ ప్రభావరహితమైన మైనర్ పార్ట్నర్గానే ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ బీజేపీని, ఎన్డీయే కూటమిని కాంగ్రెస్ బలంగా ఎదుర్కోవాల్సిన అవసరముంది. కొన్ని చోట్ల జాతీయ పార్టీని, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తుల్ని, మరికొన్ని చోట్ల జతకట్టిన మతతత్వ శక్తుల్నీ…. ఇలా ఆయా రాష్ట్రాల్లో భిన్నమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే పరస్థితి కాంగ్రెస్కుంది. అందుకే, ప్రస్తుత భేటీ కాంగ్రెస్కు ముఖ్యమైందిగా పార్టీ శ్రేణులు పరిగణించాయి.

యువతరాన్ని ఆకట్టుకోవాల్సిందే!

ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ను ఎవరు సొంతం చేసుకుంటున్నారు? అన్నది ఇవాల్టి యువతకు పట్టే అంశం కానేకాదు. పటేల్-నెహ్రూల మధ్య, లేని అంతరాల్ని ఎగదోస్తూ ప్రత్యర్థులు రాజేసే రాజకీయ కుంపటి చుట్టూ కాంగ్రెస్ తిరగాల్సిన అవసరమే లేదన్నది సగటు కాంగ్రెస్ కార్యకర్త మనోభావన! భారత రాజ్యాంగంపై బీజేపీ దాడిచేస్తోందనే కాంగ్రెస్ ఘాటైన విమర్శకు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే ‘పోలిటికల్ డివిడెండ్స్’ లభించాయి. ‘ఇండియా కూటమికి’ 150 స్థానాలు మించి రావని దేశంలోని 16 ప్రముఖ సర్వే సంస్థలు వేసిన అంచనాల్ని తలకిందులు చేస్తూ, 235 స్థానాలు గెలుచుకోవడం ఈ ప్రచార ప్రభావమే! 400 స్థానాలు ఆశించిన బీజేపీ సొంతంగా 240, కూటమికి 293 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మళ్లీ అదే నినాదాన్ని ఎంత బిగ్గర స్వరంతో వినిపించినా…. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా పనిచేయలేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం`ధరల పెరుగుదల, అభివృద్ది లేమి వంటి సమస్యలు ప్రజల నిత్య ఆలోచనల్లో ఉన్నాయి. ఆయా అంశాల్లో ప్రభుత్వం ఎంతగా విఫలమైందో ఎండగట్టే విపక్ష ఎత్తుగడలు యువతను ఆకట్టుకోవడానికి పనికొస్తాయి. ‘కులగణన’ ఒకస్థాయి వరకు సానుకూల ఫలితాలిచ్చినా, తదుపరి ప్రతికూలించే ప్రమాదముందనే అభిప్రాయాన్ని పార్టీలోని ఒక వర్గం వ్యక్తం చేస్తోంది. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలనే ప్రజాభిప్రాయం స్వాగతించదగిందని, లేకుంటే ప్రాంతీయ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందనే భావనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక వర్కింగ్ కమిటీ (సీడబ్లుసీ) భేటీ కూడా జరిగిన జాతీయ సదస్సు ఈ విషయంలో దేశ ప్రజల దృష్టినాకర్శించలేకపోయిందనే భావన శ్రేణుల్లో ఉంది.

ఆశ, ఆకాంక్ష అయితేనే…..

పార్టీ కీలక తీర్మానానికి మద్దతు పలుకుతూ, సదస్సులో ఎంపీ శశిథరూర్ ఒక మాటన్నారు. ‘‘కాంగ్రెస్ అంటే పగ-ప్రతీకారం కాకుండా ప్రజలకు ఒక ఆశ`ఆకాంక్ష అవ్వాలి. కాంగ్రెస్ అంటే కేవలం గత వైభవమే కాకుండా, సానుకూల దృక్పథం కలిగిన ఒక ఆశావహ భవిష్యత్ కావాలి. వ్యతిరేకిస్తూ చేసే విమర్శమాత్రమే కాకుండా సద్యోచన, నిర్మాణాత్మక సహకారం అందించే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండాలి’’ అన్నారాయన. సదస్సు రెండో రోజు, సాంఫీుకశాస్త్ర పాఠంలా సాగిన రాహుల్ గాంధీ ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్ కృషిని, త్యాగాలను ప్రశంసించడంతో పాటు బీజేపీ-ఆరెస్సెస్ది విపరీత భావజాలమంటూ నిశితంగా విమర్శలు గుప్పించారు. అందరినీ కలుపుకుపోవడం, సమ్మిళితి అభివృద్ది, కులగణన-జనాభా దామాషా ప్రాతినిధ్యం-అవకాశాలు… వంటి అంశాలకు కాంగ్రెస్ తీర్మానాల్లో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ‘‘రాహుల్ ఇలా మాట్లాడాలి, కానీ, మాట్లాడడు’’ అంటూ ప్రఖ్యాత సంపాదకుడు హరీశ్ ఖరే ఒక రోజు ముందుగానే ‘ది వైర్’ వేదికగా వెలువరించిన ప్రసం గం ( వ్యాసం)లోని ముఖ్యాంశాలను రాహుల్ నిజంగానే ప్రస్తావించలేదు. ‘‘….. మతఛాందసం, వేర్పాటువాదం, నియంతృత్వాలకు వ్యతిరేకంగా నా శక్తి మొత్తాన్ని వెచ్చించి కడదాకా పోరాడుతానని విస్పష్టంగా ప్రకటిస్తున్నాను….’’ అనే మాటలతో మొదలై ‘‘…. గాంధీ`నెహ్రూ కుటుంబానికి చెందిన వాడినైనందున, మా తండ్రి, నాయినమ్మ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినందున…. సహజంగానే నేను ప్రధానమంత్రి పదవికి అర్హుడనైతానని మీలో కొందరు భావిస్తుండవచ్చు. కానీ, నాకా ఆలోచన లేదు. నేను గానీ, మా కుటుంబంలో మరెవరైనా కానీ, ఆ పదవిని ఆశించడం లేదు…’’ అనే రాహుల్ మాటలతో హరీశ్ ఖరే వ్యాసం సాగుతుంది. ‘….. వారి త్యాగాలను మననం చేసుకుంటూ, అవి సార్థకం చేయడానికి నేను సేవా మార్గాన్ని ఎంచుకున్నాను. ఇట్లా కూడా కాంగ్రెస్ను, తద్వారా దేశాన్ని బలోపేతం చేయవచ్చు’ అని అందులో పేర్కొన్నారు. కానీ, ఖరే అన్నట్టుగానే ఇవేవీ రాహుల్ మాట్లాడలేదు.

ఈ పద్దతి సరికాదు!

పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తామంటూనే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడే పరిస్థితులను అధినాయకత్వం ఉపేక్షించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. కొన్నిసార్లు పరోక్షంగా అదిష్టానమే ప్రోత్సహిస్తోంది. ఇందుకు తెలంగాణ, కర్ణాటకలో ప్రత్యక్ష ఉదంతాలున్నాయి. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి మీనాక్షీ నటరాజన్ నేరుగా సచివాలయానికి వెళ్లి, మంత్రివర్గ ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివిదాంశాన్ని సమీక్షించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. పార్టీ కార్యాలయమైన గాంధీభవన్లో కాకుండా నేరుగా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థి ప్రతినిధులు, పౌర సంఘాల వారితో ముచ్చటించారు. మళ్లీ వచ్చి, ఆ అంశాలను మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ, ఆయా ప్రతినిధులు, వర్గాల వారితో అది చర్చిస్తుందన్న ముఖ్యమంత్రి మాటలు అమలు కాకముందే, ఆమె ఈ ‘హడావుడి’ చర్యలకు పూనుకున్నారు. ఆమె ఏ హోదాతో సచివాలయంలో ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయ్యారనే ప్రశ్న సహజంగానే తలెత్తింది. ఇది సదరు మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన పరిస్థితి. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు, సొంత పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమైంది. అంతకు ముందు ఇంచార్జీగా ఉన్న దీప్దాస్ మున్షీపై ఒకరకం ఆరోపణలుంటే, గాంధేయవాది, ప్రజాస్వామ్య ప్రేమికురాలు, నిరాడంబరనేత అని పేరున్న మీనాక్షి ఈ చొరవను, ఒక అతిచేష్టగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఢిల్లీలో బీసీ ధర్నా రోజు, అప్పటివరకు స్పందించకుండా ఉండి, ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత రాహుల్, సోనియాలు బీసీ నాయకుల్ని కలవటం కూడా తప్పుడు సంకేతాలనిచ్చిందనే భావన పార్టీలో వ్యక్తమౌతోంది. కర్ణాటకలో పార్టీ ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలున్నాయి. మరోవైపు ఏపీలో పీసీసీ అధినేత్రి పార్టీ అంశాలు కాకుండా, పనిగట్టుకొని విపక్ష పార్టీకి చెందిన జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం వంటివి పార్టీకి మంచి చేయవనే భావన పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఇది పార్టీకి అంత మంచిది కాదు!

=======


-దిలీప్ రెడ్డి,
సీనియర్ జర్నలిస్ట్, పీపుల్స్ పల్స్.

Optimized by Optimole