Cinima:వాస్తవ ఘటనల నేపథ్యంలో ‘రక్తధార’!

హైదరాబాద్‌:

వాస్తవ ఘటనలు, సామాజిక సమస్యలు వెండితెరపైకి వస్తే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. అలాంటి ఓ హృదయవిదారక ఘటన ఆధారంగా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తన దర్శకత్వంలో మూడో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ‘రక్తధార’ పేరుతో రూపొందనున్న ఈ సినిమా రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో జరిగిన ఓ దారుణ ఘటన ఆధారంగా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో కీలకమైన హంతకుడి తల్లి పాత్రను ప్రముఖ నటి సురేఖావాణి పోషించనున్నారు.

నాలుగు దశాబ్దాలుగా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడిగా తన ప్రస్థానాన్ని 2017లో ప్రారంభించారు. పోలీసు అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి విధి నిర్వహణలోని సవాళ్లను సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ చిత్రాన్ని రూపొందించారు. ఆర్‌. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2017 జనవరి 14న విడుదలైంది. పోలీసు మిత్రుల సూచనతో రూపొందించిన ఈ చిత్రం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చిందని శ్రీనివాసరావు వెల్లడించారు.

క్రీడా నేపథ్యంతో రెండో సినిమా

ఇక ఇద్దరు యువకులను ప్రధాన పాత్రధారులుగా తీసుకుని 2024లో ‘రికార్డ్‌ బ్రేక్‌’ పేరుతో స్పోర్ట్స్‌ డ్రామాను స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల నిమిత్తం చెన్నై వెళ్లిన సమయంలో దివంగత ఎన్టీ రామారావుకు చెందిన మద్రాసు నివాసాన్ని కొనుగోలు చేసే అవకాశం లభించిందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్‌ సహకారంతో ఆ ఇంటిని సొంతం చేసుకున్నట్లు చెప్పారు. ఆ భవనాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించకుండా ఎన్టీఆర్‌ నివాసంగానే పరిరక్షించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. త్వరలో అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

పెంపకంలోని లోపాలే ప్రధాన ఇతివృత్తం!

తాజాగా తెరకెక్కించనున్న ‘రక్తధార’లో సమాజాన్ని ఆలోచింపజేసే అంశాన్ని ప్రధానంగా తీసుకున్నట్లు చదలవాడ శ్రీనివాసరావు వివరించారు. కొద్ది నెలల క్రితం షాబాద్‌ మండల కేంద్రంలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఈ చిత్రానికి ప్రేరణగా నిలిచిందన్నారు. వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పాటు మరో కుటుంబానికి చెందిన వారిని కూడా హత్య చేసిన ఘటన నేపథ్యంలో కథను సిద్ధం చేసినట్లు చెప్పారు.

ఒక వ్యక్తి తప్పుదారి పట్టడానికి సమాజంలోని పరిస్థితులే కాకుండా, బాల్యంలో తల్లిదండ్రుల పెంపకం కూడా ప్రభావం చూపుతుందనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించనున్నట్లు తెలిపారు. పిల్లలను చిన్నప్పటి నుంచే సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందనే సామాజిక సందేశాన్ని కథలో అంతర్లీనంగా పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

సురేఖావాణికి కీలక పాత్ర

ఈ సినిమా కథా రూపకల్పనలో సీనియర్‌ సినీ పాత్రికేయుడు బత్తుల ప్రసాద్‌, దర్శకనిర్మాత పి. సునీల్‌కుమార్‌ రెడ్డి సహకరించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, స్థానికులను కలిసి వివరాలు సేకరించిన అనంతరం కథను రూపొందించినట్లు చెప్పారు. ‘రక్తధార’ టైటిల్‌ ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ కాగా, మరో నెల రోజుల్లో నటీనటుల ఎంపిక పూర్తి చేసి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. హంతకుడి తల్లి పాత్రకు సురేఖావాణిని ఎంపిక చేయడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

యువ దర్శకులకు అండగా..

మరోవైపు, కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకు రూ.30 కోట్ల వ్యయంతో పది చిత్రాలను నిర్మిస్తానని ఇటీవల దర్శకుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయని, నవీన్‌ మేడారం దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు.. ‘రక్తధార’తో ఎలాంటి సామాజిక సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి.

Optimized by Optimole