పూరీ: ప్రముఖ ఇసుక శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ మరో వినూత్న కళాకృతితో ఆకట్టుకున్నారు. దుర్గాపూజ సందర్భంగా ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో అమ్మవారిని ప్రత్యేక రూపంలో ఆవిష్కరించారు. ఇసుకతో పాటు 10 రకాల పండ్లు, 22 రకాల కూరగాయలను ఉపయోగించి ‘మా దుర్గా’ శిల్పాన్ని రూపొందించారు.
సంప్రదాయానికి సృజనాత్మకతను జోడిస్తూ రూపొందించిన ఈ కళాకృతి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పండుగ సమయంలో అమ్మవారిని వివిధ రూపాల్లో చిత్రించేందుకు కళాకారులు ప్రయత్నిస్తారని, తాను కూడా అందులో భాగంగానే ఈ ప్రత్యేక కళాకృతిని రూపొందించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు.
కేవలం కళాకృతిని రూపొందించడమే కాకుండా, ప్రకృతి అందాలను ప్రజలకు తెలియజేయడం కూడా తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. పండ్లు, కూరగాయలతో అమ్మవారిని ఆవిష్కరించడం ద్వారా ప్రకృతి వనరులను సృజనాత్మకంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చాటిచెప్పారు.
వినూత్న ఆలోచనతో భక్తిభావాన్ని, కళాత్మకతను మేళవించిన సుదర్శన్ పట్నాయక్ ‘మా దుర్గా’ శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
_ vootkur Pavan ✍🏽
