Delhi:
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, సత్యం, ధర్మం, నీతి మార్గంలో పయనిస్తూ వికసిత భారత్ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ప్రాంతంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఆయన, సమాజాన్ని విభజించే శక్తులను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.
శ్రీరాముడి జీవితం ఆదర్శప్రాయం
శ్రీరాముడి జీవితం మానవాళికి ఎన్నో విలువైన పాఠాలను అందిస్తుందని మోదీ పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యం, ధర్మం, నీతి మార్గాన్ని వీడకూడదని శ్రీరాముడి జీవితం చాటిచెబుతోందన్నారు. పట్టాభిషేకం సందర్భంలో పొంగిపోకుండా, వనవాస సమయంలో కుంగిపోకుండా ధర్మాన్ని ఆచరించిన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు. నిషాదుడిని ఆలింగనం చేసుకోవడం, శబరికి గౌరవం ఇవ్వడం ద్వారా సమానత్వం, దయ, కరుణ, సౌభ్రాతృత్వానికి శ్రీరాముడు ప్రతీకగా నిలిచారని వివరించారు.
రామరాజ్యం అంటే సుపరిపాలన
రామరాజ్యం అంటే మతపరమైన పాలన కాదని, వివక్షకు తావులేని సుపరిపాలనకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే రామరాజ్య స్ఫూర్తి అని తెలిపారు. అధికారం అనేది ప్రజలను పాలించడానికి మాత్రమే కాకుండా, వారి సంక్షేమానికి ఉపయోగపడాలని సూచించారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఆత్మనిర్భర్ భారత్తో వికసిత భారత్
ఎలాంటి సంక్షోభం ఎదురైనా స్వశక్తిపై నమ్మకంతో ముందుకు సాగాలని మోదీ అన్నారు. ఇతరులపై ఆధారపడకుండా మన వనరులు, సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. సముద్రం అడ్డుగా ఉన్నా, లంక దూరంగా ఉన్నా, తన సంకల్పంతో ప్రజల సామూహిక శక్తిని ఏకం చేసి శ్రీరాముడు విజయాన్ని సాధించారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
దేశాన్ని విభజించే శక్తులపై అప్రమత్తంగా ఉండాలి
దేశ గౌరవాన్ని దెబ్బతీసే శక్తులు, సమాజంలో విభేదాలు సృష్టించేవారు, భారతీయ సంస్కృతిని ద్వేషించేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘రాష్ట్ర ప్రథమ్’ (దేశమే ప్రథమం) అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, సత్యం, మానవత్వం పక్షాన నిలిచినప్పుడు అంతిమ విజయం మనదేనని అన్నారు.
భారతీయ వారసత్వ సంపద పరిరక్షణకు ప్రాధాన్యం
దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం ద్వారా జాతీయ ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించుకోవచ్చని మోదీ తెలిపారు. విదేశాలకు తరలించబడిన ప్రాచీన విగ్రహాలను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం గర్వకారణమని అన్నారు.
ప్రసంగం అనంతరం శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి పాత్రలు పోషించిన కళాకారులకు ప్రధాని తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. అనంతరం రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు ప్రజలు పాల్గొన్నారు.
