హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సినీ పాత్రికేయులు, ప్రముఖులు పాల్గొని ఆయన సినీ, సామాజిక సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ తన జీవిత ప్రయాణంలో తనకు దారి చూపిన నలుగురు వ్యక్తులను ఎప్పటికీ మరువలేనన్నారు. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, గుప్త మాణిక్యాలరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు, నటుడు శోభన్ బాబు తన జీవితాన్ని మలిచారని చెప్పారు. “వ్యాపారంలోనూ, జీవితంలోనూ నిజాయితీని వదల్లేదు. నా జీవితం ఒక తెల్లకాగితం.. దానిపై ఎక్కడా మచ్చ పడలేదు.. ఇకపై కూడా పడనివ్వను” అని స్పష్టం చేశారు.
సినీ రంగంలోకి రావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, అనుకోకుండా హీరోనయ్యానని చెప్పారు. మొదట తన పేరు రాజాబాబు కాగా, అప్పటికే అదే పేరుతో నటుడు ఉండటంతో “మురళీమోహన్”గా మార్చారని గుర్తు చేసుకున్నారు. ఆ పేరే తనకు గుర్తింపు తీసుకొచ్చిందన్నారు.
సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ విజయవంతంగా కొనసాగానని, శోభన్‌బాబు ఇచ్చిన సలహానే ఆ రంగంలో అడుగుపెట్టడానికి ప్రేరణగా నిలిచిందన్నారు. ప్రతి రూపాయినీ పారదర్శకంగా సంపాదించానని, ఎప్పుడూ వివాదాలకు తావివ్వలేదని చెప్పారు. తాను చేసిన సేవలను ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదని, అవసరమైన వారికి నిశ్శబ్దంగా సహాయం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చానన్నారు.
ప్రస్తుత జీవనశైలిపై స్పందిస్తూ, “ఎంత సంపాదించినా చివరకు తినేది నాలుగు మెతుకులే. ఇప్పటికీ సాధారణ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాను. సాదాసీదా జీవితమే నాకు ఇష్టం” అని పేర్కొన్నారు.
పాత్రికేయులతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, తెలుగు సినీ జర్నలిజంలో ఎల్లో జర్నలిజానికి స్థానం లేదని కొనియాడారు. విమర్శలు నిర్మాణాత్మకంగా ఉంటాయని, సినీ పరిశ్రమ-పాత్రికేయుల మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమన్నారు.
ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రభు మాట్లాడుతూ, మురళీమోహన్ క్రమశిక్షణ, వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. ఆయన వెయ్యి మంది విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం చేసి అనేక కుటుంబాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఆయన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు.
అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల జె.వి. ప్రసాద్‌రావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ మురళీమోహన్‌కు పద్మశ్రీ రావడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని పేర్కొన్నారు. సినీ రంగంతో పాటు విద్య, సేవా కార్యక్రమాలు, వ్యాపార రంగాల్లోనూ ఆయన ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొని మురళీమోహన్ను ఘనంగా సత్కరించారు.
