×

Telangana:

కలతలు లేకుండా కాంగ్రెస్ కలకాలం ఉండలేదేమో? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంటే, తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఒకటొకటిగా తెరకెక్కుతున్నాయి. పైన నివురుగప్పిన నిప్పులా ఉన్నా లోపలంతా గందరగోళం రగులుతూనే ఉంది. ఏ స్థాయిలో ఆ స్థాయి నాయకులందరూ ఎవరికివారే యమునాతీరే… అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చిన్నవో పెద్దవో ప్రతి జిల్లాలో పంచాయితీలున్నాయి. పార్టీ లోగడ అధికారంలో ఉన్నపుడు రాజ్యం చేసిన అవలక్షణాలన్నీ క్రమంగా ఇప్పుడు పొడచూపుతున్నాయి. తేడా వొచ్చేసి, ఆనాడున్నట్టు పార్టీలో హేమాహేమీ నాయకులెవరూ ఇప్పుడు లేరు. పాత కాంగ్రెస్ వారు, తెలుగు (దేశం పార్టీ నుంచి వచ్చిన) కాంగ్రెస్ వారు, విపక్ష బీఆర్ఎస్ నుంచి వచ్చిన కొత్త వారు.. ఇలా మూడు పాయల శిఖలు ముడివడటం లేదు, పరస్పరం పొసగటం లేదు. పార్టీలో అసంతృప్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నా ఒక వేదిక లేక నిరీక్షిస్తున్నారు. మీనాక్షీ నటరాజన్ వచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థలకు ఎన్నికలు ముంచుకువస్తున్న వేళ, ఇవన్నీ సరిదిద్దకుంటే పార్టీ పరిస్థితి ప్రమాదకరమే! ఫలితాలు ప్రతికూలమే!!

కాంగ్రెస్ అంటేనే కలతల కాపురం, కప్పల తక్కెడ! పార్టీ అధికారంలో ఉన్నపుడు ఇది ఇంకాస్త ఎక్కువే! కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రత్యర్థుల సమయం బాగోక, పార్టీ అదృష్టం బాగుంటే… కనీసం ఎన్నికలవరకైనా అందరూ కలిసికట్టుగా పనిచేసి అధికారంలోకి వస్తారు. అయినాక, పరస్పరం పడక కొట్టుకుచస్తారన్నది నానుడి! ఇప్పుడా దృశ్యం తెలంగాణలో క్రమంగా కళ్లకు కడుతోంది. సొంత పార్టీ ప్రభుత్వ పనితీరునే తప్పుపడుతూ కొందరు కోర్టుకెక్కడం. పార్టీ ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడుతున్నారని పై స్థాయి నాయకులు బహిరంగంగా మాట్లాడటం. ప్రభుత్వ విధాన నిర్ణయాలను ముందుగానే కొందరు మంత్రులు ప్రకటించడం, దాన్ని పీసీసీ నేత, సీఎం మందలించడం, ఎన్నికలకు మూడేళ్ల ముందే ఫలానా సీటు నాదే అనో, ఫలానా స్థానం నుంచి నా బిడ్డ పోటీ చేస్తుందనో ఎవరికి వారు ప్రకటించడం… ఇటువంటివన్నీ పార్టీలోని అనైక్యతకు, గందరగోళానికీ అద్దం పడుతున్నాయి. ముఖ్యమంత్రి-కొందరు మంత్రుల మధ్య ఏదో కనబడని సహాయ నిరాకరణలాంటిది ఉందని పార్టీలోనే గుసగుసలున్నాయి. ఇక పలుచోట్ల మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య పొసగటం లేదు. తెగించి కొందరు ఎమ్మెల్యేలు మంత్రిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదే చేశారు. మరికొన్ని చోట్ల వారి మధ్య సమన్వయ లోపం కొట్టచ్చినట్టు కనిపిస్తోంది. ఇంకొంచెం కిందకు వెళితే, సమన్వయ లోపమే కాకుండా ఎమ్మెల్యేలు స్థానిక నాయకుల మధ్య చాలా చోట్ల స్పర్ధలు, గొడవలూ ఉన్నాయి. పరస్పరం వ్యతిరేక కార్యకలాపాలు, చర్యలకే దిగుతున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక దాదాపు పదినెలలకు పీసీసీ కార్యవర్గం వచ్చింది. కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) కయితే ఇప్పటికి కార్యవర్గమే లేదు!


ప్రభుత్వ చర్యలు పరీక్షకు నిలవాల్సిందే!
ఏవి ఎంత వరకు నిజమో కాలం తేలుస్తుంది, కానీ అధికారంలో ఉన్నపుడు అభియోగాలు తప్పవు. సొంత పార్టీ నాయకులే పాలకుల అవినీతిపై విమర్శలు చేస్తున్నారు. నగరంలోని ఖాజాగూడలో 27 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రయివేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని, ఈ వ్యవహారంలో అధికారుల చేష్టల్ని అడ్డుకోవాల్సిందేనని పార్టీ నాయకులే డిమాండ్ చేస్తున్నారు. ‘హైడ్రా’కు ఫిర్యాదు చేసినా తగిన స్పందన లేదనే కోపంతో కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి (జడ్చర్ల), యన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్ నగర్), కే.రాజేశ్వరరెడ్డి (నాగర్ కర్నూల్), మరళీ నాయక్ బుక్యా (మహబూబాబాద్) తదితరులు న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసే పరిస్థితి వచ్చింది. అంతకు ముందు దీపాదాస్ మున్షీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న కాలంలోనే అనిరుద్ రెడ్డి యువనాయకులతో కలిసి ఫామ్ హౌజ్ లో భేటీ కావడం, కొందరు మంత్రులపై నిర్దిష్టంగా ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. ఆయనకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సన్నిహిత సంబంధాలుండటం వంటివి అంతర్గతంగా పార్టీలో ఉన్న విబేధాలకు తార్కాణమని కాంగ్రెస్ లోనే ప్రచారం జరుగుతోంది. బిల్లులు మంజూరు చేయడంలో, డబ్బు విడుదలలో ‘కమీషన్లు’ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చాయి. మున్నెన్నడు లేని విధంగా వంద మందికిపైగా కాంట్రాక్టర్లు ఏకంగా రాష్ట్ర సచివాలయానికే వెళ్లి, ఉపముఖ్యమంత్రి-ఆర్థిక మంత్రి మల్లు విక్రమార్క భట్టి చాంబర్ ముందు ధర్నాకు దిగడం, రభస చేయడం సంచలనం సృష్టించింది. కమీషన్ల వ్యవహారం తలవంపులుగా ఉందని, ఎందుకిలా బయట ప్రచారంలోకి వచ్చిందో స్పష్టత ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గ సమావేశంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు, ఇతర మంత్రులు కొందరు ఆయన్ని అనునయించినట్టు బయట ప్రచారం జరిగింది. బయటకంతా గుంభనంగా కనిపిస్తున్నా… గొంతెత్తడానికి మరికొందరు నాయకులు సమయం కోసం వేచిచూస్తున్నారు.


నియోజకవర్గాలపై కబ్జానా?
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఆరంభం నుంచీ పలుమార్లు వివాదాస్పదమయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును విమర్శించే క్రమంలో ఒక సినీ హీరోయిన్ పేరు ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారమే రేపాయి. అలా మాట్లాడటాన్ని బయటే కాకుండా పార్టీలో అన్ని స్థాయిల్లోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పార్టీ ఢిల్లీ అధిష్టానం మందలించి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. ఇతర ఎమ్మెల్యేలలాగా పనులు చేయడానికి తాను డబ్బులు తీసుకోనంటూ ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ‘అది ఇప్పుడు కాదు, గత ప్రభుత్వ కాలంలో…’ అంటూ తదుపరి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కల్పించాయి. జిల్లాలోనూ ఆమెకు స్థానిక ఎమ్మెల్యేలతో విబేధాలున్నాయి. కడియం శ్రీహరిపై చేసిన దురుసు వ్యాఖ్యలు పలువురి దృష్టినాకర్శించాయి. పాత వరంగల్ జిల్లాలోని అయిదుగురు పార్టీ ఎమ్మెల్యేలు ఆమెకు వ్యతిరేకంగా పార్టీ వ్యవహారాల ఇంచార్జీ అయిన మీనాక్షీ నటరాజన్ కి ఫిర్యాదు చేసినట్టు వార్తలొచ్చాయి. ‘రాజీనామాలు చేసి గెలవాల’ని పార్టీ ఎమ్మెల్యేలకే సవాల్ విసురుతూ మంత్రి సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. దానికి తోడు, పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల నియోజకవర్గం నుంచి, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా తన బిడ్డ పోటీ చేస్తుందనడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఇది ఏకపక్ష, దుందుడుకు శైలి అని తప్పుబడుతున్నారు. పార్టీని లెక్కచేయకుండా ఇలా మాట్లాడటమేమిటని పీసీసీ నాయకత్వం కూడా ఈ విషయంలో ఆగ్రహంగానే ఉంది. రేపు ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తానే పోటీచేయనున్నట్టు, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన క్రికెటర్ అజహరుద్దీన్ ప్రకటించడాన్ని పీసీసీ నాయకత్వం తప్పుబట్టింది. ఆసక్తిని వ్యక్తం చేయడం వేరు, పార్టీలో చర్చించకుండా, నిర్ణయం తీసుకోకుండా ‘నేనే పోటీ చేస్తాను’ అని టిక్కెట్ ఆశించే వ్యక్తి ప్రకటించడమేమిటన్నది నాయకత్వం అభ్యంతరంగా ఉంది.


పెరుగుతున్న అవలక్షణాలు
అన్ని స్థాయిల్లో పార్టీని సమన్వయంతో అదిమిపెట్టే యంత్రాంగం, వ్యవస్థ తెలంగాణ కాంగ్రెస్ లో లేకుండా పోయింది. తొలిసారి తెలుగుదేశం పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత (1989- 94) అయిదేళ్ల పాటు పార్టీ బలహీనపడుతూ వచ్చినప్పటి లక్షణాలు ఇప్పుడు పొడచూపుతున్నాయి. అప్పుడు 294 నియోజకవర్గాలకు గాను పార్టీ ప్రాతినిధ్యం 26కు పడిపోయింది. నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే… వర్గాలుగా చీలినప్పటికీ, కనీసం అప్పుడు పేరున్న, పలుకుబడి కలిగిన బడా నాయకులైనా ఉండేవారు. ఇప్పుడు ఏ నాయకుడూ కనీసం 1+1 (ఒకే కుటుంబంలోని వారు మినహాయిస్తే) ఎమ్మెల్యేల బలంతో లేరు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు, మొదట్నుంచీ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న అసలు కాంగ్రెస్ వాదులు కలగలిసి, వాతావరణం అంతా కలగాపులగంగా ఉంది. ఒకరికొకరికి పడటం లేదు. వివక్షకు గురవుతున్నామని కొందరు ఆందోళ చెందుతున్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని పట్టించుకోవడమే లేదని, ‘ముఖం చూసి బొట్టుపెడుతున్నార’ని ముఖ్యమంత్రిపైన, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులపైన ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో ‘బంగారు తెలంగాణ బ్యాచ్’ లాగానే ఇప్పుడు కాంగ్రెస్ లో ‘తెలుగు కాంగ్రెస్’ ప్రాబల్యం పెరిగిందనే విమర్శ ఉంది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల మధ్య సయోధ్య దాదాపు అసంభవంగానే కనిపిస్తోంది. ఇటువంటివి ఇంచుమించు పార్టీ అన్ని స్థాయిల్లోనూ ఉన్నాయి. పార్టీపై సమగ్రంగా పట్టు ఎవరికీ లేని పరిస్థితి! ‘మా మాదిగలకు మరో మంత్రిపదవి ఇవ్వండి’ అని పార్టీ అధిష్టానాన్ని కోరడం నుంచి,గతంలో లేని విధంగా ‘నాకు మంత్రి పదవి ఇప్పించండి’ అని ఓ ఎమ్మెల్యే నేరుగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను అడగటం వంటి కొత్త లక్షణాలు పెరుగుతున్నాయి.

ఇకపై జిల్లా నాయకత్వానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని గుజరాత్లో ఇటీవల జరిగిన పార్టీ అత్యున్నత సమావేశంలో నిర్ణయించారు. అవసరమైన చోట మార్పులు చేసి, ఆ జిల్లా నాయకత్వాన్ని పటిష్టపరుస్తామని చేసిన ప్రకటన ఆచరణకు నోచుకోలేదు. జిల్లాల్లో సమన్వయం బాగా దెబ్బతిని పరస్పరం కారాలు, మిరియాలు నూరుకొనే తగాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీ నాయకత్వం సత్వరమే రంగంలోకి దిగి, తగు విధంగా సమీక్షించుకొని పార్టీని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.


-దిలీప్ రెడ్డి,
 పీపుల్స్ పల్స్ రీసర్చి సంస్థ.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole