Delimitation:
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో పాలక ‘ఎన్డీఏ’ విపక్ష ‘ఇండియా’ కూటమిలకు పరస్పర విరుద్ద అభిప్రాయాలుండటమే ఈ సందిగ్దతకు కారణంగా కనిపిస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలుపరిచే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియోజకవర్గాల పునర్విభజనను దానికి ముడిపెట్టడం, నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రతిపాదనలపైనే అభ్యంతరాలున్నాయి. ఇదే ప్రతిష్టంభనకు ముఖ్య కారణం. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రెండు చట్టాలు, రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో కొన్ని అంశాలను, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ)లో సమగ్రంగా చర్చించింది. ఇండియా కూటమి బుధవారం సమావేశమై తమ వైఖరి ప్రకటించనుంది. దాన్ని బట్టి ఏయే విషయాల్లో వైరుధ్యం ఉంటుంది? ఎంతమేర ఏకాభిప్రాయం సాధ్యం అనేది స్పష్టం కానుంది.
దేశ ఉమ్మడి ప్రయోజనాల కన్నా ప్రతిదాన్నుంచి రాజకీయంగా లబ్ది పొందాలని చూసినప్పుడే అదొక సమస్యగా మారుతుంది. చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు రిజర్వు చేయాలన్న ప్రతిపాదన ఈ దేశంలో దశబ్దాలుగా నలుగుతోంది. చట్టం చేయాలన్న ఆలోచనలోనే పలు అవరోధాలు ఎదురై ఎట్టకేలకు 2023లో చట్టం ఏర్పడింది. అదికూడా 2024 సార్వత్రిక ఎన్నికల వాకిట్లో ఆదరాబాదరాగా వచ్చిందే! అమలు ఎప్పట్నుంచి? అన్న ప్రశ్న అప్పట్లోనే వివాదాస్పదమైంది. 2024 ఎన్నికల్లోనే అమలు పరచాలని కాంగ్రెస్‌తో సహా పలు పార్టీలు కోరినా అప్పుడు ప్రభుత్వం అందుకు ముందుకు రాలేదు. 2026 తర్వాత అందుబాటులో ఉండే తాజా జనాభా లెక్కలు, నాటి ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమలు పరచాలని నిర్ణయించి, దాన్నే చట్టంలో పొందుపరిచారు. కోవిడ్ కారణంగా 2021లో జరుగని జనగణన 2025లో చేపట్టి ఏడాదిలో పూర్తి చేస్తారని, వెంటనే పునర్విభజన జరిపి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు జరుపొచ్చని భావించారు. కానీ, 2025లో జనగణన మొదలు కాలేదు. ఇప్పుడు చేపట్టినా వచ్చే సంవత్సరం మధ్య నాటికి పూర్తిచేయడం, ఆపై పునర్విభజన కమిషన్ ఏర్పరచాలి. తాజా గణాంకాలతో ఆ ప్రక్రియను పూర్తిచేసి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు కష్టమనే కొత్త అభిప్రాయం బలపడింది. దాంతో, ఇక రిజర్వేషన్ల అమలు 2034 ఎన్నికల్లోనే అనుకుంటున్నారు. ఉన్నట్టుండి ‘లేదు లేదు తాజా జనగణనతో నిమిత్తం లేకుండా పాత (2011 జనాభా ) లెక్కలతోనే పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసేద్దాం’ అని ఎన్డీయే పెద్దన్న బీజేపీ తీసిన కొత్త రాగమే తాజా భిన్నభిప్రాయాలకు కారణం.
మహిళా ఓట్లపై గురి…
చట్ట సభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ఇప్పించడంలో మాకున్నంత పట్టుదల మరెవరికీ లేదని బీజేపీ నాయకత్వం చాటుకోవాలనుకుంటోంది. అందుకే తెలివిగా రిజర్వేషన్ అంశాన్ని పునర్విభజనతో ముడిపెట్టింది. సీట్ల పెంపుతో పునర్విభజనను ముందుకు తోస్తూ, తాజా జనాభా లెక్కల్ని అవసరం లేకుండా ‘డీలింక్’ చేయడం వెనుక వ్యూహం ఉంది. 2023 మహిళా రిజర్వేషన్ చట్టంలో ఉన్నట్టుగా 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అంటే అది తప్పనిసరిగా జాప్యమౌతుంది. 2029లో కాకుండా రిజర్వేషన్ల అమలు 2034కు వెళుతుంది. 2029లో కాకుండా రిజర్వేషన్ల అమలు 2034కు వెళుతుంది. కానీ, 2029లోపే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా అంతకు ముందే జరిగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌ఘడ్, గోవా, కర్టాటక, తెలంగాణ-పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా ఓట్ల మొగ్గుతో లబ్ది పొందవచ్చు అన్నది బీజేపీ నాయకత్వం ఎత్తుగడ. ఈ అంశంపై చర్చ, తమ పట్టుదల, ప్రత్యేక సమావేశాల ద్వారా ఈ నెల 23, 29 తేదీల్లో పోలింగ్ జరగాల్సి ఉన్న తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లను మచ్ఛిక చేసుకోడానికి ఒక అవకాశం ఉంటుందన్నది వారి ఆశ! తాజా జనాభా లెక్కలు వచ్చాక, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్యను పెంచితే ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల వ్యత్యాసం మరింత పెరుగుతుంది. దానికి విరుగుడుగా, కేంద్రంలో`అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యకు ఏకరీతిలో అంతటా 50 శాతం పెంచడం ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదని ప్రచారం చేసెట్టు వ్యూహ రచన చేశారు. అందుకే, తాజా జనాభా లెక్కల కోసం నిరీక్షించకుండా, ఆమేర ప్రత్యేక సమావేశాల్లో చట్టాలను, రాజ్యాంగ సవరణలతో 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు జరుపు కోవాలని కేంద్ర నాయకత్వం ప్రతిపాదిస్తోంది.
మరింత చర్చకు డిమాండ్…
పునర్విభజనలో నియోజకవర్గాల సంఖ్య పెంపుపై మరింత చర్చ జరగాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. పెంపు వెంటనే చేపడితే మూడో వంతు సీట్లు (50 శాతం పెంపు ద్వారా) కొత్తగా వస్తాయి కనుక మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు పరచడంలో ఎవరికీ ఇబ్బందులుండవని పాలకపక్షం వివరిస్తోంది. అలా జరిగితే, తమకు రాజకీయంగా పట్టున్న అధిక జనాభా రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి ఆధిక్యత లభిస్తుంది. తక్కువ మోతాదులో సీట్లు పెరిగే దక్షిణా రాష్ట్రాల్లో తమకు ఎలాగూ పట్టు లేదు కనుక ఆయా రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం ఆరాటపడాల్సిన రాజకీయ అవసరం ఉండదనేది వారి భరోసా! దీన్నే విపక్ష పార్టీలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన కేరళం, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసం చిత్తశుద్దితో జనాభా నియంత్రించిన వారికి శిక్షా? నియంత్రించక విచ్చలవిడి జనాభా పెరుగుదలకు కారణమైన వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచి బహుమతినిస్తారా? అని వారు ప్రశ్నిస్తున్నారు? మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలును సమర్థిస్తూనే సీట్ల పెంపుతో పునర్విభజనపై లోతైన చర్చ జరగాలని కోరుతున్నారు. చట్టసభల్లో ఇప్పుడున్న సంఖ్యలోనే మూడో వంతు స్థానాలు మహిళలకు కేటాయిస్తూ రిజర్వేషన్ అమలు పరచాలని కాంగ్రెస్ చెబుతోంది. ఇందుకు పదిహేనేళ్లనాటి 2011 జనాభా లెక్కలు కాకుండా వెంటనే జనగణన ముమ్మరం చేసి, 2027 మే నాటికి లభించే తాజా గణాంకాల్ని రిజర్వేషన్ల ఖరారుకు వాడుకోవాలని సూచిస్తోంది. బహుషా ‘ఇండియా’ కూటమి అభిప్రాయం కూడా ఇదే అయి ఉండవచ్చు. అందరూ కలిసి, ఈ నెలాఖరున ముగిసే ఎన్నికల తర్వాత లోతుగా చర్చించి నియోజకవర్గాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోవాలని కోరవచ్చు. ఈ నెల 15న జరిగే ‘ఇండియా కూటమి’ భేటీలో ఈ విషయంపై వైఖరి తేలవచ్చు. కేంద్రం వైఖరీని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్‌కు జీఎస్డీపీకి లింక్ పెట్టాలని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. పెరిగే సీట్లలో యాబై శాతం దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలనేది ఈ ప్రతిపాదన అర్ధం. దీనికి ఇతర రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు ఏ మేరకు మద్దతిస్తాయో వేచి చూడాలి.
ప్రత్యామ్నాయం పరిష్కారం..
దేశంలో నియోజకవర్గాల సంఖ్య పెంపు విషయంలో ఏ పద్దతి అనుసరించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో అందరు ఓటర్ల విలువ సమానంగా, ఒకటిగానే ఉండాలని మొదట్లో నిర్ణయించారు. అందుకని ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను, భౌగోళిక స్వరూపాలను మార్చాలని నిర్ణయించారు. ఇందుకుగాను ప్రతి పదేళ్లకోసారి ‘పునర్విభజన కమిషన్లు’ ఏర్పాటు ప్రతిపాదించారు. 1951, 1962, 1972లో అలా కమిషన్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో లోక్‌సభ స్థానాల సంఖ్య 494 నుండి 522కి, 543కి పెరుగుతూ వచ్చింది. పెరిగే జనాభాను నియంత్రించడానికి 1970లలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను తీసుకుంది. పునర్విభజన చట్టం ప్రకారం పెరిగే జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గంలో సంఖ్యను పెంచితే జనాభా నియంత్రణ లక్ష్యాలు, కార్యక్రమాలకు విరుద్ధంగా ఉంటుందనే ఆలోచన 1972 తర్వాత వచ్చింది. అందుకే నాటి లోక్‌సభ స్థానాల సంఖ్య 543కు కట్టడి విధించి, 2000 సంవత్సరం వరకు సంఖ్య మార్చొద్దని నిర్ణయించారు. ఈ మేరకు 42వ రాజ్యాంగ సవరణ (1976)తో ఒకసారి, 2026 వరకూ పెంచొద్దని 84వ రాజ్యాంగ సవరణ (2002) ద్వారా మరోసారి సంఖ్య పెంచకుండా 2026 వరకు కట్టడి చేయాల్సి వచ్చింది. జనాభా ప్రాతిపదికన చట్టసభ (లోక్‌సభ, అసెంబ్లీల్లో)ల సభ్యుల సంఖ్య పెంచినా, కాదని ఇప్పుడున్న సంఖ్యను గంపగుత్తగా 50 శాతం పెంచినా నష్టమేనని, జనాభా పెరుగుదల నియంత్రించిన వారికి శిక్ష, విచ్ఛలవిడిగా జనాభావృద్ధి చేసిన వారికి బహుమతి ఇచ్చినట్టువుతుంది అన్నదే ‘ఉత్తరాది-దక్షిణాది వ్యత్యాస’ వివాదం. ఇప్పుడు దీనికొక ప్రత్నామ్నాయం చూడాలి. 1913 నుండి ‘ప్రతినిధుల సభ’ సభ్యుల సంఖ్యను అమెరికాలో 435కి కట్టడి చేసినట్టు మనదగ్గర కూడా కట్టడి చేయడమో, మరో హేతుబద్దమైన కొత్త ప్రత్యామ్నాయ విధానం వెతకడమో చేయీలి. జనాభా ప్రాతిపదికన ఏకరీతి సర్దుబాటు లోక్‌సభ స్థానాల్లో జరిపి, జనాభా నియంత్రించిన వారికి ప్రోత్సాహాలిచ్చే పద్దతి రాజ్యసభ స్థానాల్లో కల్పింవచ్చనే సూచన వస్తోంది. అంతే తప్ప, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నట్టు ‘ఇబ్బడి ముబ్బడిగా పిల్లల్ని కనండి, మనకు నియోజవర్గాలు పెరిగి ప్రాతినిధ్యం పెరుగుతుంది’ అన్నది పరిష్కారం కాదు. ప్రగతి విరోధమైన ఆ ప్రతిపాదన తప్పు కూడా అవుతుంది.


